
విభజన నిర్ణయాలపై కాంగ్రెస్ నేతలకు ముందే తెలుసు
- విభజన నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలకు ముందే సమాచారం
- నెలాఖరులోగా అసెంబ్లీకి టి.బిల్లు వస్తుందని సమన్వయ కమిటీ భేటీలోనే దిగ్విజయ్ స్పష్టీకరణ...
- ఆ భేటీలో పాల్గొన్న సీఎం కిరణ్, కేంద్రమంత్రి చిరంజీవి సమైక్య వాదన వినిపించలేదు
- రచ్చబండలో మాత్రం రాజకీయ ప్రసంగాలు.. ముఖ్యమంత్రి వైఖరిపై పీసీసీ నేతల్లో విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం తీసుకొనే ప్రతి నిర్ణయం గురించి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు ముందే సమాచారం ఇచ్చారు. వారితో చర్చించారు. ప్రతి సందర్భంలోనూ రాష్ట్రానికి చెందిన ముఖ్య కాంగ్రెస్ నేతలంతా ఆ నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడమే కాకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకరిస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. అలాగే, ఈ నెలాఖరులోపే తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీకు రానుందనే విషయం కూడా వారికి హైకమాండ్ ముందే స్పష్టం చేసింది.
ఈ బిల్లు గురించి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో చర్చించారు. ఆ భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, కేంద్ర మంత్రి చిరంజీవి కూడా ఉన్నారు. ఈ నెలాఖరులోపే తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీకు రానుందని సమన్వయ కమిటీ సమావేశంలోనే దిగ్విజయ్‌సింగ్ పార్టీ నేతలకు చెప్పారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టంచేశారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వైఖరిపై కూడా దిగ్విజయ్ వారికి పలు సూచనలు కూడా చేశారు. సమన్వయ కమిటీ భేటీ హైదరాబాద్‌లో జరగాల్సి ఉన్నా దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ బిల్లు వ్యవహారం గురించి కూలంకషంగా చర్చించడానికే వేదికను ఢిల్లీకి మార్చారని సమాచారం. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని, దాన్ని ఆమోదించాల్సిందేనని దిగ్విజయ్ ఆ సమావేశంలో కరాఖండీగా చెప్పినప్పుడు అక్కడే ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కానీ చిరంజీవి కానీ సమైక్యవాదన వినిపించకుండా అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటామన్నట్లుగానే భరోసా ఇచ్చారని తెలిసింది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టడమే కాకుండా చర్చలో పాల్గొనడంపై కూడా సీఎం సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం.
పార్టీనేతల విస్మయం: సీడబ్ల్యూసీ సమావేశంలో సానుకూలంగా స్పందించి.. ఆ తరువాత రచ్చబండ సహా పలు సందర్భాల్లో సమైక్య రాగం వినిపించడంపై పార్టీ రాష్ట్ర నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘సీఎం సమైక్యమంటూ వినిపిస్తున్న వాదనలోనే విభజనకు తాను అనుకూలమన్న సంకేతాలు ఇస్తున్నారు. ఆయన చెప్పిన అంశాలను గమనిస్తే వైఖరేమిటో స్పష్టమవుతుంది. విభజన వల్ల వచ్చే సమస్యల గురించి చెబుతూ విభజించదలిస్తే వాటిని పరిష్కరించండంటున్న సీఎం సమైక్యవాది ఎలా అవుతారు?’’ అని పీసీసీ నేత ఒకరు విశ్లేషించారు.
రచ్చబండ రాజకీయం
ప్రజా సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడం రచ్చబండ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అయితే.. ముఖ్యమంత్రి సమైక్య ప్రసంగాలు చేయడాన్ని కూడా పీసీసీ నేతలు విమర్శిస్తున్నారు. ‘‘మూడేళ్లుగా ఎమ్మెల్యేలెవరూ గ్రామాల్లోకి వెళ్లడం లేదు. ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. విభజన, సమైక్యమన్న గందరగోళంలోనే అందరూ ఉన్నారు. మంత్రివర్గ ఉపసంఘంలోనూ చర్చించి గ్రామస్థాయిలో రచ్చబండ పెట్టాలని సిఫార్సు చేశాం. దాన్ని పట్టించుకోకుండా సీఎం మండలస్థాయికే రచ్చబండను పరిమితం చేశారు. రాజకీయ వేదికగా మార్చేశారు’’ అని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘కన్నా’పై కావాలనే దుష్ర్పచారం..
మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ కావడంపై ముఖ్యమంత్రి వర్గీయులు దుష్ర్పచారం సాగించారంటూ కన్నాతో పాటు బొత్స సత్యనారాయణ మండిపడుతున్నారు. సీఎం పదవికోసం విభజనకు అంగీకరించి పార్టీ అధిష్టానంతో కన్నా ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకే సోనియాతో మంతనాలు జరిపారని సీఎం వర్గీయులు ప్రచారం సాగించారని కన్నా, బొత్స వర్గం అభిప్రాయపడుతోంది. తమ సామాజికవర్గం అయితే ఒకలా, వేరే సామాజికవర్గం అయితే మరోలా కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.