బందరులో నేడు జగన్ ధర్నా
కొత్తమాజేరు బాధితులకు ప్రభుత్వ సాయం అందనందుకు నిరసన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కొత్తమాజేరులో విషజ్వరాల బారిన పడి మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలతో కలిసి మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ధర్నా చేపట్టనున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందనందుకు నిరసనగా ఈ ధర్నా చేపడుతున్నారు.
ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం తెలిపారు. బందరులో ధర్నా అనంతరం వైఎస్ జగన్ విజయవాడకు చేరుకొని కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు.
రేపు సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ధర్నా...
బుధవారం విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులతో కలిసి ధర్నా చేపట్టనున్నారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి భూసేకరణ పేరుతో బలవంతంగా భూములను లాక్కునేందుకు బెదిరింపులకు దిగుతున్న ప్రభుత్వ తీరుపై నిరసనగా జరగనున్న ఈ ధ ర్నాలో జగన్ పాల్గొని మాట్లాడతారు. ఇప్పటికే రాజధాని ప్రాంత భూ బాధిత రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరాడుతున్న సంగతి తెలిసిందే.