"రెడ్ మి ప్రో" టీజర్ వచ్చేసింది
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి, కొత్తగా మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్న రెడ్ మి ప్రో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఉత్సాహవంతులైన యూజర్ల కోసం షియోమి, రెడ్ మి ప్రో టీజర్ ను విడుదల చేసేసింది. చైనీస్ టెక్ కంపెనీ వైబోలో తన టీజింగ్ ను ప్రారంభించింది. ఓలెడ్ డిస్ ప్లే, మీడియా టెక్స్ 10-కోర్ ప్రాసెసర్ తో రెడ్ మి ప్రో మార్కెట్లోకి రాబోతున్నట్టు షియోమి హింట్ ఇచ్చింది. జూలై 27న చైనాలో ఈ ఫోన్ లాంచింగ్ కు సిద్ధమైంది.
మొదటి టీజర్ లో ఓలెడ్ పింగ్ వంట చేస్తున్న ప్రముఖ చెఫ్ లియు షి షి దృశ్యాలు, దీంతో తర్వాత రాబోతున్న స్మార్ట్ ఫోన్ ఓలెడ్ డిస్ ప్లే అని తెలుస్తోంది. ఈ డిస్ ప్లేతో బ్యాక్ లైట్ లేకుండానే అంకెలను, టైమ్ ను చూసుకునే వీలుంటుందట. అదేవిధంగా రెండో టీజర్ ద్వారా రెడ్ మి ప్రో ప్రాసెసర్, డెకా కోర్ ప్రాసెసర్ అని హింట్ ఇచ్చేసింది. అయితే ఈ టీజర్ లో సైజు, రెసుల్యూషన్ గురించి ఎలాంటి వివరాలను విడుదల చేయలేదు.
గత కొంతకాలంగా చక్కర్లు కొట్టిన లీక్ లో ఈ ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలోతో రన్ కాబోతుందని సమాచారం. యూనిబాడీ మెటల్ డిజైన్ తో ఇది రాబోతుందట. అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుక వైపు మిస్ అయి, ముందు వైపు ఉంటుందని ముందస్తు లీక్ లు వెల్లడించాయి. బ్లూటూత్, 4జీ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వై-ఫై 802.11ఏసీ, జీపీఎస్ లు లీకేజీలోని రెడ్ మి ప్రో ఫీచర్లు.. మరి ఈ లీక్ లన్నీ నిజమవుతూ రెడ్ మి ప్రో విడుదల అవుతాదో లేదో జూలై 27వరకు వేచి చూడాల్సిందే.