
ప్రకటన రాకుంటే నిరవధిక నిరాహార దీక్ష: వైఎస్ జగన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 15లోపు ప్రత్యేక హోదాపై ప్రకటన రాకుంటే నివరధిక నిరాహార దీక్ష చేపడతామని ఆయన వెల్లడించారు. వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రంపై అందరూ కలిసికట్టుగా ఒత్తిడి తేవాలన్నారు.
అప్పటికీ కేంద్రం నుంచి ప్రకటన రాకుంటే ...సెప్టెంబర్ 15వ తేదీన గుంటూరులో నివరధిక నిరాహార దీక్ష చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి తన మంత్రులను చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకుంటానంటే కేంద్రంలో కదలిక వస్తుందని వైఎస్ జగన్ అన్నారు. కేంద్రంపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేస్తామన్నారు.
వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే....
- ప్రత్యేక హోదాపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు
- హోదాను ఎప్పటిలోగా సాధిస్తారన్న దానిపై మేం చంద్రబాబును పదేపదే అడిగాం
- కానీ, చంద్రబాబు నోట నుంచి మాట రాలేదు
- ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన వివరణ అస్పష్టంగా ఉంది
- ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణ చేసుకున్నవారి పేర్లు కూడా ప్రభుత్వానికి తెలియదు
- హోదా కోసం ఆత్మార్పణ చేసుకున్న వారికి ఇంతవరకూ ఒక్క దమ్మిడి పైసా కూడా ప్రభుత్వం ఇవ్వలేదు
- చంద్రబాబు చెప్తున్న మాటల్లో, చేస్తున్న పనుల్లో చిత్తశుద్ధి కనిపించలేదు
- కేసుల్లోంచి బయటపడేందుకే చంద్రబాబు ఎక్కువ దృష్టి పెడుతున్నారు తప్ప హోదాపై కాదు
- ప్రత్యేక హోదా కోసం మంగళగిరిలో 2 రోజుల దీక్ష చేశాం. ఢిల్లీలో ధర్నా చేశాం. బంద్ కూడా పాటించాం
- కమ్యూనిస్టులు బంద్ చేస్తే మద్దతు ఇచ్చాం
- కేబినెట్, నీతి ఆయోగ్, ప్రణాళికా సంఘం, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కు ప్రధానే అధ్యక్షుడు
- ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎన్నిరోజులు పడుతుందని అడిగితే ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు
- బీజేపీ సభ్యులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు
- చంద్రబాబు తన మంత్రులను ఉపసంహరించుకుంటేనే కేంద్రంపై ఒత్తిడి వస్తుంది
- అది జరగాలి అంటే ఇక్కడ చంద్రబాబు ఒత్తిడి చేయాల్సి ఉంది
- ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు, కేంద్రం మెడలు వంచాల్సిన పరిస్థితి ఉంది
- ఏపీకి ప్రత్యేక హోదా కోసం అంతా ఒక్కటై పోరాడుదాం