సుప్రీం కోర్టుకు ఈమెయిల్ చేయొచ్చు
లైంగిక వేధింపుల ఫిర్యాదుల స్వీకరణకు మెయిల్ ఐడీ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆవరణలో చోటుచేసుకునే లైంగిక వేధింపుల ఉదంతాలను పరిశీలిస్తున్న కోర్టు కమిటీ(జీఎస్‌ఐసీసీ).. బాధితులు ఫిర్యాదు చేయడానికి సులువైన మార్గాన్ని చూపింది. సుప్రీంకోర్టు ఆవరణలో జరిగే ఈ వేధింపులపై ఫిర్యాదులను కోర్టుకు ఈమెయిల్, రిజ్‌స్టర్డ్ పోస్టు, కొరియర్‌ల ద్వారా పంపేందుకు అనుమతించాలని నిర్ణయించింది.
‘లింగ చైతన్యం, సుప్రీంకోర్టు వద్ద మహిళలపై లైంగిక వేధింపులు(నిరోధం, నిషేధం, పరిష్కారం.. జీఎస్‌ఐసీసీ)’లోని 2ఏ నిబంధన ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. బాధితులు తమ ఫిర్యాదులను కమిటీ కార్యదర్శి, రిజిస్ట్రార్ రచనా గుప్తకు వ్యక్తిగతంగానే కాకుండా ఆమె ఈమెయిల్ ఐడీ gupta.rachna@indianjudiciary.gov.in కి కూడా పంపొచ్చని ఓ సర్క్యులర్‌లో తెలిపింది. గత ఏడాది నవంబర్‌లో ఏర్పాటైన తమ కమిటీకి ఇప్పటికి వరకు ఇద్దరు మహిళా న్యాయవాదుల నుంచి రెండు ఫిర్యాదులు అందాయంది.