మీరంతా మా కుటుంబమే | ys sharmila first day paraamarsha yatra finished in warangal district | Sakshi
Sakshi News home page

మీరంతా మా కుటుంబమే

Published Tue, Aug 25 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM

మీరంతా మా కుటుంబమే

మీరంతా మా కుటుంబమే

వరంగల్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల
* తొలిరోజు ఏడు కుటుంబాలకు పరామర్శ    
* ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా
సాక్షి ప్రతినిధి, వరంగల్: వీర బైరాన్‌పల్లి పులకించింది. చేర్యాల సంతోషంగా అక్కున చేర్చుకుంది. బండనాగారం అండగా నిలిచింది. కట్కూరు కలిసి నడిచింది. అలీంపూర్ ఆత్మీయంగా స్వాగతం పలికింది. దివంగత సీఎం వైఎస్సార్ తనయ, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల వరంగల్ జిల్లాలోని మారుమూల పల్లెలకు వచ్చారు.

వైఎస్ అకాల మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేందుకు వారి ఇళ్లకు వెళ్లారు. పేరు పేరునా పలకరిస్తూ బాగోగులు తెలుసుకున్నారు. వైఎస్సార్ కుటుంబం ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘మీరూ మా  కుటుంబమే. అంతా ఒక్క కుటుంబంగా కలిసి ఉందాం..’ అని చెప్పారు.

జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా తొలిరోజు షర్మిల జనగామ నియోజకవర్గంలోని ఏడు కుటుంబాలను కలిశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చారిత్రక ఉద్యమానికి చిరునామాగా నిలిచిన వీర బైరాన్‌పల్లిలో అమర వీరులకు షర్మిల, వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాళులర్పించారు.
 
భావోద్వేగ క్షణాలు..
సోమవారం ఉదయం 10.50 గంటలకు రాజీవ్ రహదారిపై కొమురవెల్లి స్వాగత తోరణం మీదుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి షర్మిల జిల్లాలోకి వచ్చారు. పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, బీష్వ రవీందర్, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు షర్మిలకు ఘన స్వాగతం పలికాయి. కొమురవెల్లి మీదుగా షర్మిల చేర్యాలకు చేరుకుని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మ ద్దూరు మండలం బైరాన్‌పల్లిలో కర్ర రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.

మద్దూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఆవరణలో మధ్యాహ్న భోజన విరామం తర్వాత బచ్చన్నపేట మండలం కట్కూరులో పాశికంటి శోభారాణి, గుంటిపల్లి వెంకటేశ్ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అనంతరం బండ నాగారంలోని మానెపల్లి సిద్ధులు, కేసిరెడ్డిపల్లిలోని గాదెపాక సిద్ధులు కుటుంబాన్ని పరామర్శించారు. చివరిగా అలీంపూర్‌లో చాడ కిష్టయ్య కుటుంబాన్ని కలిశారు. ప్రతి కుటుంబంతో దాదాపు అరగంటపాటు గడిపిన షర్మిల.. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

కట్కూరులో పాశికంటి శోభారాణి కుటుంబాన్ని పరామర్శించే సమయంలో షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. శోభారాణి పెద్ద కుమార్తె కల్పనతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇంటి నుంచి షర్మిల బయటకు వస్తున్న సమయంలో కల్పన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇది గమనించిన షర్మిల.. ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ‘నువ్వు బాధపడవద్దమ్మా... నువ్వు బాధపడితే నాకు బాధ కలుగుతుంది. నీకు నేనున్నానమ్మా’ అని చెమ్మగిల్లిన కళ్లతో ఓదార్చారు.
 
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో తొలిరోజు పరామర్శ యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, బోయినపల్లి శ్రీని వాసరావు, నాడెం శాంతికుమార్, సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బి.రఘురాంరెడ్డి, బి.శ్రీనివాస్, బి.సాయినాథ్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, ఎ.గోపాల్‌రావు, జి.శ్రీధర్‌రెడ్డి, కె.వెంకట్‌రెడ్డి, వి.వెంకటేశ్,  షర్మిల సంపత్, ఎం.వరలక్ష్మీ, బి.బ్రహ్మానందరెడ్డి, పెగ్గెం రాజేశ్, ముజతాబ్ అహ్మద్, నర్రా భిక్షపతి, క్రిస్టోలైట్, జె.అమర్‌నాథ్‌రెడ్డి, జి.శివకుమార్, బి.సంజీవరావు, ఎస్.నరేశ్, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి వి.శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.
 
ఎలా ఉన్నారమ్మా.. ఏం పనులు చేస్తున్నారు..?
తొలిరోజు యాత్రలో షర్మిల 154 కిలో మీటర్లు ప్రయాణించారు. అన్ని గ్రామాల్లోనూ షర్మిలను కలుసుకునేందుకు ప్రజలు ఆప్యాయతతో ముందుకు వచ్చారు. షర్మిల అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. మద్దూరు మండలం వల్లంపట్ల మీదుగా షర్మిల వెళ్తుండగా మహిళల బృందం అభివాదం చేసింది. వెంటనే షర్మిల తన కారు ఆపారు. స్థానిక ఉప సర్పంచ్ వేల్పుల రమేశ్-రజిత దంపతుల కుమారుడిని తీసుకుని ఎత్తుకున్నారు. స్థానిక మహిళలతో మాట్లాడారు. ఎలా ఉన్నారమ్మా.. ఏం పనులు చేస్తున్నారు.. అని అడిగారు.

ఇందుకు వారు బదులిస్తూ.. ‘వానలు లేవు. పనులు లేవు. ఒక్క రూపాయి బియ్యం ఇచ్చి ఇట్ల చేస్తున్నరు. సన్నబియ్యం అయిపోయి. దొడ్డుబియ్యం కూడా దొరుకతలేవు’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు లేవా అని షర్మిల అడగ్గా.. ‘ఎలాంటి పనులు లేవు. ఊల్లె ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయమ్మా’ అని వారు చెప్పారు. బండనాగారంలో డప్పు చప్పుళ్లతో షర్మిలకు స్వాగతం పలికారు. కట్కూరులో వెంకటయ్య అనే వృద్ధుడు షర్మిల వద్దకు వచ్చి.. ‘మీ నాయన కోసం మృతి చెందిన వారిని పలకరించేందుకు రావడం మాకు తృప్తిగా ఉంది.

మీరు ఇలాగే మా ఊళ్లకు వస్తూపోతూ ఉండాలి’ అన్నారు. వైఎస్సార్ పాలనలోనే పల్లెలు చల్లగా ఉన్నాయని కట్కూరు మాజీ సర్పంచ్ శ్రీనివాస్.. షర్మిలతో చెప్పారు. గోదావరి జలాలను తమ వద్దకు తీసుకువచ్చిన ఘనత వైఎస్సార్ దేనని చెప్పారు. షర్మిల మంగళవారం జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement