
అఖిలేశ్‌కు 'బొమ్మ' పడింది!
యూపీలో 60 లక్షల రేషన్‌కార్డులు ఔట్!
ఉత్తరప్రదేశ్‌లో గత అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ముద్రించిన 60 లక్షల రేషన్‌కార్డులను చెత్తకుండీలో పడేయాలని యోగీ ఆదిత్యనాత్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి సీఎం అఖిలేశ్ ఫొటోతో దాదాపు 60 లక్షల రేషన్ కార్డులను అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ముద్రించింది. వీటిని అట్టహాసంగా పంపిణీ చేయాలని అఖిలేశ్ భావించినప్పటికీ ఈలోపే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చింది. దీంతో ఈ కార్డులను అప్పటి అఖిలేశ్ ప్రభుత్వం ప్రజలకు పంచలేకపోయింది.
ఈ రేషన్ కార్డులపై అఖిలేశ్ బొమ్మతోపాటు సమాజ్‌వాదీ పార్టీ జెండాకు చెందిన ఎరుపు, ఆకుపచ్చ రంగులు కూడా ఉన్నాయి. ఎన్నికలకు ముందు అఖిలేశ్ ప్రభుత్వం దాదాపు మూడుకోట్ల ఈ తరహా రేషన్‌కార్డులను ప్రజలకు పంపిణీ చేసింది. ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ పథకాలన్నింటి నుంచి అఖిలేశ్ బొమ్మను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ముద్రించిన 60 లక్షల రేషన్‌కార్డులను బుట్టదాఖలు చేయాలని, వాటిని పంచకూడదని యోగి సర్కారు నిర్ణయించింది. అంతేకాదు ఇప్పటికే పంపిణీ చేసిన మూడు కోట్ల రేషన్ కార్డులను కూడా తొలగించి.. వాటి స్థానంలో బీజేపీ సర్కారుకు సంబంధించిన చిహ్నాలతో కొత్తవి జారీచేయాలని భావిస్తోంది.