పై-లీన్ తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు వస్తున్నందున తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సాక్షి, హైదరాబాద్: పై-లీన్ తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు వస్తున్నందున తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్న నేపథ్యంలో.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో పై-లీన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏమాత్రం నిర్లక్ష్యం, అశ్రద్ధ వహించకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. సూపర్ సైక్లోన్‌గా పరిగణిస్తున్న ఈ పై-లీన్ తుపాను గంటకు 220 కిలోమీటర్లకు పైబడిన వేగంతో దూసుకొస్తోందని హెచ్చరిస్తున్నారని, వాతావరణశాఖ సమాచారాన్ని బట్టి ప్రజల ప్రాణ, ఆస్తులకు పెనుప్రమాదం పొంచిఉందని తెలుస్తోందని, ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.