‘సామరస్యం’ జోలికొస్తే ఊరుకోం
అవార్డులు వెనక్కి తీసుకోండి: రాజ్‌నాథ్ వినతి
♦ అందరితో చర్చించేందుకు సిద్ధం
♦ దేశం పరువు, పెట్టుబడులకు విఘాతం కలిగించొద్దు
♦ అసలు అసహనం విపక్ష పార్టీల్లోనే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఎన్డీఏ హయాంలో దేశంలో అసహనం పెరిగిపోతోందన్న వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. లోక్‌సభలో మంగళవారం అసహనంపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో సామరస్యాన్ని భంగపరిచేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదన్నారు. ‘చర్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. ప్రధాని, ప్రభుత్వం తరపున సభకు హామీ ఇస్తున్నా’ అని తెలిపారు. రచయితలు, శాస్త్రవేత్తలు, కళాకారులు వెనక్కి ఇచ్చిన అవార్డులను తిరిగి తీసుకోవాలని.. వారి ఆందోళనలు, సూచనలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశంలో బతికేందుకు అనుకూల పరిస్థితులు లేవని దుష్ర్పచారం చేయటం వల్ల దేశప్రతిష్ఠ మంటగలవటంతోపాటు, విదేశీ పెట్టుబడులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.
దేశ సహనశక్తిని బలోపేతం చేసేందుకు ప్రజలంతా చేతులు కలపాలని రాజ్‌నాథ్ కోరారు. గతంలోనూ ప్రధానమంతులెవరూ ఇలాంటి విషయాలపై మాట్లాడలేదని.. అలాంటప్పుడు ప్రతి దానిపై మోదీ ఎలా స్పందిస్తారని విపక్ష పార్టీ ఎంపీల ప్రశ్నకు బదులిచ్చారు. ‘దేశ అంతర్గత భద్రత నా బాధ్యత. అందుకే నేను వీటిపై స్పందిస్తూనే ఉన్నాను’ అన్నారు. విపక్షాలు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రాజ్‌నాథ్.. దాద్రి ఘటనలో యూపీ సర్కారు, కల్బుర్గీ హత్యపై కర్ణాటక ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు ఆదేశించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ పనితీరుపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారు ముందుకొస్తే.. వారితో చర్చలు జరిపేందుకు సర్కారు తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పారు.
‘మా ప్రభుత్వం అసహనంతోనే ఉందనుకుంటే.. అది అవినీతి, ఉగ్రవాదం, అపరిశుద్ధత, పేదరికం, బాలికలు, మహిళలపె జరుగుతున్న అకృత్యాలపై అసహనమే. తప్ప వేరొకటి కాదు’ అని తెలిపారు. మొదట్నుంచీ బీజేపీ, నరేంద్ర మోదీలే అసహనానికి ప్రధాన బాధితులుగా ఉన్నారని ఆయన చెప్పారు. అవార్డులు వెనక్కి ఇచ్చేసిన వాళ్లలో కొందరు 2014 ఎన్నికలకు ముందు మోదీ ప్రధాని కావొద్దని వ్యాఖ్యానించిన వారేనని.. అసహనమంటే ఇదేనన్నారు. మోదీని ఫాసిస్టు అని విమర్శిస్తున్న వీరంతా ప్రజాతీర్పను గౌరవించటమనే సహనాన్ని అలవరుచుకోవాలన్నారు.
తను మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీలు వాకౌట్ చేయటంపై రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘నేను వాళ్లు మాట్లాడిన ప్రతి మాటనూ ఓపికగా విన్నాను. తీరా నేను మాట్లాడే సమయానికి వాళ్లు వాకౌట్ చేశారు. వాళ్లలోనే సహనం లేదనటానికి ఇదో నిదర్శనమన్నారు. తాము మొదట్నుంచీ సహనంతోనే ఉన్నామని, అలాగే ఉంటామని, తమలో అసహనం పెంచేందుకు ఎందరు ప్రయత్నించినా.. ఆ దిశలో వారు విజయం సాధించలేరని అన్నారు. దేశంలో మూడు అతిపెద్ద అసహనం సంఘటనలు (భారత్-పాక్ విభజన, ఎమర్జెన్సీ, 1984 సిక్కు దాడులు) కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు.
జీఎస్టీకి మద్దతిస్తాం, మీ మంత్రులను నియంత్రించండి: జేడీయూ
మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లుకు నిన్న బీఎస్పీ మద్దతిస్తామని చెప్పగా, నేడు జేడీయూ అదే బాటలో పయనిస్తామంది. అయినా కూడా అసహనం, కేంద్ర మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల పట్ల విపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న దాడిని ఏమాత్రం తగ్గించలేదు. దీనిపై మంగళవారమూ రాజ్యసభలో దాడిని కొనసాగించాయి. రాజ్యసభలో రాజ్యాంగం పట్ల నిబద్ధత అంశంపై చర్చలో జేడీయూ సభ్యుడు కేసీ త్యాగి మాట్లాడుతూ, ‘మేము జీఎస్‌టీ, బీమా, బొగ్గు, గనుల బిల్లులకు మద్దతిస్తాం. అయితే రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని మీ ఐదారుగురు మంత్రులకు చెప్పండి. ఒకరేమో మాజీ రాష్ర్టపతి, జాతీయవాది అయిన అబ్దుల్‌కలాంను ముస్లిం అంటారు. ముస్లింగా ఉండటం నేరమా? మరొకరేమో మాకు ఓటేసిన వారు రాముని వారసుల (రామ్‌జాదే)ని, ఓటేయకపోతే బాస్టర్డ్ (హరామ్‌జాదే) అని అంటారు. పాకిస్తాన్‌లోని హిందువులకు జరుగుతున్న అన్యాయానికి గాను ఇక్కడి ముస్లింలపై కక్ష సాధిస్తారా’ అని ప్రశ్నించారు.
రాజ్యసభలో అవినీతి నిరోధ బిల్లు
అవినీతి నిరోధ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. కొత్తగా ప్రతిపాదించిన ఈ బిల్లులో అవినీతికి పాల్పడిన వారికి గతంలో అమల్లో ఉన్న అయిదేళ్ల శిక్షను ఏడేళ్లకు పెంచారు. జరిమానాను కూడా పెంచారు. కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద్ బిల్లును రాజ్యసభ ముందుంచారు. గత ఏప్రిల్ 29న కేబినెట్ ఆమోదం లభించింది.