అమెరికా రాజకీయాల్లోనూ రాణించాలి
- ప్రవాసాంధ్రులకు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పిలుపు
- తానా–కాకర్ల సుబ్బారావు పురస్కారం అందుకున్న యార్లగడ్డ
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ, వైద్యం, న్యాయవాద, వ్యాపార రంగాల్లో చెరగని ముద్ర వేసుకొని అమెరికా ఆర్థిక, సామాజిక, పౌర వ్యవస్థలో మమేకమైన ప్రవాస తెలుగు వారు ఆ దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కోరారు. ఆదివారం సెయింట్ లూయీలో తానా 21వ ద్వైవార్షిక మహాసభల ముగింపు వేడుకల్లో భాగంగా తానా–కాకర్ల సుబ్బారావు జీవన సాఫల్య పురస్కారాన్ని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అందుకున్నారు. ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, సినీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు, ఎంపీ మురళీమోహన్ ఈ పురస్కారాన్ని యార్లగడ్డకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభూమి రుణం తీర్చుకోమంటూ ప్రభుత్వాలు ప్రవాసులకు చేస్తున్న విజ్ఞప్తులు సబబే అయినప్పటికీ, తమ సంపద, సమయాలను పూర్తిగా మాతృదేశంలోనే కాకుండా అమెరికా రాజకీయ వ్యవస్థలోకి అడుగిడేందుకు వినియోగించాలని సూచించారు.ఎన్టీ రామారావు జన్మదినం నాడు తాను జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.