' కుప్పం సమైక్య శంఖారావం సభలో జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటన
' రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం
' 30కి పైగా ఎంపీ స్థానాలను మనం గెల్చుకుందాం: ప్రజలకు జగన్ పిలుపు
' తెలుగుజాతి చరిత్ర తెలియనివారు రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తున్నారు
' ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య పోరాటం
' సోనియా తన కుమారుడిని ప్రధానిని చేసేందుకు రాష్ట్రాన్ని విడదీస్తున్నారు
' అందుకు కిరణ్, చంద్రబాబు మద్దతు పలుకుతున్నారని మండిపాటు
' కుప్పంలో సమైక్య శంఖారావం సభకు పోటెత్తిన ప్రజలు
' రాష్ట్రాన్ని విడదీస్తే శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఉప్పునీరు తప్ప మంచినీరేదీ?
' ట్రిబ్యునళ్లు, బోర్డులు ఉండగానే పై రాష్ట్రాల నుంచి చుక్కనీరు రాని పరిస్థితి ఉంది
' ఈ నష్టాలన్నీ కిరణ్‌కు, చంద్రబాబుకు తెలియదా.. తెలిసినా కళ్లున్న కబోదిలా నాటకాలాడుతున్నారా?
' హైదరాబాద్‌ను విడిచిపోతే సీమాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి?
ఇక్కడ జరుగుతున్నది ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య పోరాటం. నేను గట్టిగా కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీరు గట్టిగా సమాధానం చెప్పాలి. ‘రాష్ట్రాన్ని విడగొడతామని అంటున్నారు’ మీరు ఒప్పుకుంటారా? ’ (ఒప్పుకోం.. ఒప్పుకోం అని జనస్పందన). మీరు తెలుగులో చెప్తున్నారు. తెలుగులో చెప్తే ఢిల్లీ వారికి, సోనియాకు అర్థం కాదు. కిరణ్, చంద్రబాబుకు కూడా అర్థం కాదు. ‘నో’ అని చెప్పండి. (నో.. నో అంటూ జనఘోష) సోనియాగాంధీని, చంద్రబాబును, కిరణ్.. ఈ ముగ్గురిని క్షమిస్తారా? (ప్రజల నుంచి ‘నో.. నో’ అని సమాధానం). ఇప్పటికైనా వారికి బుద్ధి వస్తుందేమో అని ఆశిస్తున్నా.
సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మనమంతా ఒక్కటై నిలుద్దాం.. రాష్ట్ర సమైక్యతను కాపాడుకుందాం.. ఎన్నికలు వస్తున్నాయి.. 30కిపైచిలుకు పార్లమెంటు స్థానాలను మనమే తెచ్చుకుందాం.. ఢిల్లీ కోటను బద్ధలు కొడదాం.. రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వాళ్లనే ప్రధానమంత్రిని చేద్దాం. ఢిల్లీ కోటను మనమే నిర్మిద్దాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుజాతి చరిత్ర తెలియనివారు రాష్ట్రాన్ని ముక్కలుచెక్కలు చేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని ఉద్ఘాటించారు.
సమైక్యం పేరుతో డ్రామాలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. వెంటనే అసెంబ్లీని సమావేశపరచి సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎందుకు తీర్మానం చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర శనివారం తొలిరోజు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలైంది. జగన్ వస్తే దుకాణాలు మూసేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపును పక్కనపెట్టి ప్రజలు అశేషంగా తరలివచ్చారు. జననేతకు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. కుప్పం బస్టాండ్ సెంటర్‌లో కిక్కిరిసిన జన సమూహాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
మిమ్మల్ని వెళ్లిపొమ్మంటే ఎలా ఉంటుంది?
సోనియాగాంధీ గారిని ఒక్కమాట అడగదలుచుకున్నా. సోనియాగాంధీకి 1968లో రాజీవ్‌గాంధీతో పెళ్లయింది. 1983లో సోనియాగాంధీ భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. అంటే ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు భారతదేశ పౌరసత్వం తీసుకున్నవారంతా వారివారి దేశాలకు వెళ్లిపోవాలని ఎవరైనా పార్లమెంటులో బిల్లు పెడితే ఎలా ఉంటుందమ్మా...? అలా అంటే కల్లు తాగిన కోతుల్లా రెచ్చిపోరా అని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లను అడుగుతున్నా. 30 ఏళ్లకే మీకు ఇంత వ్యామోహం ఉంటే.. 60 ఏళ్లుగా కలిసి బతుకుతున్న మమ్మల్ని వేరు చేస్తామంటే మాకెలా ఉంటుంది? సోనియాగాంధీ గారు ఓట్ల కోసం, సీట్ల కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడానికి ముందుకొస్తారు.. చంద్రబాబు గారేమో ఆమెకు పూర్తిగా మద్దతిస్తూ సమైక్యత అనే పదాన్ని బంగాళాఖాతంలో కలుపుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. గతం ఏమిటో తెలియని వాళ్లు బలంగా ఉన్న తెలుగుజాతిని విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు జాతిని విడగొట్టకపోతే సోనియాగాంధీ గారు తన కొడుకును ప్రధానమంత్రిని చేసుకోలేరు కాబట్టి.
