ఏడు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ
వరంగల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన తొలి రోజు పరామర్శ యాత్ర ముగిసింది. వైఎస్ షర్మిల సోమవారం ఏడు కుటుంబాలను పరామర్శించారు. తొలిరోజు యాత్ర చేర్యాల మండల కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఈరోజు ఉదయం ఆమె హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి వరంగల్ జిల్లా పరామర్శ యాత్రకు పయనమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆశీర్వాదం తీసుకుని ఆమె యాత్రకు బయల్దేరారు.
రాజీవ్ రహదారి మార్గంలో వరంగల్ జిల్లా కొమురవెల్లి మీదుగా జనగామ నియోజకవర్గం చేర్యాలకు చేరుకున్నారు. అంతకుముందు ఉదయం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ లో షర్మిలకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ బయల్దేరి వెళ్లారు.
చేర్యాల మండల కేంద్రంలోని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుంచి మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో కర్ర రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత బచ్చన్నపేట మండలం కట్కూరులో పాశికంటి శోభారాణి, గుంటిపల్లి వెంకటేశ్ కుటుంబాలను పరామర్శించారు. తర్వాత ఇదే మండలం బండనాగారంలో మానెపల్లి సిద్ధులు కుటుంబాన్ని, కేసిరెడ్డిపల్లెలో గాదెపాక సిద్ధులు కుటుంబాన్ని అలీంపూర్‌లో చాడ కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఏడు కుటుంబాల పరామర్శ తర్వాత తొలిరోజు కార్యక్రమాన్ని ముగించారు. తొలిరోజు 154 కిలో మీటర్ల దూరంలో షర్మిల యాత్ర సాగింది.