భూసేకరణపై మళ్లీ ఆర్డినెన్స్
న్యూఢిల్లీ: భూసేకరణపై మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తక్షణం రాజ్యసభను ప్రొరోగ్ చేయాలని శుక్రవారం సాయంత్రం సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేకపోవటం, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయటం తప్ప ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన సీసీపీఏ సమావేశంలో మంత్రులు సుష్మాస్వరాజ్, మంత్రి వెంకయ్యనాయుడు, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరు కాకపోయినప్పటికీ ఆయన ఈ నిర్ణయాన్ని బలపరిచారు.
డిసెంబర్ 31న జారీ చేసిన భూసేకరణల ఆర్డినెన్స్ కాలపరిమితి ఏప్రిల్ 5తో ముగియనుంది. అంతకంటే ముందే రాజ్యసభను ప్రొరోగ్ చేసి కొత్త ఆర్డినెన్స్ జారీ చేయాలని సీసీపీఏ సిఫార్సు చేసినట్లు వెంకయ్య విలేకరులకు తెలిపారు. అయితే ఎప్పటిలోగా జారీ చేస్తారో చెప్పలేదు ఫిబ్రవరి 23న ప్రారంభమైన బడ్జెట్ తొలి దశ సమావేశాలు మార్చి 20న ముగిశాయి. ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు మలిదశ సమావేశాలు జరుగనున్నాయి. భూసేకరణ బిల్లును తొలిదశ బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ ఆమోదించింది. విపక్షాలవ్యతిరేకతతో రాజ్యసభలో ప్రవేశపెట్టలేకపోయింది. రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో ఏదో ఒక సభను ప్రొరోగ్ చేస్తే తప్ప ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేసే అవకాశం ప్రభుత్వానికి లేదు. అందుకే రాజ్యసభను ప్రొరోగ్ చేయాలని నిర్ణయించారు.
కొత్త ఆర్డినెన్స్‌లో 9 సవరణలు.. లోక్‌సభలో భూసేకరణ బిల్లును ఆమోదించినప్పుడు ప్రతిపాదించిన 9 సవరణలను కొత్త ఆర్డినెన్స్‌లో చేరుస్తారు. ఈ సవరణలకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. బిల్లును రాజ్యసభలో ఆమోదింపచేసుకోవటం కోసం 9 సవరణలతో పాటు మరిన్ని ప్రతిపాదనలతో మలిదశ సమావేశాల్లో రాజ్యసభ ముందుకు బిల్లును తీసుకురావటానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
తొలి ఆర్డినెన్స్‌లో తొలగించిన ‘భూసేకరణకు 80 శాతం రైతుల అనుమతి తప్పనిసరి’ అంశాన్ని కొద్ది మార్పులతో తిరిగి చేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయితే దీన్ని 80 % కాకుండా 51%కి తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక ప్రభావ అంచనా స్థానంలో భూ ఒప్పందాలను పరిశీలించేందుకు నిపుణుల బృందాల ఏర్పాటును ఆర్డినెన్స్‌లో పొందుపరచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రాజెక్టుకు అవసరానికి మించి భూమిని సేకరించారా, దాని వల్ల స్థానికులపై ప్రతికూల ప్రభావం ఏదైనా పడుతుందా అన్న అంశాలను బృందాలు పరిశీలిస్తాయి.