పరీక్షల్లో అక్రమాలపై సీఎం సీరియస్
నిన్న మొన్నటి వరకు యాంటీ రోమియో స్క్వాడ్లతో సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఇప్పుడు పరీక్షల్లో అక్రమాల మీద దృష్టిపెట్టారు. యూపీలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అక్రమాలకు పాల్పడుతున్న కేసులు బయట పడుతుండటంతో ఆయన సీరియస్‌గా స్పందించారు. గత కొన్ని రోజులుగా ఈ విషయంలో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పరీక్ష కేంద్రాలు, 111 మంది సెంటర్ డైరెక్టర్లు, 178 మంది ఇన్విజిలేటర్లు, 70 మంది విద్యార్థులపై పోలీసు కేసులు నమోదయ్యాయి. అలాగే 57 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడానికి వీల్లేకుండా నిషేధం విధించగా, 54 కేంద్రాల్లో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలను కూడా రద్దు చేసేశారు.
పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి నడుంకట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ముందుగా విద్యాశాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి వాళ్లకు కచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. ఆయన ప్రమాణస్వీకారం చేయడానికి మూడు రోజుల ముందే పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల హామీలను శరవేగంగా నెరవేర్చడంలో భాగంగా ముందుగా ఆయన అక్రమ కబేళాలపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటుచేశారు. విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలలో ఒక్కరు కూడా కాపీ కొట్టడానికి వీల్లేదని గట్టిగా చెప్పారు. మాస్ కాపీయింగ్ ఎక్కువగా జరిగే రాష్ట్రాలుగా యూపీ, బిహార్‌లకు ఎప్పటినుంచో పేరుంది. బిహార్‌లో గత సంవత్సరం అక్రమ మార్గాలలో టాప్ ర్యాంకులు పొందిన పలువురు విద్యార్థులను అరెస్టు చేసిన విషయం కూడా తెలిసిందే.