
జగన్ త్వరగా కోలుకోవాలి : రఘువీరా
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్లో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ కేంద్రమే చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టులో నీళ్లు కాదు డబ్బు పారిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతుందని రఘువీరారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గత బుధవారం గుంటూరు నగర శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద నిరవధిక నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున బలవంతంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దీక్షను భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలంటూ రఘువీరారెడ్డిపై విధంగా స్పందించారు.