చాలా బాధగా ఉంది: వైఎస్ భారతి
గుంటూరు: ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న తన భర్త వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుండడంపై ఆయన సతీమణి వైఎస్ భారతి ఆందోళన వెలిబుచ్చారు. తన భర్త ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదని అన్నారు. జగన్ ను ఈ పరిస్థితుల్లో చూస్తే బాధగా ఉందని చెప్పారు.
దీక్షా ప్రాంగణం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. 'షుగర్ లెవెల్ కూడా 61కి వచ్చేసింది. అది కనీసం 80 పైన ఉంటే మంచిదని చెబుతున్నారు. మంత్రులు వాళ్లేం చేస్తారో అది మాట్లాడితే మంచిది గానీ, పక్కన వాళ్లను తప్పుపడితే ఎలా? వైఎస్ జగన్ ఆరు రోజుల నుంచి ఏమీ తినడం లేదు. చాలా బాధగా ఉంది' అని వైఎస్ భారతి అన్నారు.