
వారికి సంతోషం.. వీరికి సంక్షోభం
సందర్భం
పెద్ద నోట్ల రద్దు... ప్రస్తుతం ఈ అంశం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశా న్నంతటినీ కుదిపేస్తున్నది. 130 కోట్లమంది ప్రజల్లో అత్యధిక మందిని ముప్పు తిప్పలు పెడుతున్నది. ఎన్ని కలకు ముందు నల్లధనాన్ని, నల్లధన కుబేరులను కూకటి వేళ్లతో పెకిలిస్తానంటూ ఆర్భాటపు ప్రకటన చేస్తూ వచ్చిన నరేంద్ర మోదీ వారిని వదిలిపెట్టి, ఇండియాను ‘నగదు రహిత ఆర్థిక వ్యవస్థ’గా రూపొందిద్దాం... అంటూ చిలక పలుకులు వల్లె వేసేసరికి యావత్ భారతం నివ్వెరపోయింది. విదేశీ స్విస్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని వెనక్కు రప్పిస్తామన్న మోదీ మాటలు నీటి మూటలని ఈ తతంగంతో తేలిపోయింది. దాదాపు 653 మంది నల్ల కుబేరులు ఈ చర్యలతో అమితానందం పొందుతున్నారు.
ఉగ్రవాదాన్ని, దేశంలో నకిలీ నోట్ల దందాను అరికట్టేందుకోసమే రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నామంటూ ప్రధాని ప్రకటించినప్పుడు... మేధా వులు, ఉన్నత విద్యావంతులు, మధ్యతరగతివారు, బ్యూరోక్రసీ వర్గానికి చెందిన కొందరు మోదీ చర్యలు ‘భేష్...’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇదే క్రమంలో దేశంలో అత్యధికంగా ఉన్న సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, అసంఘటితరంగ కార్మి కులు, వృత్తిదారులు, వీధుల్లో నాలుగు గిర్రల బండ్లతో వ్యాపారం చేసుకునేవారు, అడ్డా మీద కూలీలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ సర్కారుకు శాపనార్థాలు పెట్టారు. ఆర్బీఐ విడుదల చేసిన రూ.2 వేల నోటు జనం కష్టాలను తీర్చకపోగా మరింత పెంచింది.
పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి మోదీ మొదట చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న ప్రకటనలకు పొంతన లేకుండా పోయింది. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పటి నుంచి నేటి వరకూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ ప్రపంచ బ్యాంకు విధానాలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తు న్నాయి. యుపీఏ1, యుపీఏ2 ఈ విషయంలో వేగంగా కదలగా... ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే ఇంకా దూకుడుగా ప్రపంచ బ్యాంకు పాలసీలను అమలు చేస్తున్నది. ఈ క్రమంలో రిటైల్‌రంగంలో ప్రపంచంలో చైనా తర్వాత అతి పెద్దదైన ఇండియా మార్కెట్‌ను హస్తగతం చేసుకునేందుకు బహుళజాతి కంపెనీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఆయా కంపెనీలకు ఇక్కడి చిల్లర వర్తకం, వాటి మీద ఆధారపడి బతికే కోట్లాది ప్రజలు అడ్డు తగులుతున్నారు. మనదేశం లోని చిల్లర వర్తకాన్ని దెబ్బ కొట్టకుండా ముందుకు సాగలేమనే విషయాన్ని ఆయా కంపెనీలు గుర్తిం చాయి. మోదీ ‘నగదు రహిత ఆర్థిక వ్యవస్థ’కు ఇక్కడే బాటలు వేసుకుంటున్నాయి.
పైకి చూస్తే నగదు రహిత లావాదేవీల వల్ల అంతా పారదర్శకంగా జరిగిపోతున్నట్టు కనబడినా... కార్పొరేట్ అవినీతి, పైస్థాయిలో లంచగొడితనం మరింత పెరిగిపోవటం ఖాయమని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ లాంటి ఆర్థిక నిపుణులు హెచ్చ రిస్తున్నారు. అందువల్ల ప్రధాని నల్లధనాన్ని కక్కిస్తా మన్నా లేక నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అన్నా అది స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయటం కోసం తప్ప మరోటి కాదనేది సుస్పష్టం.
పెద్ద నోట్ల రద్దుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసు కున్న వైఖరి, సీఎం వ్యవహార శైలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది. కేంద్ర ప్రభుత్వ చర్యలను సమర్థించిన కేసీఆర్... సిద్దిపేటను నగదు రహితంగా మారుస్తానంటూ ప్రకటించటం ఒక వింత. పెద్ద నోట్ల రద్దు ప్రకటనపై మొదట్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కేసీఆర్... కొద్ది రోజులకే ప్రధానితో భేటీ కావటం, అంతకుముందే ఆయన తనయుడు కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రితో ప్రత్యేకంగా సమావేశమవటం చకచకా జరిగిపోయాయి. హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కేసీఆర్... నగదు రహిత ఆర్థిక వ్యవస్థను తమ ప్రభు త్వం సమర్థిస్తుందని, అయితే తాను కొన్ని ప్రత్యామ్నా యాలను, సూచనలను కేంద్రానికి చేస్తున్నట్టు తెలి పారు. అంటే ఒకవైపు కేంద్రాన్ని సమర్థిస్తూనే... మరో వైపు రాష్ట్ర ప్రజల నుంచి తనకు వ్యతిరేకత లేకుండా చూసుకోవటమన్నమాట. కర్ర విరక్కుండా, పాము చావకుండా చేయటమంటే ఇదే. కేసీఆర్ కేంద్రానికి ఎంతగా అంటకాగాలో అంతగా కాగుతున్నారనే విష యం దీనిద్వారా మరోసారి నిరూపితమైంది.
ఏతావాతా తేలిందేంటే... అటు ప్రధాని మోదీ, ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరువురూ సామాన్య ప్రజలను, వారి ఇబ్బందులను గాలి కొదిలేశారు. మీ చావు మీరు చావండి... మేం మాత్రం కార్పొరేట్లకు, బడా సంపన్నవర్గాలకు ఊడిగం చేస్తామని వారు చెప్పకనే చెప్పారు. మోదీ చెబుతున్నట్టు... ‘అచ్చేదిన్ కాదు... ఇది దేశ జనానికి చచ్చేదిన్...’ తెలుగులో చెప్పాలంటే... మంచి రోజులు కాదు, జనాన్ని ముంచే రోజులు...అందుకే ప్రజలు ఈ విషయాలపట్ల అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. మోదీ చర్యలను నిరసిస్తున్న వారికి మద్దతునివ్వటం ద్వారా కేంద్ర ప్రభుత్వ కుయుక్తులను తిప్పిగొట్టాలి.
- జూలకంటి రంగారెడ్డి
వ్యాసకర్త సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు