- జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
- హోదా వచ్చేదాకా పోరాడతాం: వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
-బాబుది హోదాను మించిన మేధ: తెలకపల్లి రవి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదా రాదని ప్రచారం చేయడంపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ‘విభజన చట్టం- ప్రత్యేక తరగతి హోదా- ప్రత్యేక ప్యాకేజీ’ సదస్సులో ఆమె మాట్లాడారు.
హోదా కన్నా ప్యాకేజీయే మిన్న అంటున్న చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వానికి సరెండరై, ప్రజా సంఘాలు, మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. నిర్బంధాలు ఎన్ని ఎదురైనా వైఎస్సార్‌సీపీ మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తుందని, హోదా సాధించేదాకా విశ్రమించబోదని ఆమె స్పష్టం చేశారు. హోదా పోరాటంలో కలిసివచ్చేవారికి ఆహ్వానం పలుకుతామని చెప్పారు.
బాబుది హోదాను మించిన మేధ:తెలకపల్లి
హోదా ముగిసిన అధ్యాయం అంటూ మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలు చేస్తోన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి పిలుపునిచ్చారు. ఏపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు మౌనమోదీలా వ్యవహరిస్తున్నారని, ‘హోదాను మించిన మేధ బాబుగారిది’అని ఎద్దేవా చేశారు.