ఆమె కొడుకును ప్రధానమంత్రి ఉద్యోగంలో కూర్చోబెట్టడానికి మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. రాష్ట్ర చరిత్ర తెలియనివారు ఈరోజు పాలన చేస్తున్నారు. 1955కి ముందు విశాలాంధ్ర కావాలని, తెలుగువారు ఎక్కడ ఉన్నా కలిసికట్టుగా ఉండాలని హైదరాబాద్ స్టేట్‌లో అప్పటి ముఖ్యమంత్రి, తెలంగాణ బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు తన పదవిని కూడా త్యాగం చేశారు. హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో విశాలాంధ్ర కావాలంటూ మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానం చేశారు. అదే మాదిరిగా ఆంధ్ర రాష్ట్రం నేతలు కూడా విశాలాంధ్ర కోసం పాటుపడ్డారు. హిందీ తర్వాత అతిపెద్దజాతి తెలుగుజాతి అని చెప్పి, ఒక్కటిగా ఉంటేనే రాష్ట్రంలో తెలుగువారికి గౌరవం ఉంటుందని వాదించారు.
చంద్రబాబూ.. లెటర్ ఎందుకివ్వవు?
చంద్రబాబు గారూ.. విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాం ధ్రకు అనుకూలంగా మీరు ఎందుకు లేఖ ఇవ్వడం లేదు? ఏపీఎన్జీవోలు మీ దగ్గరకు వచ్చి.. ‘మీరు రాజీనామా చేయం డి... మీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయిం చండి..’ అని కోరితే మీరేమన్నారు? రాష్ట్రం విడిపోయినా రాజీనామా చేసేది లేదని మీరు చెప్పలేదా? ఇప్పటికీ మించిపోయింది లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా పోరాటం చేయండి. రాష్ట్ర సమైక్యత కోరుతూ లేఖ ఇవ్వండి. నేను కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నానని చంద్రబాబు అంటున్నారు. ఎవరివి కుమ్మక్కు రాజకీయాలు? కాంగ్రెస్‌తో కలిసి నాపై కేసులు వేసింది ఎవరు? ఎఫ్‌డీఐ ఓటింగ్‌లో మీ ఎంపీలను గైర్హాజరు పరిచి కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది ఎవరు? అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వాన్ని కాపాడింది ఎవరు? రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడగొడుతుంటే అందుకు మద్దతిస్తున్నది ఎవరు? చీకట్లో చిదంబరాన్ని కలిసింది ఎవరు? ఇలా రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ... నా వైపు వేలెత్తి చూపుతారా?
కిరణ్‌వి డ్రామాలు..
కిరణ్‌కుమార్‌రెడ్డి డ్రామాలు గొప్పగా ఆడుతారు. ఎంత గొప్పగా అంటే.. రాష్ట్రాన్ని విభజించాలంటూ చంద్రబాబు ఢిల్లీ వెళ్లి దీక్షలు చేస్తారు. కిరణ్ ఏమో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి ఉద్యోగులను భయపెట్టించి, వారితో సమ్మెను విరమింపజేస్తారు. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారు? అసెంబ్లీని ఎందుకు సమావేశపర్చడం లేదు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎందుకు తీర్మానం చేయడం లేదు? ఈరోజు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా బురదజల్లే కార్యక్రమంలో ఉన్నారు. ఈ చిత్తూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. రాయలు ఏలిన రతనాల సీమ. వెంకటేశ్వరస్వామి కొలుైవె ఉన్నది ఇక్కడే, కాణిపాకం వినాయకుడు ఉన్నది ఇక్కడే, చందమామలో కూడా మచ్చలు ఉన్నట్టుగా మన ఖర్మ కొద్ది మన చిత్తూరు జిల్లాలో కూడా చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నినదిస్తుంటే.. వీరిద్దరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారు.
పొరుగు వాళ్లకు అర్థమైతే.. మీకు ఎందుకు కావట్లేదు?
నేను రెండు వారాలుగా దేశంలోని ప్రతి రాష్ట్రానికి వెళ్తున్నా. ఆ రాష్ట్రాల్లోని ముఖ్య నాయకులను, ముఖ్యమంత్రులను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నా. అక్కడికి వెళ్లి వాళ్లందరితో మాట్లాడి వారి చేత స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నా. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాలని వారితో చెప్పిస్తున్నాం. చంద్రబాబు గారూ... కిరణ్‌కుమార్‌రెడ్డి గారూ.. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నా ఆ ముఖ్యమంత్రులకు, నాయకులకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం అవుతోంది. మరి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మీకు ఎందుకు అర్థం కావడం లేదు.
రైతుల జీవితాలతో చెలగాటమా?
కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కాని, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబుకు కాని ఈ ఇద్దరికీ రాష్ట్రం విడిపోతే జరగబోయే నష్టాల గురించి తెలుసా? ఒకవేళ తెలిస్తే కళ్లు ఉండి కూడా కబోదుల్లా నాటకాలు ఆడుతున్న వాళ్లని ఏమనాలి? నీటి విషయాన్నే తీసుకుంటే.. ఇవాళ నీళ్లు మహారాష్ట్ర దాటుకొని, కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ డ్యాం దాటుకొని కిందకు రావాలి. వారి డ్యాంలు నిండితేనే గాని కిందికి చుక్క కూడా నీళ్లు వదలని పరిస్థితి. ఇక మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీరు ఎక్కడుంది? ట్రిబ్యునళ్లు, బోర్డులు ఉండగానే ఆలమట్టి, నారాయణపూర్ నిండితేనేగానీ ఒక్క చుక్క నీరు వదలని పరిస్థితి ఉంటే ఇక విడిపోతే రాష్ట్రం ఎడారి కాదా? బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది. రాష్ట్రం విడిపోతుందన్న వదంతుల నేపథ్యంలో కృష్ణా నదిలో మనకు కేటాయించిన నీటిని తగ్గించే కార్యక్రమం జరుగుతోంది. మిగులు జలాల మీద మనకున్న హక్కులు తీసేస్తున్నారు. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఇది జరుగుతోంది. ఇక విడిపోతే హంద్రీ-నీవాకు, గాలేరు-న గరికి నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారు?
యువత ఉద్యోగాలకు ఎక్కడికి వెళ్లాలి?: ఈరోజు హైదరాబాద్ నగరాన్ని వదిలి వెళ్లిపొమ్మని చెప్తున్నారు. అలా అయితే చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలి? 60 ఏళ్లు ఒక్కటై కలిసి కట్టుకున్న హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపొమ్మంటారా? హైదరాబాద్ వైపు ఒక్కసారి చూడండి. వైఎస్సార్ బతికున్న రోజుల్లో కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టేవి. ఏటా 57 వేల మందిని క్యాంపస్ రిక్రూట్‌మెంటు చేసుకునే పరిస్థితి ఉండేది. మరి మూడేళ్లుగా ఏం జరుగుతోంది? క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు 57 వేల నుంచి 25 వేలకు తగ్గిపోయాయి. పెట్టుబడుల విషయంలో గతంలో హైదరాబాద్ దేశంలోనే మూడు, నాలుగో స్థానంలో ఉండేది. ఇప్పుడు 12వ స్థానంలోకి పోయింది. చివరకు కోయంబత్తూరు కూడా హైదరాబాద్ కంటే ముందు ఉంది. అభివృద్ధి జరగాలంటే ఎయిర్‌పోర్టులు, సీ పోర్టులు ఉండాలి. మహానగరాలు, సముద్ర తీరాలు ఉండాలి.
ఇలా ఒక్కటిగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. మీరు చేస్తున్నది ఏమిటి? హైదరాబాద్‌ను ఒకరికి ఇచ్చేస్తున్నారు, సముద్ర తీరాన్ని మరొకరికి ఇచ్చేస్తున్నారు. ఇలా చేస్తే కొత్త పరిశ్రమలు ఎక్కడ్నుంచి వస్తాయి? కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇవాళ ప్రతి గ్రామం నుంచి కనీసం 100 మందికి తక్కువ కాకుండా హైదరాబాద్‌లో ఉంటున్నారు. చదువుల కోసం, ఉద్యోగాల కోసం, చిన్నచిన్న వ్యాపారాల కోసం అక్కడికి వెళ్తున్నారు. చిన్నచిన్న ప్లాట్లు కొనుక్కుంటున్నారు. విభజన జరిగిపోతే హైదరాబాద్‌లోని ఆ ఇళ్ల విలువలు ఒక్కసారిగా తగ్గిపోతే, తగ్గిపోయిన విలువలను సోనియా భర్తీ చేస్తారా? కిరణ్ ఇస్తారా? లేదా ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు ఇస్తారా?