మత్స్యకారులకు అండగా ఉంటా : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి | Ys Jagan mohan reddy assures Support to Fisherman | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు అండగా ఉంటా : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

Published Thu, Nov 28 2013 12:53 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

Ys Jagan mohan reddy assures Support to Fisherman

* ‘పశ్చిమ’ తుపాను బాధితులకు భరోసా ఇచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* అధికారంలోకి రాగానేఉప్పు మడులకు గోడౌన్లు
*మత్స్యకారులకు రుణాలు, రాయితీలు
*ఈ రాష్ట్రంలో ప్రభుత్వముందా లేదా?
*పంట నష్టాన్ని పట్టించుకున్న వారేరీ?
*ఎకరాకు రూ. 10 వేల పరిహారమివ్వాలి
*రైతులకు చుక్క కిరోసిన్,     పది గ్రాముల బియ్యమైనా ఇచ్చారా?
*ఇంకా ‘నీలం’ పరిహారమే ఇవ్వరా?
*బాధిత రైతుల రుణాలు మాఫీ చేయాలి

 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు: నెల రోజుల్లో రెండు తుపాన్లు రైతులను, మత్స్యకారులను దారుణంగా దెబ్బ తీశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. ఒక్కరంటే ఒక్కరు కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదని ఆక్షేపించారు. ‘‘రైతులు పూర్తిగా నష్టపోయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దానికి మనసే లేదు. తుపాను బాధితుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘నాలుగు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీ కష్టాలన్నీ తీరుస్తా. మత్స్యకారులను అన్నివిధాలుగా ఆదుకుంటా’’ అంటూ భరోసా ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో హెలెన్ తుపానుతో దెబ్బతిన్న పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. నరసాపురం మండలం సారవలో రైతు సమస్యలను ప్రస్తావించారు.
 
 సముద్ర తీర గ్రామమైన పెదమైనవాని లంకలో మత్స్యకారుల గురించి మాట్లాడారు. ‘గతంలో నేనీ గ్రామానికి వచ్చినప్పుడు మూడు హామీలు ఇచ్చిన విషయం నాకు గుర్తుంది. ఉప్పు మడుల్లోకి దిగి రైతులు పడుతున్న బాధలను గతంలో చూశాను. అది నాకు బాగా గుర్తుంది. అప్పుడు చెప్పినట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప్పు రైతులకు గోడౌన్లు నిర్మించి ఇస్తాం. గ్రామానికి వచ్చేందుకు ఇబ్బంది లేకుండా ఉప్పుటేరుపై బ్రిడ్జి నిర్మిస్తాం. తరచూ సముద్రపు కోతకు గురవుతున్న పెదమైనవాని లంక గ్రామాన్ని రక్షించేందుకు విశాఖ తరహాలో సముద్రపు ఒడ్డున పెద్ద బండరాళ్లతో అడ్డుకట్ట వేయిస్తాం. మత్స్యకారులకు వలలు, బోట్లతో పాటు రుణాలిప్పించేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని హామీ ఇచ్చారు. అంతేగాక మత్స్యకారుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తమ ప్రభుత్వంలో నిర్వహించే రచ్చబండను పెదమైనవాని లంకలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
 
 కొనుగోలు కేంద్రాలేవీ?
 సారవలో నష్టపోయిన రైతులను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. పంట నీటిలో తడిసిపోయినా ఏ కొంచెమైనా మిగులుతుందన్న ఆశతో రైతులు పంటను కోస్తున్నారని, వారికి జరిగిన నష్టం గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బ తిన్న పంటల గురించి లెక్కకూడా రాసుకోలేదని రైతులు తనకు చెబుతున్నారన్నారు. పంట కోల్పోయి బాధలో ఉన్న రైతులకు ప్రభుత్వం ఒక చుక్క కిరోసిన్, పది గ్రాముల బియ్యం కూడా ఇవ్వలేదని విమర్శించారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదన్నారు. నీలం తుపాను వచ్చి సంవత్సరం దాటినా ఇంతవరకూ చాలామంది రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
 
 మనసు లేని ప్రభుత్వమిది
 రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదని జగన్ విమర్శించారు. ‘ఇప్పటికే రెండు తుపానులు వచ్చాయి. మరో తుపాను వస్తుందని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అయినా రైతుల గురించే ఆలోచించకపోవడం దారుణం’ అన్నారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఎలా ఆదుకోవాలో తెలుసుకునేందుకు గతంలో హుడా కమిషన్‌ను వేశారు.ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే. ఆయన అన్నిచోట్లా తిరిగి, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని నివేదిక ఇచ్చారు. వాళ్ల పార్టీ వ్యక్తి ఇచ్చిన నివేదిక ప్రకారం రైతులకు పరిహారమివ్వాలనే జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు’’ అని విమర్శించారు. తుపాన్లతో నష్టపోయిన ప్రతి రైతుకూ రుణ మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.10 వేల పరిహారాన్ని వెంటనే రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్డీ లేని రుణాలతో పాటు 75 శాతం ఇన్‌పుట్ సబ్సిడీతో రైతులకు విత్తనాలు ఇవ్వాలన్నారు. ఇవన్నీ రైతులకు ఇప్పించేందుకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
 
 ‘ఒకవేళ అప్పటికీ ఇవ్వకపోతే నాలుగు నెలలు ఓపిక పట్టండి. ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు కచ్చితంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తాను’ అని రైతులకు హామీ ఇచ్చారు. మరో ప్రకృతి విపత్తు వస్తుందని హెచ్చరిస్తున్నా తనకోసం వేచి ఉండి ఆదరణ చూపించిన  వారిని మరచిపోలేనన్నారు. పర్యటనలో జగన్ వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, నరసాపురం, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, ఆళ్ల నాని, మద్దాల రాజేశ్, తానేటి వనిత, పాతపాటి సర్రాజు, గ్రంధి శ్రీనివాస్, నాయకులు కొయ్యే మోషేన్‌రాజు తదితరులున్నారు.
 
 మునిగిపోయిన వరి చేలను పరిశీలిస్తూ..
 నరసాపురం నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన జగన్‌కు అడుగడుగునా రైతులు, మత్స్యకారులు, సాధారణ ప్రజలు తమ బాధలు వివరించారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం, సారవ, మోడి, వేములదీవి ఈస్ట్, తూర్పుతాళ్లు, పెదమైనవాని లంక గ్రామాల్లో దెబ్బ తిన్న పంటలను, ఉప్పు మడులను ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి పాలకొల్లు మండలం దిగమర్రు వెళ్లి పంట పొలాలను పరిశీలించారు. ప్రతిచోటా జనం ఆయన్ను ఆపి తమ కష్టాలు వివరించడంతో పర్యటన ఆలస్యమైంది. వరి రైతులతో వారెంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం వచ్చింది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
 
 వర్షపు నీళ్లలో నానుతున్న పొలాల్లోకి సైతం దిగి రైతుల సమస్యలను విన్నారు. రోడ్డుపై వరి పనలను ఆరబెట్టుకున్న రైతులను, పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు, మహిళా రైతులను పలకరించి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రతిచోటా తమ ఇబ్బందులు చెబుతున్న వారిని ఓదారుస్తూ, త్వరలోనే కష్టాలు తీరతాయని భరోసా ఇస్తూ ముందుకెళ్లారు. పెదమైనవాని లంక వెళ్లేసరికే రాత్రి 7 గంటలైంది. దీంతో నరసాపురం నియోజకవర్గంలో మిగతా గ్రామాల పర్యటనను రద్దు చేసుకుని పాలకొల్లు నియోజకవర్గంలోని దిగమర్రు వెళ్లి దెబ్బతిన్న పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. అనంతరం రాత్రి 10.52 గంటలకు తాడేపల్లిగూడెం నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ బయల్దేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement