సర్కారు నిర్లక్ష్యంతోనే ఈ దుర్ఘటన
బాణ సంచా పేలుడు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: వైఎస్ జగన్
♦ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబుకు బాధితులను పరామర్శించాలనే ఆలోచనే లేదు
♦ గిరిజన సలహా మండలిని వెంటనే నియమించాలి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘తూర్పు గోదావరి జిల్లాలో ఏడాది, ఏడాదిన్నర కిందట బాణా సంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగి ప్రజలు మరణించినా ప్రభుత్వం మేలు కోలేదు. ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. ఫలితంగా నెల్లూరులో జరిగిన పేలుడులో ఆరుగురు చనిపోయారు, మరో 10 మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టా డుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కళ్లు మూసుకోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిం ది’’అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ దుర్ఘటనకు చంద్రబాబు బాధ్యత వహిం చాలని డిమాండ్ చేశారు.
ఆయనకు సిగ్గు, శరం ఉన్నా మృతులు, క్షతగాత్రుల కుటుం బాలను పరామర్శించి వారికి భరోసా ఇవ్వా లని, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరం పొర్లుకట్ట వద్ద గత నెల 31న అనధికారిక బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో తీవ్రంగా గాయపడి నారాయణ వైద్యశాలలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న 11 మంది క్షతగా త్రులను ఆయన మంగళవారం పరామర్శిం చారు. మృతి చెందిన ఆరుగురి కుటుంబ సభ్యులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి
నెల్లూరు బాణసంచా ప్రమాదంలో ఆరుగురు మరణించి, మరో 11 మంది చావు బతుకుల తో పోరాడుతున్నా 100 కిలోమీటర్ల దూరం లో ఉన్న చంద్రబాబుకు వారిని పరామర్శిం చేందుకు మనసు రాలేదని జగన్ ధ్వజ మెత్తారు. గతంలో తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగినప్పుడు తాను వెళ్లానని గుర్తు చేశారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మృతుల కుటుం బాలకు డబ్బులు పడేసి ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్త చర్యలూ తీసుకోకపోవడంవల్లే నెల్లూరులో మళ్లీ ఈ దుర్ఘటన జరిగిందన్నారు. అనుమతి, రక్షణ ఏర్పాట్లు లేకుండా బాణసంచా తయారీ జరుగుతుంటే, ఆ కేంద్రాల్లో దుర్ఘటన జరిగితే ప్రభుత్వానిది బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారు, గాయపడిన వారంతా ఎస్‌టీలేనని చెప్పారు. ఐటీడీఏ నిధులు రానందువల్లే, ఉపాధి పను లు లేనందువల్లే పేదలు కూలి కోసం ప్రాణా లను పణంగా పెట్టి పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్ విద్యార్థి రూ.200, రూ.250 కూలి కోసం ప్రాణాపాయమైన పనికిపోయి విషమ పరిస్థితిలో ఉన్నాడంటే బాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. బాబుకు ఇప్పటికైనా బుద్ధి, జ్ఞానం ఉంటే మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించి మళ్లీ ఇలాంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుని, ఇలాంటి వారందరికీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా వస్తుందని, నెల్లూరు ఘటనలో మృతులకు కూడా ఇదే సొమ్ము ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకో వాలని చూస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ తప్పిదంవల్లే ఈ సంఘటన జరిగినందువల్ల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా అ«ధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, జెడ్‌పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పాల్గొన్నారు.
గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలి
శాసనసభలో గిరిజన ఎమ్మెల్యేలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడంతో ప్రభుత్వం మూడేళ్లుగా గిరిజన సలహా మండలిని నియమించకుండా రాజ్యాంగాన్ని కాలరాస్తోందని జగన్ ధ్వజమెత్తారు. ఈ కమిటీని ఎందుకు నియమించడం లేదో చంద్రబాబు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని హితవు చెప్పారు. ప్రభుత్వం ఈ కమిటీని నియమిస్తే గిరిజనులకు సంబంధించిన నిధుల పర్యవేక్షణ జరుగుతుందన్నారు. కమిటీ లేకపోవడంవల్ల గిరిజనులకు సక్రమంగా నిధులు అందడం లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా గిరిజన సలహా మండలిని నియమించాలని డిమాండ్ చేశారు.