పాత కేసు-కొత్త మలుపు | Ishrat Jahan case: GK Pillai & RVS Mani's statements on Chidambaram further muddy the waters | Sakshi
Sakshi News home page

పాత కేసు-కొత్త మలుపు

Published Wed, Mar 2 2016 11:53 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Ishrat Jahan case: GK Pillai & RVS Mani's statements on Chidambaram further muddy the waters

రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాలు, ఎత్తుగడలు వచ్చి చేరితే ఎలాంటి విషయమైనా ఎంత జటిలంగా మారుతుందో చెప్పడానికి ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసు ప్రబలమైన ఉదాహరణ. 2004లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల బాలిక ఇష్రాత్ జహాన్ మరో ముగ్గురితోపాటు ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉదంతం ఇన్నేళ్ల తర్వాత కూడా మిస్టరీగా మిగిలిపోవడమేకాక దాని చుట్టూ కొత్త వివాదాలు ముసురుకుంటున్నాయి.

తన కుమార్తెను అన్యాయంగా చంపి, ఆమెపై ఉగ్రవాది ముద్ర వేశారని...ఇందుకు కారకులైనవారిని శిక్షించాలని ఇష్రాత్ తల్లి దాఖలు చేసిన పిటిషన్ మాత్రం దారీతెన్నూ లేకుండా మిగిలిపోయింది. ఈ కేసులో హైకోర్టు ఎదుట 2009లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దాఖలు చేసిన రెండు రకాల అఫిడవిట్లు ఈ కొత్త వివాదాలకు మూలం. ఇష్రాత్ జహాన్ లష్కరే తొయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది అని మొదటి అఫిడవిట్ చెప్పగా...రెండో అఫిడవిట్ ఆ సంగతిని అసలు ప్రస్తావించలేదు. ఆనాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం జోక్యం కారణంగానే ఈ మార్పు చోటు చేసుకున్నదని, ఈ విషయంలో తనను సంప్రదించలేదని ఆనాటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లై అంటుంటే...నరేంద్ర మోదీ, అమిత్ షాలను రాజకీయంగా దెబ్బతీసేందుకే చిదంబరం ఈ పని చేశారని బీజేపీ ఆరోపిస్తున్నది. ఇదే అదునుగా ఈ కేసుకు సంబంధించి పోలీసు అధికారులపై సాగుతున్న ప్రాసిక్యూషన్ చర్యలన్నిటినీ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

 ఈ కేసు తీసుకుంటున్న మలుపులు, కొత్తగా వచ్చి చేరుతున్న వివాదాలు సాధారణ పౌరులను ఆశ్చర్యపరుస్తాయి. తన కుమార్తెను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపారని ఒక తల్లి చేసిన ఆరోపణకు సంబంధించిన కేసు ఇన్నేళ్లయినా తేలకపోగా... ఆమె ఉగ్రవాది అవునా, కాదా అనే అంశం చుట్టూ చర్చ నడుస్తోంది. బీజేపీ ఆరోపిస్తున్నట్టు ఈ కేసులో చిదంబరం వ్యవహార శైలి అనుమానించదగిందే కావొచ్చు. ఆయన లక్ష్యం నరేంద్రమోదీ, అమిత్ షాలే అయి ఉండొచ్చు. పిళ్లై అంటున్నట్టు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అఫిడవిట్‌ను మార్చి ఉండొచ్చు. ఆ అంశంలో ఎవరి దోషమెంతో తేల్చి దర్యాప్తు సంస్థలను, నిఘా సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్న వైనాన్ని, అందుకోసం అడ్డగోలుగా వ్యవహరించిన తీరునూ బయటపెడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అందువల్ల దర్యాప్తు సంస్థల, నిఘా సంస్థల పని విధానం మెరుగుపడి, అందులో రాజకీయ జోక్యం తగ్గితే అది ఆహ్వానించదగ్గ పరిణామమే. మరోపక్క చిదంబరంపై కోర్టు ధిక్కార నేరం కింద విచారణ జరపాలన్న పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.

