సీబీఐ ప్రత్యేక కోర్టును కోరిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
విభజనపై మా వైఖరిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది
ఎంపీగా ప్రజల కష్టనష్టాలను తెలుసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది
ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా కూడా బెయిల్ షరతులు సడలించండి
విచారణ ఈనెల 15కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయమై తమ పార్టీ వైఖరిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, అందువల్ల తాను రాష్ట్రంలో పర్యటించేందుకు అనుమతించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. అలాగే ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా కూడా బెయిల్ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘‘2009లో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా 1.78 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందా. కొన్ని రాజకీయ కారణాలతో తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 5.43 లక్షల భారీ మెజారిటీతో తిరిగి ఎంపీగా ఎన్నికయ్యా. నా నేతృత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ఎంపీ, 18 మంది ఎమ్మెల్యేలు కూడా గెలుపొందారు. ఉప ఎన్నికల ప్రచారం సమయంలో మా పార్టీకి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. నాకు ప్రజల మద్దతు ఉందని గుర్తించి, 15 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా.. ఎన్నికల ప్రచారంలో ఉన్న నన్ను విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ ఆదేశించింది. గత ఏడాది మే 23న ఈ మేరకు నాకు నోటీసులు జారీ అయ్యాయి. అప్పటికి సీబీఐ నాపై కేసు నమోదు చేసి దాదాపు 10 నెలలు గడిచిపోయాయి. మూడు చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. ఆ సమయంలో విచారణ పేరిట పిలిచి సీబీఐ నన్ను అరెస్టు చేసింది. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న నన్ను అరెస్టు చేయడాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టింది’’ అని జగన్ తన పిటిషన్‌లో వివరించారు.
రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకోవాలి
‘‘2010 నవంబర్‌లో రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యా. రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష పార్టీకి అధినేతగా ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించా. నా తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు అనేక ప్రాంతాలకు వెళ్లాను. ఎంపీగా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లాను. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కల్పించిన ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుడికీ వర్తిస్తాయి. ఇప్పుడు కూడా ఎంపీగా నా నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. వారి కష్టనష్టాలను తెలుసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఎంపీగా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సి ఉంది. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయాల్సి ఉంది. ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్న సమయంలో నేను ప్రజల్లోకి వెళ్లడం తప్పనిసరి’’ అని జగన్ పేర్కొన్నారు.
విభజనపై వైఖరిని వివరించాలి
‘‘రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము విభజనను వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతున్నాం. రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మా పార్టీ వైఖరిని అన్నివర్గాల ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కలవాల్సి ఉంటుంది. కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్లి ఇతర రాష్ట్రాల ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంది. మా పార్టీ రాష్ట్రంలోనే బలమైన రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది. అలాంటి పార్టీ కార్యక్రమాల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంది. సీబీఐ నామీద మోపిన అభియోగాలు విచారణ దశలోనే ఉన్నాయి. అవి ఇంకా నిరూపణ కాలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించండి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించండి. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించను.’’ అని జగన్ తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు... సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను ఈనెల 15కు వాయిదా వేశారు.
రాష్ట్ర పర్యటనకు అనుమతించండి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Published Sat, Oct 12 2013 12:20 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement