స్పిరులినా సాగు!
♦ పలమనేరులో తొలి యూనిట్ స్థాపన
♦ నెలకు రూ. 80 వేల నికరాదాయం
ఉద్యోగాలు కోరే వారు కాదు... ఉద్యోగాలు ఇచ్చేందుకు యువత నడుంబిగిస్తేనే దేశం అభివృద్ధి పథంలో సాగుతుందనే అబ్దుల్ కలాం మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ యువ ఇంజినీర్. ప్రజోప యోగమైన గొప్పదేదైనా సాధించాలన్న తపన అతన్ని తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిగా సూపర్ ఫుడ్ స్పిరులినా అనే నాచు సాగును చేపట్టేలా పురికొల్పింది. బాలారిష్టాలను అధిగమించి ఐదుగురికి ఉపాధి కల్పిస్తూ.. యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కార్తీక్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఏదో ఒక ఉద్యోగం వెతుక్కొని నెల జీతం కోసం పనిచేయడం అతనికి ఇష్టం లేదు. ఏదైనా కొత్త పని చేసి నలుగురికీ ఉపాధి కల్పించే స్థితిలో తానుండాలనుకున్నారు. రెండేళ్లపాటు తపించారు. ఆయన అన్వేషణ ఫలించింది. మంచినీటిలో పెరిగే ఒక రకమైన ఆకుపచ్చని నాచు ‘స్పిరులినా’ను చిన్న చిన్న మడుల్లో సాగు చేసే పనిని ప్రారంభించారు. అంతర్జాలంలో శోధించి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. ఏడాది క్రితం గుడియాత్తం రోడ్డు పక్కన రాష్ట్రంలోనే తొలిగా స్పిరులినాను ఉత్పత్తి చేసే యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారయ్యే డ్రై స్పిరులినాను చైన్నైలోని మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, పొడులు తయారు చేసే ఓ కంపెనీకి విక్రయిస్తున్నారు.
నెలకు రూ. 80 వేల నికరాదాయం
ఈ యూనిట్ నిర్మాణం కోసం కార్తీక్ రూ. 8.90 లక్షలు ఖర్చు చేశారు. నెలకు 2 క్వింటాళ్ల ఎండిన స్పిరులినాను ఉత్పత్తి చేస్తున్నారు. చెన్నై కంపెనీకి క్వింటాల్ రూ. 65 వేల చొప్పున విక్రయిస్తున్నారు. క్వింటాల్‌కు రూ. 25 వేల ఖర్చు పోను నెలకు రూ. 80 వేల నికరాదాయం లభిస్తోంది.
స్పిరులినాను అధిక పోషక విలువలు కలిగిన ఆహారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. 20 గ్రాముల స్పిరులినాను ట్యాబ్లెట్లు లేదా పొడి రూపంలో తీసుకుంటే మూడు పూటలా భోజనం ద్వారా ఒనగూడే దానికి సమానమైన శక్తి లభిస్తుంది. పోషకాహార లోపం కలిగిన గర్భవతులు, పిల్లలకు ఇది మంచి పోషకాహారం. షుగర్, క్యాన్సర్, హెచ్‌ఐవీ రోగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. కొలెస్ట్రాల్, క్యాల్షియం స్థాయిలను పెంచుతుంది. ప్రొటీన్ పాళ్లు చాలా ఎక్కువ. అంతరిక్ష యాత్రికుల ఆహారంలోనూ స్పిరులినా ఓ ముఖ్య భాగం.
- సుబ్రమణ్యం పిచ్చిగుంట్ల, సాక్షి, పలమనేరు
భవిష్యత్ స్పిరులినాదే..
ఇండియాలో ఉత్పత్తి అవుతోన్న సగం విటమిన్ పౌడర్ల తయారీలో దీన్ని వాడుతున్నారు. విదేశాల్లో అయితే క్యాప్సూల్స్ గానూ జ్యూస్‌లు, బర్గర్, పిజ్జాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. మనం తీసుకునే 500 గ్రాముల ఆహారం వల్ల 30 నుంచి 40 పీవీ(ప్రొటీన్ వ్యాల్యూస్) లభిస్తుంది. అదే స్పిరులినా రోజుకు 20 గ్రాములు తీసుకుంటే 70 పీవీ లభిస్తుంది. విదేశాల్లో దీనికి గిరాకీ ఎక్కువగా ఉంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ ఉత్పత్తులకు ఆదరణ బావుంటుంది.
- నర్సింహులు కార్తీక్ (81259 29939), పలమనేరు, చిత్తూరు జిల్లా
1. సూర్యరశ్మి బాగా సోకే ఎకరా స్థలంలో ఐరన్ ఫ్రేమ్‌తో 20 ట్యాంకులను నిర్మించారు. ఫ్రేం లోపల భారీ ప్లాస్టిక్ షీట్‌ను (పీవీసీ షీట్) పరచి మంచి నీటితో నింపారు. చెన్నై నుంచి తెప్పించిన స్పిరులినా మదర్ కల్చర్‌ను నీటిలో వేసి వారంరోజుల పాటు పెంచుతారు. వారం రోజుల తర్వాత అభివృద్ధి చెందిన స్పిరులినాను వడకట్టి మిగిలిన ట్యాంకుల్లోకి మార్చుతారు; 2. పూర్తిగా తయారైన స్పిరులినాను ఎండబెట్టేందుకు ఉపయోగించే పాలీ హౌస్; 3. ఉష్ణ గదిలో ఎండబెడుతున్న స్పిరులినా; 4. విక్రయానికి సిద్ధంగా ఉన్న డ్రై స్పిరులినా ఉత్పత్తులు; 5. స్పిరులినాను మేతతో కలిపి అందిస్తూ పెంచుతున్న కుందేళ్లు; 6. స్పిరులినాను పోషక పదార్థంగా అందించి పెంచుతున్న పుట్టగొడుగులు.
మేడపైన డ్రమ్ముల్లో స్పిరులినా!
స్పిరులినా.. అత్యంత ఆరోగ్యవంతమైన శాకాహారం. మాంసకృత్తులు అధిక మోతాదులో కలిగిన తొలి ఐదు ఆహారోత్పత్తుల్లో ఒకటి. ఇది మంచినీటిలో పెరిగే ఒకరకమైన ఆకుపచ్చని నాచు. కుంటల్లో 2 నుంచి 5 రోజుల్లో స్పిరులిన రెట్టింపవుతుంది. అయితే, బొగ్గుపులుసు వాయువును ఉపయోగించి సులభంగా ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వారానికి మూడు, నాలుగు రెట్లు స్పిరులినాను పెంచే విశిష్టమైన పద్ధతిని థాయ్‌లాండ్‌కు చెందిన సమిల్ షా అనే యువకుడు కనిపెట్టాడు. మేడలపైన ఖాళీలో ఎంచక్కా ఇంటిపంటల మాదిరిగానే పెంచుతున్నాడు కూడా. బ్యాంకాక్‌లోని నొవొటెల్ హోటల్ భవనం పైన 66 గ్యాలన్లు నీరు పట్టే 40 ప్లాస్టిక్ డ్రమ్ములను పెట్టి స్పిరులినా సాగు చేస్తున్నాడు. ఇవన్నీ సన్నని గొట్టాల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి.
ఒక డ్రమ్ములో నుంచి మరో డ్రమ్ములోనికి స్పిరులినా గాలి వత్తిడి ద్వారా విస్తరించే ఏర్పాటు చేశాడు. వారానికి మూడు, నాలుగు సార్లు స్పిరులినాను సేకరించి వేరుచోటకు తీసుకెళ్లి దాన్ని పొడిగా మార్చి విక్రయిస్తున్నాడు. నొవొటెల్ హోటెల్ సహా 12 రిటైల్ దుకాణాల్లో అమ్మకానికి పెట్టాడు. ఈ టై గార్డెన్ నుంచి ఏడాదిలో 300 - 500 కిలోల తాజా స్పిరులినా ఉత్పత్తి అవుతోంది. ‘ఎనర్జియ’ అనే సంస్థను స్థాపించి స్పిరులినాతో కూడిన పాస్తాను, స్పిరులినా పొడిని షా విక్రయిస్తున్నాడు. ప్రకృతి వనరులను అతితక్కువగా వాడుకుంటూ కాలుష్య రహితమైన ఆహారోత్పత్తిని సాధించే మేలైన మార్గం తనదని.. భవిష్యత్తులో మానవాళికి ఆహార భద్రత కల్పించే మార్గం ఇదేనని షా గర్వంగా చెబుతున్నాడు. మరో భవనంపై 90 డ్రమ్ముల్లో కూడా షా స్పిరులినాను సాగు చేస్తున్నాడు. లాభార్జన కోసం మాత్రమే కాకుండా నిరుపేదల గురించి కూడా షా ఆలోచిస్తున్నాడు. శరణార్థులతోశిబిరాల వద్దనే స్పిరులినా సాగు చేయించి వారికి అధికాదాయం సమకూర్చేందుకు ప్రయత్నిస్తానన్నాడు.