
ఎమ్మెల్యే చెవిరెడ్డి మరోసారి అరెస్ట్
చిత్తూరు : చిత్తూరు జిల్లా వద్ద శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఆయన వడమాలపేట పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసులో బెయిల్పై బయటకు వచ్చారు. అయితే తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే చెవిరెడ్డిపై మరో కేసు ఉందంటూ ఆయనను ఎంఆర్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసేందుకు వచ్చారు. నిరసనగా కార్యకర్తలతో చెవిరెడ్డి చిత్తూరు జిల్లా జైలు వద్ద ఆందోళనకు దిగారు. అయితే ఎంఆర్ పల్లి పోలీసులు మాత్రం ఆయనను బలవంతంగా అక్కడ నుంచి లాక్కెళ్లారు. చెవిరెడ్డి తన అనుచరులతో రాత్రివేళ సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో సెక్షన్ 147, 341, 448 కేసులను ఎంఆర్ పల్లి పోలీసులు నమోదు చేశారు.
కాగా 2013లో రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఎన్నికల నియామావళి ఉల్లంఘనగా పరిగణించి అప్పట్లో పోలీసులు చెవిరెడ్డిపై కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం పోలీసులు గురువారం చెవిరెడ్డిని అరెస్ట్ చేసి వడమాలపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న ఆయనను పుత్తూరు కోర్టులో హాజరు పరచగా, 15 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. వెంటనే చెవిరెడ్డి తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, పుత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సమయం మించిపోవటంతో చెవిరెడ్డి ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదల అయ్యారు.