
ఉత్తరాఖండ్ మలుపులు
రోజుకో మలుపు తీసుకుంటున్న ఉత్తరాఖండ్ పరిణామాలు ఇంకా పరిణతి చెందని మన ప్రజాస్వామ్య వ్యవస్థ తీరుతెన్నులను పట్టిచూపుతున్నాయి. తన ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ రాష్ట్ర హైకోర్టులో గురువారం తీర్పు వెలువడటంతో శుక్రవారం ఉదయం మాజీ సీఎం హరీశ్ రావత్ సీఎంగా కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నారు. సాయంత్రానికల్లా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు రావడంతో ఆయన ‘మాజీ’గా మారిపోయారు! మొత్తానికి 18 గంటలపాటు ఆయన ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారనుకోవాలి. స్టే వచ్చాక బీజేపీ నేతలు ఏమైనా చెప్పుకోవచ్చుగానీ...జరిగిన పరిణా మాలు ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రతిష్టనుగానీ, దేశ గౌరవాన్నిగానీ పెంచేవి కాదు.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించి ఉంటే హరీశ్ రావత్ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ గురువారం హైకోర్టులో తీర్పు వెలువడేది కాదు. దానిపై సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని తమకనుకూలమైన పరిణామంగా చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ఆ సందర్భంగా విధించిన షరతును మరిచిపోతున్నారు. తుది తీర్పు వెలువడే వరకూ ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పునరుద్ధరణకు ప్రయత్నించబోమన్న హామీని తీసుకున్నాకే సుప్రీంకోర్టు ఈ స్టే ఉత్తర్వులిచ్చింది. గురువారం హైకోర్టు కోరిన హామీ ఇదేనని వారు గుర్తుంచు కోవడం మంచిది.
ఉత్తరాఖండ్ హైకోర్టులో గత నెల 18న మొదలైన వివాదం ఎన్నెన్ని మలుపులు తిరిగిందో గమనిస్తే మనది మేడిపండు ప్రజాస్వామ్యమేమోనన్న అనుమానాలు తలెత్తుతాయి. అసెంబ్లీలో ద్రవ్య వినియోగ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని స్పీకర్ కుంజ్వాల్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ అసమ్మతి వర్గం, బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం న్యాయస్థానాని కెక్కింది. 28లోగా బల నిరూపణ చేసుకోవాలని రావత్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినా...అంతవరకూ ఓపిక పట్టలేని కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి ఒకరోజు ముందు రావత్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సీఎం ప్రయత్నిస్తున్నట్టు చూపే ‘స్టింగ్’ వీడియోను అందుకు కారణంగా చూపింది.
ద్రవ్య వినియోగ బిల్లు విషయంలో స్పీకర్ వైఖరిని, 9మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎత్తిచూపింది. ఈ కారణాలు హేతుబద్ధమైనవే అనుకున్నా...ఒక ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి అవసరమైన ప్రాతిపదికను అవి ఎలా ఏర్పరచగలవో అనూహ్యం. వీడియోలోని సంభాషణలు వాస్తవమైనవో, కాదో ఫోరెన్సిక్ నిపుణులు తేల్చాలి. బలపరీక్ష సమ యంలో స్పీకర్ తీరు ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఆయన సక్రమంగా వ్యవ హరించలేదనుకుంటే కోర్టులో సవాల్ చేయడానికి ఎటూ అవకాశం ఉండేది. ఈలోగానే 356వ అధికరణను ఉపయోగించడం తొందరపాటు చర్య అని, సర్వో న్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని కేంద్రంలోని పెద్దలకు అనిపించకపోవడం ఆశ్చర్యకరం.
సభాపతులుగా ఎన్నికయ్యాక తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండవలసిన స్పీకర్లు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వస్తున్న ఆరోపణల్లో అవాస్తవేమీ లేదు. అది అన్నిచోట్లా బాహాటంగానే కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం విషయంలోనూ, ద్రవ్య వినియోగ బిల్లు విషయంలోనూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఓటింగ్‌కు పట్టుబట్టినా మూజువాణి ఓటుతో కానిచ్చేసిన తీరు అందరికీ తెలుసు. చట్టాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చర్య తీసుకోవడానికి న్యాయస్థానాలున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఏడాది వ్యవధిలో ఎటూ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అసెంబ్లీలో బలపరీక్షను జరగనిచ్చి అక్కడ అన్యాయం జరిగిందనుకున్న పక్షంలో న్యాయస్థానం గడప తొక్కి ఉంటే పద్ధతిగా ఉండేది. విపక్షంలో ఉండి తామే అనేకసార్లు తీవ్రంగా వ్యతిరేకించిన, తప్పుబట్టిన 356 అధికరణాస్త్రాన్ని ఇలాంటి సమయంలో ప్రయోగించడం నైతి కంగా సరికాదని ఎన్‌డీఏ ప్రభుత్వంలోని పెద్దలు భావించకపోవడం వింత. ఎస్‌ఆర్ బొమ్మైకేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తర్వాత రాష్ట్రపతి తీసు కున్న నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయని స్పష్టమైంది. ఆ సంగతి ప్రభుత్వంలోని పెద్దలకు తెలియదనుకోవడానికి లేదు.
ఉత్తరాఖండ్ హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా తుది తీర్పు వెలువడేలోగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేసి ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి వేరేవారికి అవకాశం ఇవ్వబోమన్న హామీని ఇవ్వాలని కోరడాన్ని ప్రత్యేకించి ప్రస్తా వించుకోవాలి. న్యాయస్థానాలు ఏం చెప్పినా తమ రాజకీయపుటెత్తులకు అనుగు ణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం ఈమధ్య కాలంలో పెరిగింది. ఉత్తరాఖండ్‌లో పావులు కదిపి, అక్కడ బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పర్చబోరన్న గ్యారెంటీ ఏమీ లేకపోబట్టే న్యాయస్థానాలు ఈ విషయంలో పట్టుబట్టాయి. హైకోర్టులోనే ఇందుకు సంబంధించి నిర్దిష్టమైన హామీని ఇవ్వగలిగి ఉంటే రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చేది కాదు. ప్రజలిచ్చే తీర్పు ఎంత పవి త్రమైనదో, దాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో ఉత్తరాఖండ్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది.
ఆ విషయంలో సుప్రీంకోర్టుది సైతం అదే అభిప్రాయం. జనం ఎన్ను కున్న ప్రభుత్వాలను ఏకపక్షంగా రద్దు చేయడం లేదా అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం సరికాదని న్యాయస్థానాలు మొదటినుంచీ చెబుతున్నాయి. అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఆ మాటను బేఖాతరు చేసింది. ఇప్పుడు అదే పని బీజేపీ చేస్తోంది. ఇలాంటి ధోరణులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తాయని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయని, వ్యవస్థపట్ల ప్రజల్లో అవిశ్వాసాన్ని పెంచు తాయని అందరూ గుర్తించాలి.