గాలికుంటుతో జాగ్రత్త | Can be saved cattle by giving vaccines to prevent diseases | Sakshi

గాలికుంటుతో జాగ్రత్త

Published Sun, Aug 24 2014 8:53 PM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

గాలికుంటుతో జాగ్రత్త

గాలికుంటుతో జాగ్రత్త

వర్షాకాలంలో మూగజీవాలకు వచ్చే గాలికుంటు వ్యాధి విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్యులు సూచిస్తున్నారు. పికోర్నా గ్రూపునకు చెందిన వైరస్ ద్వారా సోకే

* రైతులకు పశువైద్యాధికారుల సూచన
* నేటినుంచి సెప్టెంబర్ 10 వరకు అన్ని గ్రామాల్లో పశువైద్య శిబిరాలు
* మూగజీవాలకు వ్యాధి నిరోధక టీకాలు
* పశుపోషకులకు సదావకాశం

 
వర్షాకాలంలో మూగజీవాలకు వచ్చే గాలికుంటు వ్యాధి విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్యులు సూచిస్తున్నారు. పికోర్నా గ్రూపునకు చెందిన వైరస్ ద్వారా సోకే దీని వల్ల పశువులు తీవ్ర ఇబ్బందులు పడుతాయని చెబుతున్నారు. ఈ వ్యాధి నివారణ కోసం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరోధక టీకాలు ఇస్తున్నారు. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు వెటర్నరీ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై నంగునూరు వెటర్నరీ ఆస్పత్రి వైద్యుడు
- డాక్టర్ వేణు, ఫోన్: 8790998014
అందించిన సలహాలు.. సూచనలు..   
 - నంగునూరు

ఆరు నెలల వరకు వ్యాధి ప్రభావం
మన ప్రాంతంలో ఓఏ, ఏఎస్‌ఐఏ-1 రకాల వైరస్ వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
దీని బారిన పడిన పశువుపై ఆరు నెలల వరకు వ్యాధి ప్రభావం ఉంటుంది.
మూగజీవాల్లో రక్తహీనత ఏర్పడి శ్వాస తీయడం కష్టంగా మారి ఎప్పుడూ ఎగపోస్తుంటాయి (శ్వాస అధికంగా తీయడం).
ఎండ వేడిమిని తట్టుకోలేక త్వరగా నీరసించిపోతాయి.
ఈ వ్యాధి బారిన పడిన ఆవు, లేదా బర్రె పాలు తాగిన లేగలు, దుడ్డెలు మృత్యువాత పడే అవకాశం ఉంది.
దేశవాలీ పశువులతో పోలిస్తే సంకర జాతి పశువులపై దీన ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఈ వ్యాధి ప్రాణాంతకమైనది కాకపోయినా దీని ప్రభావంతో పశువుల్లో ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోతుంది.
 
వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి బారిన పడ్డ పశువులు మేత సరిగ్గా మేయవు. దీని ప్రభావంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.
 -  శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 106 ఫారిన్‌హీట్స్ ఉంటుంది. జ్వరం తీవ్రత అధికంగా కనిపిస్తుంది.  
 -     పళ్ల చిగుళ్లు, నాలుక, గిట్టల మధ్య, పొదుగు, ముట్టి లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడి చితికిపోతాయి.
 - బొబ్బలపై ఈగలు, పురుగులు, బ్యాక్టీరియా ఆశ్రయించడం వలన చీము ఏర్పడి పుండ్లు అవుతాయి.  
 - నోటి నుంచి సొంగ కారడంవంటి లక్షణాలు కనిపిస్తాయి.  
 - చూడి ఆవులు, బర్రెలకు ఈ వ్యాధి సోకితే గర్భస్రావం అవుతుంది. పాలు తాగిన దూడలు మృత్యువాత పడుతాయి.
 
 వ్యాప్తి ఇలా..
.
  పకో వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెంది ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుంది.
 - అపరిశుభ్రంగా ఉండే పశువుల పాకలు, వీటిలో నిల్వ ఉంటే మురుగు వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
 - లాలాజలం, మూత్రం, పేడ, వీర్యం, పాలు, చనుకట్ల పుండ్ల నుంచి వచ్చే స్రవాలు, కలుషిత పదార్థాల ద్వార కూడా ఇతర పశువులకు సోకుతుంది.
 
ముందు జాగ్రత్తలు
 -   మూగజీవాల్లో ఈ వ్యాధి రాకుండా పుట్టిన రెండు నెలల వ్యవధిలో మొదటి సారి నిరోధక టీకాలు వేయించాలి. అనంతరం ఒక నెల తర్వాత అంటే దూడలు మూడు నెలల వయసు ఉన్నప్పుడు బూస్టర్ డోస్ వేయించాలి.  
 -    అనంతరం విధిగా ప్రతీ ఆరు నెలలకోసారి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి.
 -    పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలను విధిగా ఇప్పించాలి.
 
పశువులకు చికిత్స
 - వ్యాధిసోకిన పశువులను ఆరోగ్యవంతమైన పశువుల నుంచి వేరు చేసి పశువైద్యున్ని సంప్రదించాలి.
 - వ్యాధి సోకిన పశువు శరీరంపై ఏర్పడిన పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం పరచాలి.
 - నోటిలోని పుండ్లను బోరో గ్లిజరిన్‌తో శుభ్రంచేయాలి.
 - కాలి పండ్లకు జింక్‌ఆక్సైడ్, లోరాక్సిన్ ఆయింట్‌మెంట్ రాయాలి.
 -పుండ్లపై ఈగలు వాలకుండా వేపనూనె, ఈగ మందులను స్ప్రేలను వాడాలి.
 - వ్యాధిసోకిన పశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి.
 - వ్యాధి నిర్మూలనకు మూడు నుంచి ఐదు రోజుల వరకు యాంటీబయోటిక్స్ మందులు వాడాలి.
 - నొప్పి నివారణకు అనాల్జిసిక్ మందులు వాడాలి.
 -    సులభంగా జీర్ణమయ్యేందుకు పోషక పదార్థాలతో కూడిన ఆహారం అందించాలి.
 - జావ, జొన్నలకు చిటికెడు ఉప్పు, బెల్లంలో కలిపి ప్రతి రోజూ తాగించాలి. బలహీనత తీవ్రంగా ఉంటే గ్లూకోజ్ ఇప్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement