‘సోషల్ మీడియాలో మమ్మల్ని కించపరిచే పోస్ట్‌లు’
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పార్లమెంట్ సభ్యుల్ని కించపరుస్తూ అనేక పోస్టులు వస్తున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ కోరారు. ఆయన గురువారం రాజ్యసభ జీరో ఆవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. సామాజిక మాధ్యమాలు విస్తృతం అవడంతో ఎంపీలను, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ రాజకీయ ప్రత్యర్థులు తమను అవమానిస్తున్నారని ఎంపీ నరేష్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలను ఎదుర్కొవడానికి చట్టాల్లో మార్పులు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఎంపీల జీతభత్యాలపై ప్రజల్లో లేనిపోని అపోహాలు సోషల్ మీడియా ద్వారా రాజకీయ ప్రత్యర్థులు కల్పిస్తున్నారని నరేష్ అగర్వాల్ ఆరోపించారు. ఎంపీలకు అన్ని సౌకర్యాలు, వారికి జీతాలు అంత పెంచారు...ఇంత పెంచారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దీనివల్ల తాము ప్రజల్లోకి వెళ్లినప్పుడు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇటువంటి పోస్టులను ఎదుర్కొవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట విధివిధానాల్ని రూపొందించాలని అన్నారు. కాగా, నరేష్ అగర్వాల్ వాఖ్యలు సభలో కాసేపు నవ్వులు విరిసాయి. మరోవైపు ఈ అంశంపై ఎంపీ నరేష్ అగర్వాల్‌కు కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ శుక్లా కూడా మద్దతు తెలిపారు.
దీనిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ మాట్లాడుతూ..తాను కూడా సోషల్‌మీడియా బాధితుడినే అంటూ వాఖ్యానించారు. నరేష్ అగర్వాల్ వాఖ్యలపై పార్లమెంట్‌వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. ఈ అంశంపై ఏం చేయాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని, త్వరలో దీనిపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని సభలో ప్రకటించారు.