plow
-
రైతు దినోత్సవం.. వైఎస్ జగన్‌కు నాగలి బహుకరణ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రైతు దినోత్సవం సందర్భంగా కడప ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ రైతు విభాగం నాయకులు, రైతులు, పార్టీ నాయకులు నాగలి బహుకరించారు.దివంగత మహానేత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. రైతు సాధికారత కోసం వైఎస్సార్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని గత వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర రైతు దినోత్సవంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
Sagubadi: కాల్చొద్దు.. కలియదున్నండి!
వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులు కోతలు పూర్తయ్యాక వాటి అవశేషాలు(వ్యర్థాలు) కాల్చకుండా నేలలో కలియదున్నాలని మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయ కర్త డాక్టర్ ఎస్.మాలతి, పంట ఉత్పత్తి శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ అన్నదాతలకు సూచిస్తున్నారు. దేశంలో ఏటా 500 నుంచి 600 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు (వరి, పత్తి, మొక్కజొన్న అవశేషాలు) మిగులుతోంది.ఇందులో 20 నుంచి 30% రైతులు వాటికి నిప్పు పెట్టి బూడిద చేస్తున్నారు. అలా చేయడం వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయని తెలిపారు. ప్రధానంగా పంజాబ్, హర్యాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు అధికంగా కాల్చడం వల్ల ఢిల్లీ వంటి పక్క రాష్ట్రాల్లో విపరీతమైన గాలి కాలుష్యం అవడం జరుగుతోందని గుర్తు చేశారు. ఇక్కడ ప్రధాన సమస్య వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు దినుసు పంటలను కాల్చి వే యడమని, తెలంగాణలో సగటున 30 నుంచి 40% వరి, 90 నుంచి 95% పత్తి అవశేషాలకు నిప్పు పెట్టి కాల్చి బూడిద చేయడం జరుగుతుందన్నారు.అవశేషాలను కాల్చడానికి ప్రధాన కారణాలు..మొదటి, రెండో పంట మధ్య తక్కువ వ్యవధి.అవశేషాలు కుళ్లడానికి అధిక సమయం.కాల్చడం వల్ల కలిగే సమస్యలు..పర్యావరణ కాలుష్య కారకాలైన సీఓ, సీఓ–2, ఎన్–2ఓ, ఎస్ఓ–2 విడుదలవ్వడం.గాలి నాణ్యత తగ్గడం, భూసారం క్షీణించడం, నత్రజని కర్బన స్థాయి తగ్గడం ఉపయోగకర సూక్ష్మజీవులు కీటకాలు చనిపోవడం.5.5 కిలోల నత్రజనితోపాటు 2.3 కిలోల భాస్వరం 25 కిలోల పొటాషియం 1.2 కిలోల సల్ఫర్ నష్టం వాటిల్లుతుంది.పంట అవశేషాల ఉపయోగాలు..పశువులకు మేతగా ఉపయోగించడం, వంట చెరుకుగా వాడుకోవడం.సేంద్రియ వ్యవసాయంలో కంపోస్టింగ్, పుట్టగొడుగుల సాగు కోసం ఉపయోగించవచ్చు.అవశేషాల నుంచి బయోఇథనాల్ ప్యాకింగ్ మెటీరియల్ కోసం ఉపయోగపడటం.నేలలో కలియదున్నడం ద్వారా కర్బన స్థాయి పెరగడం, గాలిప్రసారం, భూభౌతిక లక్షణాలు పెరుగుతాయి.నేల మీద మల్చ్‌గా ఉపయోగించవచ్చు.నేలలో కలియదున్నితే..నత్రజని 1.2 నుంచి 2 కిలోల వరకు, భాస్వరం 1 నుంచి 1.6 కిలోల వరకు, 12 నుంచి 13.6 కిలోల వరకు నేలకు అందజేయవచ్చు.బయోచార్ తయారు చేసుకోవడం..పంట అవశేషాలను ట్రాక్టర్ బెల్లర్ సహాయంతో వరిగడ్డిని చుట్టలుగా చుట్టుకోవచ్చు.గడ్డి త్వరగా కుళ్లడానికి వ్యర్థ డికంపోజర్ లేదా పూసా డికంపోజర్, పీజేటీఎస్ఏయూ కన్సార్టియం ద్వారా త్వరగా కుళ్లబెట్టవచ్చు. -
ఇద్దరు యువకులు కాడెద్దులుగా మారి పొలాన్ని
సీఎస్‌పురం: వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకునేందుకు ఇద్దరు యువకులు కాడెద్దులుగా మారి పొలాన్ని చదును చేశారు. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలంలోని అరివేముల గ్రామానికి చెందిన మారంరెడ్డి రత్నారెడ్డికి అర ఎకరా పొలం ఉంది. అందులో వరి సాగు చేసేందుకు సిద్ధం చేస్తున్నాడు. చదును చేసేందుకు పాకుమాను వేయాల్సి వచ్చింది. ఎద్దులు లేకపోవడం, ట్రాక్టర్ యజమానులు బాడుగ ఎక్కువగా చెబుతుండటంతో ఏం చేయలో అర్థం కాలేదు. పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఖాళీగా ఉన్న తన అన్న కుమారులు మారంరెడ్డి రమణారెడ్డి, మోహన్‌రెడ్డిలను కాడి లాగేందుకు ఉపయోగిస్తూ తాను వెనుక ఉండి పాకుమానుతో భూమిని చదును చేయడం ప్రారంభించాడు. గురువారం వరి నాటాల్సి ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో ఈవిధంగా భూమిని చదును చేస్తున్నట్లు రత్నారెడ్డి తెలిపారు. -
ఆదిలాబాద్ : దున్నపోతుతో దుక్కి దున్నుతున్న రైతు
-
నాగలి పట్టి పొలం దున్నిన జాయింట్ కలెక్టర్
రాజానగరం: వ్యవసాయం అంటే మనిషికి, మట్టికి మధ్య ఉండే ఒక అందమైన బంధం. ఇది అర్థమయ్యేది ఒక్క రైతుకు.. వారి గురించి ఆలోచించే కొద్దిమందికి మాత్రమే. పండించే వాళ్లు తగ్గిపోయి.. తినేవాళ్లు నానాటికీ పెరిగిపోతున్న కాలంలో.. ఆశలన్నీ కొడిగట్టిపోతున్న రైతుల బతుకులకు ఇం‘ధనం’ అందించి.. వారి కష్టాలను అర్థం చేసుకుని.. అన్నివిధాలా ప్రోత్సహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ‘రైతు అంటే సింపతీ కాదు.. రెస్పెక్ట్’ అని నిరూపిస్తోంది. ఇందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా కదులుతోంది. ప్రస్తుతం తొలకరి వర్షాలు కురుస్తూండటంతో అన్నదాతలు ఖరీఫ్ సాగుబడికి సమాయత్తమవుతున్నారు. రాజానగరం మండలం ముక్కినాడలో శుక్రవారం సంప్రదాయబద్ధంగా ఏరువాక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) జి.లక్ష్మీశ.. పొలం దున్నుతున్న రైతులతో చేయి కలిపారు. మేడి పట్టి కాసేపు.. తరువాత ట్రాక్టర్‌తోను మడి దున్నారు. ఆరుగాలం చెమట చిందిస్తూ, ప్రజల ఆకలి తీర్చేందుకు అవసరమైన తిండిగింజలు పండిస్తున్న రైతులే దేశానికి నిజమైన వెన్నెముక అని ఈ సందర్భంగా అన్నారు. -
నాన్నకు చేదోడుగా.. నాగలి లాగుతూ..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైతు కష్టం చూస్తే మనస్సు చలించకమానదు. తనకున్న వ్యవసాయ భూమిని దున్నడానికి ట్రాక్టర్ని గానీ, ఎద్దులను గానీ అరువు తెచ్చకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఆ రైతుది. కుటుంబ పరిస్థితులు తెలిసిన అతని ఇద్దరు కూతుర్లు చిన్నవాళ్లే అయిన తండ్రికి చేదోడుగా నిలిచారు. ఎలాగైనా పొలం సాగుచేసి వచ్చే పంటతో కొంతైనా తమ కష్టాలు తీర్చుకోవాలనే ఆశతో తండ్రితో పాటు పొలం చేరారు. అంతేకాకుండా తండ్రికి సాయంగా నాగలిని చెరోవైపు లాగుతూ భూమిని చదును చేశారు. ఝాన్సీ జిల్లాలోని బాడ్గాన్కు చెందిన 60 ఏళ్ల అచేయ్లాల్ ఓ పూరి గుడిసెలో దారిద్ర్యరేఖకు దిగువన జీవనం సాగిస్తున్నాడు. ఓ వైపు వ్యవసాయంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం.. మరోవైపు అధిక సంతానం అతని కుటుంబాన్ని దుర్భర పరిస్థితుల్లోకి నెట్టాయి. అచేయ్లాల్కు ఆరుగురు ఆడపిల్లలు కావడంతో వారి పెళ్లిళ్లు చేయడం ఓ సామాన్య రైతుగా అతనికి తలకు మించిన భారంగా మారింది. అయినప్పటికి బతుకు మీద ఆశతో కాలంతో పోరాడుతూ.. నలుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. మిగిలిన ఇద్దరు కూతుళ్లలో రవీనా 8వ తరగతి, శివాని 7వ తరగతి చదువుతున్నారు. బడికి సెలవుల సమయంలో బాలికలిద్దరు పొలం చేరి తండ్రికి సహాకరించారు. వర్షాలు బాగా పడి.. మంచి పంట రావాలని వారు కోరుకుంటున్నారు. తాము ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలేదని ఆ బాలికలు చెబుతున్నారు. పేదరికంలో ఉన్న అచేయ్లాల్కు 1.5 లక్షల అప్పులు కూడా ఉన్నాయి. అతని కుటుంబం ధరించే దుస్తులు కూడా గ్రామస్థులు దానం చేసినవే. అంత దుర్భర జీవితం గడుపుతున్న ఆ కుటుంబం.. బీదలకు ప్రభుత్వం అందించే ఇళ్ల నిర్మాణ పథకంలో తమను లబ్ధిదారులుగా చేర్చాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ లాభం లేకపోయింది. -
హలధారి..గోదారి
రాజమండ్రి: గోదారమ్మ ఒడిలో డెల్టా రైతు పురుడు పోసుకున్నాడు. అక్షయపాత్ర లాంటి ధాన్యాగారాన్ని ఆస్తిగా ఇచ్చింది... పదిమందికీ అన్నం పెట్టే అన్నదాతను చేసింది గోదా'వరి'.. సిరుల ఝరి. ఒకనాటి క్షామపీడిత ప్రాంతమైన గోదావరి డెల్టాను సస్యశ్యామలమైనా.. దేశానికి అన్నంపెడుతూ గోదావరి డెల్టా అన్నపూర్ణగా మారిందన్నా అందుకు ఈ పావనవాహిని కరుణా కటాక్షమే కారణం. పుష్కర పండుగ నాడు ఆ తల్లి రుణం తీర్చుకుంటున్నారు ఈ ప్రాంత అన్నదాతలు. రైతు ఇంట ధాన్యాగారమే కాదు.. రాష్ట్ర ధాన్యాగారం నిండుతున్నది కూడా ఈ డెల్టాలో పండే వరి పంటతోనే. గోదావరిపై ఉభయ గోదావరి జిల్లాల్లో 8.86 లక్షల ఎకరాల్లో వరి, 1.50 లక్షల ఎకరాల్లో కొబ్బరి, వాటిలో అంతర పంటలుగా అరటి, కందా వంటి వాణిజ్య పంటలు సాగవుతున్నాయి. సుమారు 50 వేల ఎకరాల్లో కూరగాయ పంటలు పండుతున్నాయి. 80 వేల ఎకరాల్లో చేపల సాగు జరుగుతోంది. చివరకు పండే పంటలే కాదు.. పాడి రైతుల ఇంట పాల వెల్లువకు సైతం గోదావరి జీవనాధారమే. లక్షల సంఖ్యలో పశుపక్ష్యాదులు గోదావరి మీద ఆధారపడి జీవిస్తున్నాయి. సాగు ఆరంభ సమయంలో కొబ్బరికాయ కొట్టి చేలల్లోకి గోదావరి నీటిని వదలడం ద్వారా ఏరువాక ఆరంభిస్తాడు. రైతు ఒక్కరే కాదు. డెల్టాను సస్యశ్యామలం చేస్తున్న పంట కాలువలకు వేసవి తరువాత నీరు వదిలే సమయంలో సాగునీటిపారుదల శాఖాధికారులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. పసుపు, కుంకుమ, గాజులు, కొత్తరవిక, చీర గోదావరికి సమర్పించిన తరువాతే డెల్టా కాలువలకు నీరు వదులుతారు. దేవతగా భావించే గోదావరికి పుష్కర పండుగ వచ్చింది. అందుకే ఆ తల్లి రుణం తీర్చుకునేందుకు రైతులు తమతోపాటు నాగలి, ఎద్దులకు గోదావరి స్నానం చేయిస్తున్నారు.