 అయితే ఇష్రాత్ మరణం మాటేమిటి? ఆమె నిజమైన ఎన్‌కౌంటర్‌లో మరణించిందో లేక నకిలీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిందో తేలవలసిన అవసరం లేదా? గుజరాత్ పోలీసుల కథనం ప్రకారం ఇష్రాత్‌తోపాటు మరో ముగ్గురు యువకులు అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని హతమార్చడానికి బయల్దేరారు. ముందుగానే ఈ సమాచారం అందుకున్న తాము వారిని అడ్డగించడానికి ప్రయత్నించినప్పుడు ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నదని పోలీసులు చెబుతున్నారు. అయితే 2009లో అహ్మదాబాద్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన దర్యాప్తు నివేదికగానీ, 2011లో పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ ఇచ్చిన నివేదికగానీ ఈ కథనంతో విభేదించాయి. ఆ నలుగురినీ పోలీసులు ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే కాల్చి చంపారని తేల్చాయి. పర్యవసానంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులతో సహా 21మందిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మరో అయిదేళ్లు గడిచినా ఆ కేసులో విచారణ ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు.

 ఇష్రాత్ జహాన్ ఉగ్రవాది అని చెప్పడానికి పోలీసులు ప్రస్తుతం అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ వెల్లడించిన విషయాలను ఆధారంగా చూపుతున్నారు. 2005లో లష్కరే అధినేత జాకీవుర్ రెహ్మాన్ లఖ్వీ వద్ద ఇష్రాత్ పేరు ప్రస్తావనకొచ్చిందని 2010లో హెడ్లీ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈమధ్యే ముంబై కోర్టుకు ఇచ్చిన  సాక్ష్యంలో మరోసారి ఆమెకు లష్కరే సంస్థతో సంబంధాలున్నాయని అన్నాడు. ఈ సంగతిని చర్చలోకి తీసుకురావడంద్వారా ఇష్రాత్‌ను కాల్చిచంపడం సబబేనన్న అభిప్రాయాన్ని కలగజేయడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆమె తల్లి అంటున్నది. మగదిక్కులేని తమ కుటుంబాన్ని పోషించడం కోసం ఇష్రాత్ చదువుకుంటూనే పిల్లలకు ట్యూషన్లు చెప్పేదని, ఆ ఆదాయం సరిపోక తమ కుటుంబానికి తెలిసిన జావేద్ అనే వ్యక్తి  ద్వారా వేరే పనిలో చేరిందని ఆమె చెబుతున్నారు, అలా చేరిన నెలన్నర లోపే ఈ ఘటన చోటు చేసుకున్నదంటున్నారు. ఇష్రాత్‌పై అంతకు ముందెన్నడూ ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు లేవని ఆమె గుర్తుచేస్తున్నారు. అటు మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ నివేదిక, ఇటు సిట్ నివేదిక కూడా ఆ సంగతినే ధ్రువీకరించాయి.

 ఇప్పుడు అఫిడవిట్‌లపై జరుగుతున్న రగడ వింత గొలుపుతుంది. తన ప్రమేయం లేకుండానే, తనకు తెలియకుండానే అఫిడవిట్‌లను మార్చినప్పుడే జీకే పిళ్లై అభ్యంతరం చెప్పి ఉండాలి. ఎందుకంటే ఆయన సాధారణ గుమాస్తా కాదు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి. ఆ స్థాయి ఉన్నతాధికారి కేంద్ర హోంమంత్రి వ్యవహరించిన తీరును ప్రశ్నించి ఉంటే  వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నందుకు అందరూ అభినందించేవారు. ఆ క్రమంలో పదవిని కోల్పోయినా ఆయనకంటూ గౌరవం దక్కేది. అప్పుడు మౌనంగా ఉండిపోవడంవల్ల ఇప్పుడు చెప్పే మాటలకు విలువ లేకుండా పోతుందని ఆయన గ్రహించలేకపోతున్నారు.

ఇంతకూ తొలి అఫిడవిట్‌లోనైనా ఇష్రాత్ లష్కరే ఉగ్రవాది అని తేల్చడానికి తగిన సమాచారమేమీ పొందుపరచ లేదు. 2004 జూలై 15న కొన్ని పత్రికల్లో ఆమె లష్కరే సంబంధాల గురించి వెలువడిన వార్తలు మినహా అందులో మరేమీ లేదు. ఇంత బలహీనమైన అంశంపై ఈ స్థాయిలో రాద్ధాంతం చోటు చేసుకోవడం చిత్రమే. పార్లమెంటు సమావేశాలు సాగుతున్నాయి గనుక తమదే పైచేయి అని చాటుకోవడానికి అధికార, విపక్షాలు ప్రయత్నిస్తాయి. అది సహజమే. కానీ ఆ క్రమంలో ఒక అనుమానాస్పద మరణంపై సాగుతున్న విచారణ అతీగతీ లేకుండా మిగిలిపోకూడదు. తన కుమార్తెది హత్యే అయిన పక్షంలో కారకులను దండించాలన్న ఒక తల్లి డిమాండ్‌ను ఉపేక్షించకూడదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement