అర్ధరాత్రి పోలీసు దాడులపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం | YS Jagan at Aryavishya meet, condemned police raids | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి పోలీసు దాడులపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Published Sat, Aug 19 2017 12:14 PM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

YS Jagan at Aryavishya meet, condemned police raids

- మహిళలు, చిన్నపిల్లల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
- వారెంట్లు లేకుండా ఇళ్లలోకి వచ్చే హక్కు మీకు ఎవరిచ్చారు?
- మోసకారి చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది
- నంద్యాలలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధినేత



నంద్యాల:
అర్ధరాత్రి ఇళ్లపై దాడులు చేస్తోన్న పోలీసులు.. కుటుంబాల్లోని మహిళలు, చిన్నపిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నంద్యాల పట్టణంలో కొందరి ఇళ్లను టార్గెట్‌ చేసుకుని.. సెర్ఛ్‌వారెంట్లు లేకుండా సోదాలు జరిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ఆగ్రహించారు. శనివారం నంద్యాల టౌన్‌ హాలులో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాలకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, నంద్యాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, ఇతర కీలక నేతలంతా పాల్గొన్నారు.

‘సత్యనారాయణ, రమేశ్‌ లాంటి వాళ్ల ఇళ్లపై పోలీసులు రాత్రి వేళల్లో దాడులు జరపాల్సిన అవసరమేముంది? పోనీ సోదాల్లో చివరికి ఏమైనా దొరికాయా అంటే, అదీ లేదు. ఇంట్లో ఏది దొరికితే దానిని సీజ్‌ చేస్తారు. అమృతరాజ్‌, నాగిరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రామలింగారెడ్డి, లక్ష్మీనారాయణ, బాల హుస్సేన్‌, భువనేశ్వర్‌ల ఇళ్లపైనా దాడులు చేసి రూ.10 వేలు, రూ.20 వేలు సీజ్‌ చేశారు. ఈ దాడులకు సంబంధించి ఒక వారెంట్‌ ఉండదు, ఒకేసారి 40,50 మంది పోలీసులు బిలబిలా ఇళ్లలోకి వచ్చేస్తారు. వాళ్లను చూసి మహిళలు, పిల్లలు భయపడిపోతున్నారు’ అని వైఎస్‌ జగన్‌ ఆవేదన చెందారు.



మోసం చేస్తోన్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దానినీ నెరవేర్చకుండా గడిచిన మూడున్నర సంవత్సరాలుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు.. సమాజంలోని అన్నివర్గాలనూ చంద్రబాబు మోసం చేశారు. 2014లో ముఖ్యమంత్రి హోదాలో కర్నూలులో జెండా ఎగరేసి, జిల్లాకు చాలా హామీలిచ్చారు. వాటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదన్న సంగతి జిల్లా వాసులకు తెలిసిందే. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారు. మోసకారి చంద్రబాబుకు బుద్ధిచెప్పాల్సిన సమయం వచ్చింది’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement