
పంట వ్యర్థాలతోనే భూసారం
అవశేషాల పొగతో అనర్థాలు
వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులు కోతలు పూర్తయ్యాక వాటి అవశేషాలు(వ్యర్థాలు) కాల్చకుండా నేలలో కలియదున్నాలని మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయ కర్త డాక్టర్ ఎస్.మాలతి, పంట ఉత్పత్తి శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ అన్నదాతలకు సూచిస్తున్నారు. దేశంలో ఏటా 500 నుంచి 600 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు (వరి, పత్తి, మొక్కజొన్న అవశేషాలు) మిగులుతోంది.
ఇందులో 20 నుంచి 30% రైతులు వాటికి నిప్పు పెట్టి బూడిద చేస్తున్నారు. అలా చేయడం వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయని తెలిపారు. ప్రధానంగా పంజాబ్, హర్యాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు అధికంగా కాల్చడం వల్ల ఢిల్లీ వంటి పక్క రాష్ట్రాల్లో విపరీతమైన గాలి కాలుష్యం అవడం జరుగుతోందని గుర్తు చేశారు. ఇక్కడ ప్రధాన సమస్య వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు దినుసు పంటలను కాల్చి వే యడమని, తెలంగాణలో సగటున 30 నుంచి 40% వరి, 90 నుంచి 95% పత్తి అవశేషాలకు నిప్పు పెట్టి కాల్చి బూడిద చేయడం జరుగుతుందన్నారు.
అవశేషాలను కాల్చడానికి ప్రధాన కారణాలు..
మొదటి, రెండో పంట మధ్య తక్కువ వ్యవధి.
అవశేషాలు కుళ్లడానికి అధిక సమయం.
కాల్చడం వల్ల కలిగే సమస్యలు..
పర్యావరణ కాలుష్య కారకాలైన సీఓ, సీఓ–2, ఎన్–2ఓ, ఎస్‌ఓ–2 విడుదలవ్వడం.
గాలి నాణ్యత తగ్గడం, భూసారం క్షీణించడం, నత్రజని కర్బన స్థాయి తగ్గడం ఉపయోగకర సూక్ష్మజీవులు కీటకాలు చనిపోవడం.
5.5 కిలోల నత్రజనితోపాటు 2.3 కిలోల భాస్వరం 25 కిలోల పొటాషియం 1.2 కిలోల సల్ఫర్ నష్టం వాటిల్లుతుంది.
పంట అవశేషాల ఉపయోగాలు..
పశువులకు మేతగా ఉపయోగించడం, వంట చెరుకుగా వాడుకోవడం.
సేంద్రియ వ్యవసాయంలో కంపోస్టింగ్, పుట్టగొడుగుల సాగు కోసం ఉపయోగించవచ్చు.
అవశేషాల నుంచి బయోఇథనాల్ ప్యాకింగ్ మెటీరియల్ కోసం ఉపయోగపడటం.
నేలలో కలియదున్నడం ద్వారా కర్బన స్థాయి పెరగడం, గాలిప్రసారం, భూభౌతిక లక్షణాలు పెరుగుతాయి.
నేల మీద మల్చ్‌గా ఉపయోగించవచ్చు.
నేలలో కలియదున్నితే..
నత్రజని 1.2 నుంచి 2 కిలోల వరకు, భాస్వరం 1 నుంచి 1.6 కిలోల వరకు, 12 నుంచి 13.6 కిలోల వరకు నేలకు అందజేయవచ్చు.
బయోచార్ తయారు చేసుకోవడం..
పంట అవశేషాలను ట్రాక్టర్ బెల్లర్ సహాయంతో వరిగడ్డిని చుట్టలుగా చుట్టుకోవచ్చు.
గడ్డి త్వరగా కుళ్లడానికి వ్యర్థ డికంపోజర్ లేదా పూసా డికంపోజర్, పీజేటీఎస్‌ఏయూ కన్సార్టియం ద్వారా త్వరగా కుళ్లబెట్టవచ్చు.