
మంచి నేల.. మంచి నీరు..!
భూమికి నీరు వర్షం ద్వారా అందుతుంది. అయితే, పడిన వానలో కొంత మాత్రమే మొక్కలకు ఉపయోగపడి మిగిలింది రకరకాలుగా పోతుంది.
భూమికి నీరు వ ర్షం ద్వారా అందుతుంది. అయితే, పడిన వానలో కొంత మాత్రమే మొక్కలకు ఉపయోగపడి మిగిలింది రకరకాలుగా పోతుంది. భూమి మీద పడిన మొత్తం వర్షాన్ని ‘అసలు వర్షపాతం’ అంటాం. ఉపరితల ప్రవాహం ద్వారా, ఆవిరి కావటం ద్వారా నష్టపోయింది పోగా, భూమిలో నిల్వ ఉండి మొక్కలకు అందుబాటులో ఉండే వర్షపు నీటిని ‘ఉపయోగపడే వర్షపు నీరు’ అంటాం. ఇదే మొక్కలకు, జంతువులకు, వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. వర్షపు నీటి ఉపయోగాన్ని వాన పడే తీరు, నేల రకం, నేలను మొక్కలు ఎంత బాగా కప్పి ఉంచుతున్నాయి, నేలవాలు వంటివి నిర్ణయిస్తాయి.. సేంద్రియ పదార్థం ఎక్కువ ఉన్న నేల ఆరోగ్యంగా ఉంటుంది. ఖనిజ లవణాలు, జీవనద్రవ్యం (హ్యూమస్) వంటి ఘన పదార్థాలతో పాటు నీరు, గాలి ఎంతెంత మోతాదుల్లో ఉన్నాయి అన్నదాన్ని బట్టి నేల నిర్మాణం ఆధారపడి ఉంటుంది. ఘన పదార్థాలు 40 శాతం(ఇందులో హ్యూమస్ 5%), 30 శాతం నీళ్లు, 30 శాతం గాలి ఉన్న మట్టి మంచి నిర్మాణం గలదని గుర్తించవచ్చు. ఇటువంటి నేలలు ఎక్కువ నీటిని పీల్చుకోగలుగుతాయి. ఈ నేలలు పీల్చుకున్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది.
(షింపే మురకామి
‘ప్రకృతి నేర్పిన పాఠాలు’ సౌజన్యంతో)
వ్యవసాయ విధానాల్లో మౌలిక మార్పు రావాలి: ఎఫ్‌ఏఓ
ఐక్యరాజ్య సమితికి అను బంధమైన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) వైఖరిలో ఇటీవల స్పష్టమైన మార్పొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ పద్ధతులను ఆరోగ్యదాయకంగా, చిరకాలం ఆధారపడదగినవిగా మార్చడానికి ప్రభుత్వ విధాన నిర్ణేతలు దూరదృష్టితో చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఏఓ పిలుపునిచ్చింది. ఎఫ్‌ఏఓ డెరైక్టర్ జనరల్ జోస్ గ్రజియానో డ సిల్వ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ ఇలా అన్నారు: ‘ఖరీదైన ఉపకరణాలను, అధికంగా ప్రకృతి వనరులను ఉపయోగిస్తూ వ్యవసాయోత్పత్తిని పెంచే వ్యవసాయ నమూనా(ఇన్‌పుట్ ఇంటెన్సివ్ మోడల్)పై ఇక ఏమాత్రమూ ఆధారపడలేం. దీనికి పరిమితులున్నాయి. సాగునీరు, రసాయనాలను తక్కువగా ఉపయోగిస్తూ ఉత్పాదకతను పెంపొందించడమే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు. అన్ని దేశాల వ్యవసాయ విధానాల్లో ఈ దిశగా ‘మౌలిక మార్పు’ రావాలి.
‘వ్యవసాయక ప్రజాస్వామ్యం’ కావాలి
ఐక్యరాజ్యసమితి ఆహార హక్కు ప్రత్యేక ప్రతినిధి ప్రొఫెసర్ హిలల్ ఎల్వెర్ ఇలా అన్నారు: ‘వ్యవసాయక ప్రజాస్వామ్యం’ తేవాలి. ప్రపంచ ప్రజలకు 70% ఆహారాన్ని అందిస్తున్నది చిన్న రైతులే. అయితే, ప్రస్తుతం వ్యవసాయ కంపెనీ లకే అత్యధిక సబ్సిడీలు అందుతున్నాయి. ఈ అసమానత పోవాలి. చిన్న రైతుల కు, ముఖ్యంగా గ్రామీణ యువతకు ప్రోత్సాహకాలను, కొత్త అవకాశాల ను ప్రభుత్వాలు కల్పించాలి. పెరుగుతున్న డిమాండ్‌కు తగిన విధంగా వ్యవసా య దిగుబడులను పెంపొందించే సత్తా ప్రకృతి వ్యవసాయ పద్ధతులకుందనడానికి శాస్త్రీయమైన సరికొత్త రుజువులున్నాయి’. అంతర్జాతీయ కుటుంబ వ్యవసాయ సంవత్సరం-2014 సందర్భంగా ఎఫ్‌ఏఓ వైఖరిలో వచ్చిన ఈ మార్పు చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ఉపకరిస్తుందని చిన్న రైతుల క్షేమం కోరే 70 మంది వ్యవసాయ నిపుణులు హర్షం వ్యక్తం చేయడం విశేషం.
పశువులకూ ప్రభుత్వ హాస్టల్!
మనుషుల హాస్టళ్లు మనకు తెలుసు. అయితే, పశువులకూ హాస్టళ్లు ఏర్పాటు చేయడం విచిత్రమే అయినా ఇది నిజం. పశువులకో వసతిగృహాన్ని నిర్మించుకున్న ఘనత గుజరాత్‌లోని సబర్‌కాంత్ జిల్లా అకోదరకే దక్కింది. ఇందులో 800 ఆవులు, 400 గేదెలు ఉన్నాయి. ఇన్ని పశువులను ఒకేచోట ఉంచి తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో పోషించుకుంటూ అకోదర గ్రామస్తులు చీకూ చింతా లేకుండా పాడి రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ హాస్టల్‌కు ప్రభుత్వం 25 ఎకరాల స్థలాన్నిచ్చింది. నాబార్డు రూ. 5 లక్షలు, స్థానిక పాల సంఘం రూ. 50 వేలకు తోడు పశుపోషకులు రూ. 50 వేలు వేసుకొని 30 పక్కా షెడ్లు వేశారు. తాగునీరు, వైద్య సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. అక్కడి కార్మికులే పశువులకు అవసరమైన కుడితి, గడ్డి, దాణా వేస్తారు.
గోబర్ గ్యాస్ ప్లాంట్ ద్వారానే ఈ హాస్టల్‌కు విద్యుత్ సమకూర్చుకుంటున్నారు. దీనికి గాను ప్రతి పశుపోషకుడు ఏడాదికి రూ.200లు చెల్లించాల్సి ఉంటుంది. పశువుల యజమానులు ఉదయం, సాయంత్రం వచ్చి పేడ తీసి శుభ్రం చేసుకొని, పాలు పితుక్కొని వెళ్తుంటారు. పాలకేంద్రం వెన్న శాతంతో సంబంధం లేకుండా లీటర్‌కు రూ. 50 చెల్లిస్తున్నది. హాస్టల్ ప్రాంగణంలోనే పశుగ్రాసం పెంచుతున్నారు. పశుసంవర్ధక శాఖ నూజివీడు సహాయ సంచాలకులు ఎంఎస్‌ఏ దివాకర్ స్వయంగా వెళ్లి చూసొచ్చారు. ప్రతి గ్రామంలోనూ ఇటువంటి హాస్టళ్లను ఏర్పాటు చేస్తే చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని ఆయన అంటారు.
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్‌స,6-3-249/1,
రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034
saagubadi@sakshi.com