తుపాను తరుముకొస్తోంది.. | Andhra Pradesh coast braces for cyclone Helen | Sakshi
Sakshi News home page

తుపాను తరుముకొస్తోంది..

Published Fri, Nov 22 2013 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM

తుపాను తరుముకొస్తోంది..

తుపాను తరుముకొస్తోంది..

  • నేడు మచిలీపట్నం వద్ద తీరం దాటనున్న హెలెన్ 
  •   కృష్ణా, గుంటూరు, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  •   గంటకు 75-120 కి.మీ. వేగంతో గాలులు 
  •   రేవుల్లో కొనసాగుతున్న ప్రమాద హెచ్చరికలు
  •   రాష్ట్రానికి పొంచి ఉన్న మరో ముప్పు
  •   దక్షిణ అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం.. తుపానుగా మారే ప్రమాదం.. 
  •   పంటలు ఏమౌతాయోనన్న ఆందోళనలో రైతులు
  •  
     సాక్షి, విశాఖపట్నం/నెట్‌వర్క్: హెలెన్ దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ పెను తుపాను శుక్రవారం సాయంత్రంలోపు కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. గురువారం రాత్రి 10 గంటల సమయానికి మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 180కి.మీ దూరంలో హెలెన్ కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో కృష్ణా, గుంటూరు, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. కోస్తాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుపాను తీరం దాటే సమయంలో 75 నుంచి 120 కి.మీ. మధ్య వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
     
      మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు నిజాంపట్నం, వాడరేవు, మచిలీపట్నం రేవుల్లో పదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడలో 9వ నంబర్, కళింగపట్నం, గంగవరం, విశాఖపట్నం, భీమిలి, కృష్ణపట్నం ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికల్ని జారీ చేశారు. 
     
     అంచనాలను తలకిందులు చేస్తూ: హెలెన్ తుపాను అంచనాల్ని తలకిందులు చేస్తూ ప్రయాణిస్తోంది. మంగళ, బుధవారం నాటి పరిస్థితుల్ని బట్టి ఒంగోలు, కావలి ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే గురువారం కల్లా దిశ మార్చుకుని మచిలీపట్నం తీరం వైపు కదులుతోంది. మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉండడంతో ఈ ప్రభావం ఉత్తర కోస్తాంధ్రపైనా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇది తీవ్ర తుపానుగానే ఉందని, పెను తుపానుగా మారే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అధికారులు అంటున్నారు. తుపాను మెల్లగా కదులుతుండడంతో నష్టం స్థాయి ఎక్కువగానే ఉండే ప్రమాదం ఉందని, పంట చేతికొచ్చే సమయంలో తుపాను రావడంతో రైతులు భారీగా నష్టపోయే అవకాశం ఉందని రిటైర్డ్ మెట్రాలజిస్ట్ ఎ.అచ్యుతరావు తెలిపారు.
     
     తెలంగాణ, రాయలసీమకూ వర్షాలు!
     తుపాను ప్రభావంతో శుక్రవారం సాయంత్రం వరకు కోస్తాలో భారీ వర్షాలతోపాటు, తెలంగాణ, రాయలసీమల్లో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కళింగపట్నం, టెక్కలి ప్రాంతాల్లో ఒక్కో సెం.మీ చొప్పున వర్షం పడింది.
     
     జిల్లాలు బిక్కుబిక్కు: హెలెన్ తుపానుతో కోస్తాంధ్ర జిల్లాలు బిక్కుబిక్కుమంటున్నాయి. కృష్ణా జిల్లాలో తుపాను తీవ్రత అధికంగా ఉండే నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ మండలాల్లో 23 వేల కుటుంబాలు తుపాను బారిన పడే అవకాశం ఉందని గుర్తించారు. జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరి కోతకు సిద్ధమైంది. 1.37 లక్షల ఎకరాల్లో పత్తి మూడో తీత దశలో ఉంది. ఇప్పుడు వర్షాలు కురిస్తే చేతికందే దశలో ఉన్న ఈ పంటలన్నీ దెబ్బతింటాయని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. గుంటూరు జిల్లాలో తీర ప్రాంతంలో అలలు పోటెత్తుతున్నాయి. తీరంలోని ఆరు మండలాలను లోతట్టు ప్రాంతాలుగా గుర్తించారు.  ప్రకాశం జిల్లాకు జాతీయ విపత్తు సహాయ సంస్థ నుంచి 80 మందితో కూడిన ప్రత్యేక బృందం వచ్చింది. 11 తీర ప్రాంత మండలాల్లోని 46 వేల మందిని ఏ క్షణంలోనైనా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లాలో 69 గ్రామాల పరిధిలో చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ, ఓడలరేవు, అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ వద్ద అలలు ఆరడుగుల మేర ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ శివారు సుబ్బంపేట నుంచి ఉప్పుటేరు పెదవంతెన వరకు సుమారు 3 కి.మీ. మేర రోడ్డు పలుచోట్ల కోతకు గురైంది. పెరుమాళ్లపురం నుంచి రెండు బోట్లలో వెళ్లిన 14 మంది, సూర్యారావుపేట నుంచి ఒక బోటులో వెళ్లిన ఏడుగురు సముద్రంలో చిక్కుకున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంక వద్ద సముద్రం 30 మీటర్లు ముందుకొచ్చింది.
     
     ప్రాణ నష్టం ఉండరాదు: రఘువీరా, సీఎస్
     హెలెన్ తుపాను నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి రఘువీరారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీకే మహంతి జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం కోస్తా జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈ మేరకు స్పష్టంచేశారు. కాగా తుపాన్‌ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాస్తవ  రైల్వేలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. 
     
     పొంచి ఉన్న మరో ముప్పు?
     హెలెన్ ముప్పు నుంచి ఇంకా బయటపడక ముందే మరో గండం పొంచి ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ అండమాన్ ప్రాంతంలోని మహా సముద్రంలో అల్పపీడనం ఉన్నట్టు అధికారులు అంచనాకొచ్చారు. ఇది మరింత బలపడి తుపానుగా కూడా మారే ప్రమాదం ఉందని, దీని వల్ల కోస్తాంధ్రకూ తీవ్ర స్థాయిలో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఉత్తర/ఈశాన్య దిశలో ‘రెయిన్ బ్యాండ్స్’ అధికంగా ఉండడం వల్ల తుపాన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు తుపాన్ల గండం తప్పదని, గతంలో నెలరోజుల వ్యవధిలో మూడుమార్లు తుపాన్లు ఏర్పడిన సందర్భాలున్నాయని వాతావరణ శాఖ మాజీ అధికారి మురళీకృష్ణ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement