బుధవారం ఢిల్లీలో రైల్వే మంత్రి సురేష్‌ప్రభును కలసిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో వైవీ సుబ్బారెడ్డి, అవినాష్‌రెడ్డ
బీజేపీ పెద్దలతో మాట్లాడండి... ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
⇒ ఏపీలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయండి
⇒ రైల్వే మంత్రి సురేష్‌ప్రభుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు, అసలు విషయాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించే యత్నం చేస్తున్నారని, సమస్యను రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభుకు వివరించారు.
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టీడీపీ అధినేత పేరును మొదటి నిందితుడిగా చేర్చాలని కోరారు. ఆయన బుధవారం సాయంత్రం ఇక్కడి రైల్వే భవన్‌లో పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విప్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు వరప్రసాద్‌రావు, వై.ఎస్.అవినాశ్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు తదితరులతో కలిసి సురేష్ ప్రభుతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అవినీతిపై, రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల అమలుపై రెండు వినతిపత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. ‘‘నిన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రస్తావించిన అంశాలనే సురేష్ ప్రభు వద్ద ప్రస్తావించాం.
చంద్రబాబునాయుడు ఏ రకంగా లంచాలు తీసుకుని సంపాదించిన డబ్బును తిరిగి లంచంగా ఇవ్వజూపుతూ పట్టుబడ్డారో చెప్పాం. ఆ అంశంనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు దీనిని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చూపుతున్న సంగతిని వివరించాం. రైల్వేపెండింగ్ ప్రాజెక్టు, జోన్ ఆవశ్యకత వివరిస్తూ.. ప్రజస్వామ్యాన్ని కాపాడాలని కోరాం. బీజేపీలోని పెద్దలతో గట్టిగా మాట్లాడాలని కోరాం’’ అని తెలిపారు.
రైల్వే ప్రాజెక్టులపై ఇచ్చిన వినతిపత్రంలోని ముఖ్యాంశాలు
⇒ నేను మా పార్టీ ఎంపీలతో ఫిబ్రవరిలో మిమ్మల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని హామీలతో పాటు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని కోరాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు గత కొన్ని దశాబ్దాలుగా రైల్వే బడ్జెట్‌లో జరుగుతున్న అన్యాయాన్ని మీకు వివరించాం. ఈసారైనా న్యాయం చేస్తారని ఆశించాం.మా ఆశలు నెరవేరలేదు. 2014 బడ్జెట్ నాటి హామీలూ అమలు కాలేదు.హా2014 బడ్జెట్‌లో రైల్వే మంత్రి విజయవాడ-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-నిజాముద్దీన్ ఏసీ ఎక్స్‌ప్రెస్, కాజీపేట-ముంబై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లను ప్రకటించారు. అవి పట్టాలెక్కలేదు.
⇒ కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ఇతర ముఖ్యపట్టణాలకు ర్యాపిడ్ రైలు, రోడ్డు కనెక్టివిటీ కేంద్రం ఏర్పాటుచేస్తుందని 13వ షెడ్యూలులో పొందుపరిచిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదు.
⇒ ‘ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం రూ. 20,680 కోట్ల అంచనా వ్యయం కలిగిన 29 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. రెండు కొత్త రాష్ట్రాల అధికారులతో సమన్వయ సమావేశాలు జరిపి వాటి అవసరాలను తెలుసుకుని వాటిని పరిగణనలోకి తీసుకుంటాం’ అని 2014-15 రైల్వే బడ్జెట్‌లో రైల్వే మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ 2015 రైల్వే బడ్జెట్‌లో దీని ప్రస్తావనే లేదు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పట్టించుకోలేదు. కేవలం కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్ పనులను మాత్రమే ప్రస్తావించారు.ప్రత్యేక జోన్ అంశమే లేదు. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు డివిజన్లు ఉండేవి. ఇప్పుడు ఒక్కటీ లేదు. ఎందుకు కేటాయించడం లేదో అర్థం కాని పరిస్థితి.
⇒ విభజన అనంతరం కొత్తగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్ ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఇప్పటివరకు దాన్ని ప్రకటించడం లేదు. నడికుడి-శ్రీకాళహస్తి, విజయవాడ-నిడదవోలు-జగ్గయ్యపేట-విష్ణుపురం, కాకినాడ-పిఠాపురం, ఓబులవారి పల్లె-కృష్ణపట్నం తదితర ముఖ్యమైన లైన్లను మొన్నటి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.గత ప్రభుత్వం 50 శాతం వ్యయాన్ని భరిస్తామని కోరినా కొన్ని ప్రాజెక్టులను మంజూరు చేయలేదు.
⇒ మొన్న ఫిబ్రవరిలో మీ బడ్జెట్ ప్రసంగంలో నాలుగు ఫ్రైట్ కారిడార్లు ఏర్పాటుచేస్తామన్నారు. కానీ వాటిని ఎక్కడ ఏర్పాటుచేస్తారో చెప్పలేదు. మా ప్రాంతంలో రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించాల్సిన ఆవశ్యకతను గుర్తించండి. బెంగళూరు-కడప రైల్వే లైన్ లింక్‌కు చాలినంత నిధులు కేటాయించకపోవడంతో దాని నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 2008-09లో మంజూరైన ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉన్నా బడ్జెట్‌లో ప్రస్తావన లేదు.
⇒ రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నందలూరులో ఉన్న లోకోషెడ్ ప్రస్తుతం పనిచేయడం లేదు. దాదాపు 150 ఎకరాల్లో ఉన్న ఈ యూనిట్ వద్ద 250 స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లాకు చెందినవాడిగా ఈ ప్రాంత ప్రజలు ఈ యూనిట్‌పై పెట్టుకున్న భావోద్వేగమైన అనుబంధం నాకు తెలుసు. దీనిని తిరిగి పనిచేయించాల్సిన అవసరం ఉంది. అలాగే కోడూరులో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉంది.