
సర్కారీ లేబుళ్లు
జీవన కాలమ్
పదిహేను సంవత్సరాల కిందట రాసిన ‘సాయంకాల మైంది’ నవలలో కథానాయ కుడికి విదేశాలలో ఉద్యోగానికి ఆహ్వానం వస్తుంది. ఛాంద సుడైన తండ్రి ‘నా కొడుకే ఎందుకు వెళ్లాలి?’ అని వాపో తాడు. అతనికి అవకాశం కల్పించిన అమెరికన్ సంస్థ ప్రతినిధి ఎడిత్ కామెరాన్ సమాధానం: ‘‘మీ దేశంలో చదువులకీ, అర్హతకీ, సామ ర్థ్యానికీ ‘కులాల’ గుర్తులు పెట్టుకున్నారు. మేము విజ యానికీ, వినియోగానికీ గుర్తులు పెట్టుకున్నాం. మీ పద్మభూషణ్‌లూ, భారతరత్నలూ జీవితం ఆఖరి దశలో ఉన్నవారిని సత్కరించి సంబరపడే సెంటిమెంటల్ గుర్తులు. మా దేశంలో ప్రతియేటా నోబెల్ బహు మతులు పుచ్చుకునే యువరక్తం కావాలి. మీరు ముసలి వాళ్లని గౌరవించి సాంప్రదాయాన్ని నిలబెడుతున్నామని చంకలు గుద్దుకుంటారు. మేం యువకుల సామర్థ్యాన్ని గుర్తుపట్టి, చేతులు సాచి వాళ్లని మా వైపు లాక్కుంటాం’’.
మన పద్మభూషణ్‌లూ, భారతరత్నలూ గొప్పవాళ్లే. సందేహం లేదు. మొన్న దిలీప్‌కుమార్‌కి ఆయన 93వ యేట పద్మవిభూషణ్‌ని ఆయన ఇంటికి వెళ్లి ఇచ్చి వచ్చారు. ఆయన గౌరవాన్ని అందుకోలేని, సరిగా నిల బడనైనా నిలబడలేని స్థితిలో ఉన్నారు. నిన్నకాక మొన్న దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం 78 ఏళ్ల మనోజ్ కుమార్‌కి ప్రకటించారు. ‘నేను ఆనందపడుతూనే ఆశ్చర్యపోయాను’’ అన్నారు. ఈ తరానికి - అప్పు డప్పుడు టీవీల పుణ్యమా అంటూ తప్ప - వారి వైభవం తెలియదు.
19వ యేట నుంచీ సంగీత సాధన చేస్తూ కీర్తి శిఖరాలను అధిరోహించిన అద్భుత గాయకుడు భీమ్ సేన్ జోషీకి 2009లో ఆయన 87వ యేట భారతరత్న అయిన రోజుల్లో దాదాపు మూలనపడిన పరిస్థితి. ఆ గౌరవం ఏమిటో, దాని స్థాయి ఏమిటో ఎరిగే స్థితిలో లేడు. ఫిబ్రవరి 16, 2009న నేనొక కాలమ్ రాశాను ‘జాతి గర్వించే ప్రమాదం’ అని. ఈ వ్యంగ్యాస్త్రాన్ని యథాతథంగా ఇప్పుడు చదివినా సుఖంగా ఉంటుంది. అది కేవలం కల్పితం. ఆయన మనుమరాలు పరుగున వచ్చి ఈ శుభవార్తని తాతకి చెప్పింది. ఆయన తలమీద చుండ్రుని గోక్కుంటున్నాడు.
‘‘నీకు ఢిల్లీలో గొప్ప బహుమతి వచ్చింది తాతయ్య’’
‘‘ఏం వచ్చింది?’’
‘‘గొప్ప గౌరవం’’
‘‘ఇప్పుడెందుకొచ్చింది?’’
‘‘నువ్వు గొప్పవాడివి కనుక’’
‘‘అని ఎవరన్నారు?’’
‘‘నువ్వు బాగా పాడతావని’’
‘‘ఇప్పుడు గొంతు పోయింది కదా? అప్పుడు విన్నవాళ్లు ఢిల్లీలో ఉన్నారా?’’
‘‘ఎవరో చెప్పి ఉంటారు’’
‘‘చెప్పుడు మాటలు వినకూడదుకదా? ఈ చుండ్రు ప్రాణం తీస్తోంది’’
ఇలా సాగుతుంది.
గొప్ప గౌరవానికి రెండు ప్రయోజనాలు. కళా కారుడికి ప్రోత్సాహం. మరింత గొప్ప కృషికి ఉత్సాహం. ఈ ప్రపంచంలోనే గొప్ప పురస్కారం - నోబెల్ బహుమతి సెంటిమెంట్‌గా వీపు తట్టడం కాదు. ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయిత్రి పెరల్ బక్‌కి నోబెల్ బహుమతి 46వ యేట ఇచ్చారు. తర్వాత 34 సంవ త్సరాలు రచనలు చేసింది. సర్ సి.వి.రామన్‌కి 42వ యేట ఇచ్చారు. మరో 46 సంవత్సరాలు శాస్త్ర పరి శోధనలు జరిపారు. వారి ప్రపంచ ప్రఖ్యాత ‘రామన్ ఎఫెక్ట్’ ఆ తర్వాతిదే. ఆయనకి మన దేశం భారతరత్న 66వ యేట ఇచ్చింది! రవీంద్రునికి నోబెల్ బహుమతి 52వ యేట ఇచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు గార్ఫీల్డ్ సోబర్స్‌కి 39వ యేట ‘సర్’ గౌర వాన్ని ఇచ్చింది. ఇప్పుడాయన వయసు 79.
జాతి తరఫున ఒక కళాకారుడికి అర్పించే సత్కారం అతనికి మరింత స్ఫూర్తినీ, జాతికి ఆయన అందించగల కృషికి మరింత ఉత్సాహాన్నీ ఇవ్వగలగాలి. ప్రతియేటా మనం ఒడిలిపోయి, ఆ సత్కారం ఏమిటోకూడా గుర్తు పట్టలేని ముసిలి ఒగ్గులను వెదుకుతాం. ఎందుకు? మన పెద్దల్ని మనం మరిచిపోలేదని చంకలు గుద్దు కోవడానికి. మన పురస్కారాలు గొప్పతనాన్ని గుర్తు పట్టామని చెప్పుకోడానికి ఆలస్యం అంటించిన లేబుళ్లు. మన అభిరుచిని చాటుకోడానికి సిద్ధం చేసుకున్న సాకులు.
నాదయోగి నేదునూరి కృష్ణమూర్తి గారికి బతి కుండగా (87) పద్మభూషణ్ గౌరవాన్ని ఇవ్వలేదు. ఒక గుమ్మడి, ఎస్వీ రంగారావు, పీబీ శ్రీనివాస్‌లకు (82) ఈ పురస్కారాలు దగ్గరగానయినా రాలేదు.
2009లో రాసిన కాలమ్ ఆఖరి వ్యాఖ్యాలు ఇక్కడ మళ్లీ ఉటంకించాలనిపిస్తోంది.
భీమ్‌సేన్ జోషీ: ఏమిటో సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెడుతున్నారు. ఆ పాటా అవీ పోయి ఎన్నో ఏళ్లయింది. దొంగలు పడి ముప్పై ఏళ్లయింది.
‘‘దొంగలుకాదు తాతయ్యా. ఇచ్చేవాళ్లు దొరలు..’’
‘‘పోన్లే. గొడవలేదంటున్నావు. అదే పదివేలు. ముందు ఈ చుండ్రుకి మందు రాయి. ఆ గౌరవమేదో చుండ్రుకన్నా ఇబ్బంది పెట్టేట్టు ఉంది...’’
ఇలాంటి నిస్పృహ మన పెద్దలకి మనస్సుల్లో నయినా కలిగి ఉంటుందని నాకనిపిస్తుంది.
గొల్లపూడి మారుతీరావు