ఆ కుటుంబం అభిమానానికి దాసోహం..
- ఘనంగా శివాజీ, కామరాజనాడార్ విగ్రహాల ఆవిష్కరణ
నగరి: అభిమానానికి శివాజీ కుటుంబం ఎప్పుడూ దాసోహమేనని నటుడు శివాజీ గణేశన్ మనవడు, ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు అన్నారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్ పరిధి సత్రవాడలో శివాజీ గణేశన్ అభిమాని దివంగత మునియప్పన్ జ్ఞాపకార్థం నిర్మించిన దివంగత శివాజీ గణేశన్ విగ్రహం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి పెదనాన్న రామ్‌కుమార్‌తో పాటు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1998లో తన తాత కామరాజనాడార్ విగ్రహావిష్కరణకు విచ్చేశాడు.
నేడు ఆయన విగ్రహావిష్కరణకు తాను విచ్చేయడం ఎనలేని సంతోషాన్ని ఇస్తోందన్నారు. నటనకు హద్దులు లేవని తన తాత శివాజీ గణేశన్ నిరూపించారని అన్నారు. అందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఓ పండుగలా చేయడమే నిదర్శనమని అన్నారు. తన తాత, తండ్రి బాటలోనే తాను కూడా ప్రజల అభిమానాన్ని పొందడానికి కృషి చేస్తున్నాను. రామ్‌కుమార్ మాట్లాడుతూ.. కామరాజనాడార్ తన తండ్రికి ఆదర్శమన్నారు. నేడు వారి ఇద్దరి విగ్రహాలు ఒకేచోట ఆవిష్కరించడం అభినందనీయమన్నారు.
మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే.కుమార్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను శివాజీ గణేశన్ అభిమానినని, రాజకీయంగా తనకు మార్గం చూపింది ఆ కుటుంబమే అన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ వీఎస్.భానుమూర్తి, భారతదేశ శివాజీ సంఘం నిర్వాహకులు మరుదుమోహన్, చంద్రశేఖర్, జయపెరుమాళ్, స్థానిక నాయకులు వరదప్ప మొదలియార్, రామచంద్రన్, ఏకనాథన్, దేవన్, ఏకాంబరం, శ్రీనివాసన్, ఇలంగో, రాజా, కుమార్, నటరాజన్, వినాయకం, జయరామన్, కృష్ణన్, సీఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.