ఏరువాక రోజైనా నమ్మకం కలిగించండి
చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి సూచన
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయమే దండగని మాట్లాడిన సీఎం చంద్రబాబు ఈరోజు ఏరువాక చేయడం సంతోషించదగ్గ విషయమే గానీ ఇది ప్రచార ఆర్భాటంగా ముగించకుండా రైతులకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వ చర్యలు కొనసాగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి ఆకాంక్షించారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఏరువాక కేవలం ఏదో టీవీల్లో ప్రచారం కోసమో, పార్టీ కార్యకర్తల కోసమో రెండెద్దులను చక్కగా అలకరించి నాగలి పట్టుకోవడం కాదు. రైతు నాగలి కర్రు పొలంలో దించిన రోజు నుంచి పంట ఇంటికి వచ్చేదాకా అండగా ఉంటామని ప్రభుత్వం నమ్మకం కలిగించాలి.
అంతే తప్ప ఏరువాక అంటే ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదు.షో కోసమో, పత్రికలకు, టీవీలకు ఫోజులిస్తే రైతులకు ఏమి ఉపయోగం?’’ అని ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ వ్యవసాయ విధానం ఒక దిక్చూచి లేకుండా సాగుతోందని విమర్శించారు. ‘‘ఎన్నికలప్పుడు గొప్పగా వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చారు. ఆ మాట నమ్మి ఓట్లేసినందుకు రెండేళ్ల నుంచి సరైన పెట్టుబడులు లభించక రైతులు అధిక వడ్డీల బారిన పడ్డారు. ఏరువాక ప్రారంభించే సమయంలోనైనా రుణాలన్నీ మాఫీ చేశామని శుభవార్త చెబితే అదే పదివేలు’’ అని అన్నారు.
కృష్ణాకాల్వలకు ఎప్పుడు నీళ్లు వదిలేదీ, ఏఏ ప్రాంతాలకు నీరిచ్చేది ప్రభుత్వం ముందుగానే ప్రకటించడం పరిపాటని పార్థసారధి చెప్పారు. ఈ ఏడాది ఆ దాఖాలాలు లేవన్నారు. పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, సబ్సిడీలు విడుదల చేయడంలో చూపుతున్న శ్రద్ధ, ఉత్సాహం రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్స్ చెల్లించడంలో చూపడం లేదని పార్థసారధి అన్నారు. రైతు రుణాలన్నీ మాఫీ చేసి, కొత్తగా ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు.