
371డీని తొలగించాల్సిందే..
- కేంద్రానికి అటార్నీ జనరల్ స్పష్టీకరణ
- టీ బిల్లుకు ముందు రాజ్యాంగ సవరణ చేయాలి
- ఏ రాష్ట్రానికీ లేని ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 371డీ ఏపీకి కల్పిస్తోంది
- రాజ్యాంగంలోని 3, 4 అధికరణల కింద కేంద్రం అధికారాలను వినియోగించాలంటే.. ముందుగా ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించాలి
- 371డీ ఉండగా ఆ ఆర్టికల్స్ ప్రకారం నేరుగా విభజన చేయటం కుదరదు
- ఏపీని విభజిస్తే.. రెండు రాష్ట్రాలకూ ఇక ప్రత్యేక ప్రతిపత్తి ఉండదు
- కేంద్ర హోంశాఖకు నోట్‌లో అటార్నీ జనరల్ వాహనవతి నివేదన
- వాహనవతి నోట్‌లోని అంశాలతో జీవోఎంకు హోంశాఖ నివేదిక
- రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి పార్లమెంటులోమూడింట రెండొంతుల మెజారిటీ కావాలి
- ప్రతిపక్ష బీజేపీ మద్దతు ఉంటేనే సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం సాధ్యం..
- బీజేపీ స్వరం మారిన పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ సాధ్యమయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలంటే.. దేశంలో మరే ఇతర రాష్ట్రానికీ లేనివిధంగా ఈ రాష్ట్రానికి రాజ్యాంగపరంగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 371డీని ముందుగా తొలగించాల్సిందేనని భారత ప్రభుత్వ ప్రధాన న్యాయాధికారి అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖకు తాజాగా నోట్ సమర్పించారు. రాజ్యాంగంలోని మూడో అధికరణ (ఆర్టికల్ 3) కింద రాష్ట్రాన్ని విభజించే అధికారాలను కేంద్రం వినియోగించుకోవాలంటే.. దానికి ముందుగా ఆర్టికల్ 371డీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించాలని ఆ నోట్‌లో నివేదించారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పెట్టటానికి ముందుగా ఆర్టికల్ 371డీని తొలగిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించి తీరాలని అటార్నీ జనరల్ విస్పష్టంగా పేర్కొన్నారు. వాహనవతి నోట్‌లో పేర్కొన్న అంశాలతో కేంద్ర హోంశాఖ అంతర్గత నివేదికను రూపొందించి కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించింది.
అటార్నీ జనరల్ చెప్పిన ప్రకారం ఆర్టికల్ 371డీని తొలగించాలంటే.. అందుకోసం రాజ్యాంగాన్ని సవరిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి పార్లమెంటు ఉభయసభల్లో మూ డింట రెండొంతుల మెజారిటీ అవసరం. అయితే.. ఇప్పటికే మైనారిటీలో ఉంటూ బయటి నుంచి మద్దతిస్తున్న పలు పార్టీలపై ఆధారపడి యూపీఏ సర్కారు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మద్దతు తప్పనిసరిగా అవసరమవుతుంది. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించిన బీజేపీ ఇటీవలి కాలంలో స్వరం మార్చటం తెలిసిందే. రెండు ప్రాంతాల వారికీ సమన్యాయం చేయాలని, ముందు తెలంగాణ బిల్లును చూస్తే కానీ.. దానికి బేషరతు మద్దతు ఇస్తామో లేదో చెప్పబోమని గళం వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ బిల్లుకన్నా ముందు రాజ్యాంగ సవరణ బిల్లుకు బీజేపీ మద్దతిస్తుందా? పార్లమెంటులో రాజ్యాంగ సవరణతో ఆర్టికల్ 371డీని తొలగించటం సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్నార్థకమేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు రాజకీయ మార్గాల అన్వేషణ ప్రారంభించింది. అలాగే.. అటార్నీ జనరల్ నోట్‌తో పూర్తిగా సంతృప్తి చెందని జీవోఎం.. మరోసారి ఆయన నుంచి వివరణాత్మక నోట్‌ను కోరే దిశగా ఆలోచిస్తోందని సమాచారం.
రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్న కేంద్ర మంత్రివర్గం విభజన ప్రక్రియపై నిర్దిష్ట విధివిధానాలతో మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఏర్పాటుచేసింది. ఈ మంత్రుల బృందం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో, రాష్ట్రంలోని ఏడు రాజకీయ పార్టీలతో, అలాగే కేంద్రంలోని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో వరుస భేటీలు నిర్వహించి విభజనతో ముడిపడిన పలు అంశాలపై చర్చించి, వారి అభిప్రాయాలను తీసుకున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఈ చర్చల ప్రక్రియను సాగిస్తూనే కేంద్ర హోంశాఖ ఆర్టికల్ 371డీ విషయమై అటార్నీ జనరల్ (ఏజీ) వాహనవతి అభిప్రాయాన్ని కోరింది. విభజనతో ముడిపడ్డ వివిధ అంశాలు, ప్రత్యేకించి విద్య, ఉద్యోగాలకు సంబంధించిన రక్షణ కవచమైన ఆర్టికల్ 371డీని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 సహా పలు ఆర్టికళ్లను నిశితంగా పరిశీలించి, సహ న్యాయనిపుణులతో చర్చించిన మీదట వాహనవతి తన అభిప్రాయాన్ని హోంశాఖకు నివేదించారని సమాచారం. ఆయన సమర్పించిన నోట్ ఆధారంగా హోంశాఖ రూపొందించిన అంతర్గత నివేదనలోని అంశాలు మంగళవారం ఢిల్లీలో వెలుగుచూశాయి. జీవోఎంకు తాజాగా హోంశాఖ అందజేసిన ఈ నివేదికలో అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని, సూచనలను అత్యంత ప్రముఖంగా ప్రస్తావించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అందులోని అంశాలు ఇలా ఉన్నాయి...
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి భిన్నమైనది...
ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన బిల్లును ఆమోదించటానికన్నా ముందుగానే ఆర్టికల్ 371డీని తొలగిస్తూ రాజ్యాంగ సవరణ చేయటం తప్పనిసరని అటార్నీ జనరల్ కేంద్ర హోంశాఖకు సమర్పించిన నోట్‌లో స్పష్టంచేశారు. అలా చేయని పక్షంలో రాజ్యాంగపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకుని రాష్ట్ర విభజనకు సిద్ధపడుతుండటాన్ని దృష్టిలో పెట్టుకున్న వాహనవతి.. రాజ్యాంగంలోని ఇతర ఆర్టికళ్లలో ఉన్న నిబంధనలు ఏమిటన్నది వివరించారు. ఆయా ఆర్టికళ్లలోని అంశాలు ఆర్టికల్ 3 కింద ఉన్న అధికారాల వినియోగానికి అడ్డంకి కానప్పటికీ.. ఆర్టికల్ 371డీ కారణంగా ఇక్కడ పరిస్థితి భిన్నంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 ప్రకారం చూస్తే.. ఓ రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఏ చట్టాన్ని చేయడమైనా సరే రాజ్యాంగాన్ని సవరించటం కిందికి రాదు. రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలను సదరు చట్టం సవరిస్తున్నదైనప్పటికీ దాన్ని రాజ్యాంగ సవరణగా పరిగణించటానికి వీలుండదు. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ విషయం ఇక్కడ పూర్తి భిన్నమైనది. ఈ రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఆర్టికల్ 371డీ’’ అని ఆయన వివరించారు.
అది ఏ రాష్ట్రానికీ లేని ప్రత్యేక ప్రతిపత్తి...
371డీ రాజ్యాంగంలో ఏ సందర్భంలో వచ్చి చేరిందీ అటార్నీ జనరల్ తన నోట్‌లో వివరించారు. 1969, 72 ఉద్యమాల తర్వాత పార్లమెంట్‌లో 32వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడం ద్వారా ఆర్టికల్ 371డీని రాజ్యాంగంలో చేర్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారికి విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, సౌకర్యాల కల్పనకు ఉద్దేశించిన ఈ ఆర్టికల్.. సమయానుసారం ఉత్తర్వులు ఇచ్చే అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చింది. ఈ ఆర్టికల్ ప్రకారమే విద్య, ఉద్యోగాల్లో ప్రస్తుతం వివిధ ప్రాంతాల వారికి సమాన వాటా లభిస్తోంది. ఈ ఆర్టికల్ ఫలితంగానే ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ విధానం అమల్లోకొచ్చింది. దేశంలోని ఏ రాష్ట్రానికీ ఇలాంటి ప్రత్యేక ప్రతిపత్తి లేదని వాహనవతి పేర్కొన్నారు. ఇది ఉన్నందునే ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి 3, 4 అధికరణల ప్రకారం దక్కిన అధికారాలను కేంద్రం నేరుగా వినియోగించజాలదన్నారు. తొలుత 371డీని తొలగిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాకే విభజనకు సంబంధించి రాజ్యాంగంలోని ఇతర అధికారాలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. విభజన ప్రక్రియ పూర్తికి నియమించిన జీవోఎం ఈ అంశాన్ని గుర్తించాలని, ఆ మేరకు చర్యలు చేపట్టటం చాలా ముఖ్యమని వాహనవతి సూచించారు.
విభజిస్తే ప్రత్యేక ప్రతిపత్తి వర్తించదు...
అంతేకాదు.. ‘‘రాష్ట్రమంతటా సమాన అవకాశాల కల్పనే ధ్యేయంగా ఆర్టికల్ 371డీని రాజ్యాంగంలో చేర్చినందున, రాష్ట్రాన్ని విభజించిన పక్షంలో, విభజన తర్వాత మిగిలిన భాగానికి ఈ ఆర్టికల్‌ని వర్తింపచేయడం సబబు కాదు’’ అని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. అలా వర్తింపచేసినట్టయితే అది అసలు ఆర్టికల్ 371డీ వెనుక ఉన్న ప్రధానోద్దేశానికి, సంకల్పించిన ప్రయోజనానికి పూర్తి విరుద్ధమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే పార్లమెంటు ముందుగా రాజ్యాంగ సవరణను ఆమోదించటం తప్పనిసరి. అలా చేస్తేనేఆర్టికల్ 371డీ కింద ఆంధ్రప్రదేశ్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని.. కొత్తగా ఉనికిలోకి వచ్చే రెండు రాష్ట్రాలూ కోల్పోతాయని అటార్నీ జనరల్ వాహనవతి జీవోఎంకు తెలియజేశారు’’ అని హోంశాఖ తన అంతర్గత నివేదనలో పేర్కొంది. ‘‘ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడమంటూ జరిగితే, ఆర్టికల్ 371డీ కింద ప్రస్తుత సమైక్య ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి.. విభజన తర్వాత రాష్ట్రంలో మిగిలిన భాగానికి వర్తించదు’’ అని అటార్నీ జనరల్ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులోనూ 371డీ ప్రస్తావన...
రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ నిర్వహించిన సమయంలోనూ రాజ్యాంగ నిపుణులైన సీనియర్ న్యాయవాదులు ఆర్టికల్ 371డీ సంగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఆర్టికల్ సంగతిని తేల్చాకే విభజనపై కేంద్రం ముందుకు వెళ్లాలని వారు వాదించారు. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ నుంచి జీవోఎంకు అందిన నోట్‌లోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ ఆర్టికల్ 371డీ...
1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు.. తెలంగాణ హక్కుల పరిరక్షణకు ముల్కీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 1972లో జై ఆంధ్ర ఉద్యమం తర్వాత ముల్కీ నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టేసింది. 1973 సెప్టెంబర్ 21న ఆరు సూత్రాల పథకం అమల్లోకి వచ్చింది. ఇలాంటి వాటికి రాజ్యాంగ రక్షణ లేకపోవడంతో.. విద్య, ఉద్యోగాల్లో స్థానికుల హక్కుల పరిరక్షణకు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 371డీ అధికరణను చేర్చారు. ఈ అధికరణను అనుసరించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పుడు ఆరు జోన్లు ఉన్నాయి. ఈ అధికరణ కింద 85 శాతం ఉద్యోగాలను ఆయా జోన్లలోని స్థానికులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. 371డీ లోని 1, 3, 9 సెక్షన్లలో ఆంధ్రప్రదేశ్ అనే పదం ఉంది. రాష్ట్రాన్ని విభజించటానికి అవకాశం కల్పించే ఆర్టికల్ 3 లేదా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు వీలు కల్పించే ఆర్టికల్ 2, 4 ప్రకారం.. ఆర్టికల్ 371డీని సవరించడం వీలు కాదని పలువురు రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. 371డీలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ అనే పదం స్థానంలో కొత్త రాష్ట్రాల పేర్లు చేర్చకుండా రాష్ట్ర విభజన సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు. అయితే.. ఈ 371డీ ఆర్టికల్‌ను రాజ్యాంగ సవరణతో తొలగిస్తేనే రాష్ట్ర విభజన బిల్లును తీసుకురావటం సాధ్యమవుతుందని తాజాగా అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి కేంద్రానికి నివేదించటం విశేషం.