ఓటుకు కోట్లు ముగిసిన కథేనా?
కొమ్మినేని శ్రీనివాసరావుతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
మీడియా కోడై కూసిన ఓటుకు కోట్లు కేసు ఇక ముగిసిన చరిత్రేనని తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కేసుతో ప్రళయం వస్తుందన్నంతగా ఆర్భాటం చేసిన కేసీఆర్ ప్రభుత్వం చివరకు చార్జిషీట్ కూడా పెట్టలేకపోయిందని విమర్శించారు. నా గురించి నువ్వు, నీ గురించి నేను మాట్లాడొద్దు. ఒకరి వ్యవహరాల్లో మరొకరు జోక్యం చేసుకోవద్దని ఏపీ, తెలంగాణ సీఎంలిద్దరూ సర్దుబాటు చేసుకున్నారని, ఈ సర్దుబాటుకు మూలకారకులు రాష్ట్రంలో గవర్నర్, కేంద్రంలో వెంకయ్యనాయుడులే అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి రావడం కల్లే అంటున్న పొన్నం ప్రభాకర్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
మీ దీక్ష ఉద్దేశం ఏమిటి? ఏమేరకు విజయవంతమైంది?
ఉత్తర తెలంగాణలో కరీనంగర్ ఒక ముఖ్యమైన జిల్లా. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి కూడా వైద్యంకోసం ప్రజలు ఇక్కడికే వస్తారు. జిల్లా కేంద్రంలో 500 పడకలతో ప్రభుత్వాసుపత్రి ఉందంటే దీని ప్రాధాన్యత అర్థమవుతుంది. నేను ఎంపీగా ఉన్నప్పుడే మా జిల్లాకు మెడికల్ కాలేజీ కావాలని అడిగాను. నేను తెలంగాణ ఇవ్వలేను కానీ మెడికల్ కాలేజీ మాత్రం ఇస్తాను అని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైన దశలో అది అటకెక్కేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఆగస్టు 5న కేసీఆర్ కరీంనగర్‌కు వచ్చారు. మేం అడగకముందే ప్రభుత్వ మెడికల్ కాలేజీని కరీంనగర్‌కు, గోదావరి ఖనికి కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బిడ్డ కదా.. గుర్తుపెట్టుకుని మరీ ప్రకటించారు అని అందరం చాలా సంతోషపడ్డాం. కానీ 2017 వచ్చింది అయినా దాని ఊసులేదు.
తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత స్థాయి ఎంత?
నిజంగానే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం పట్ల విసిగి వేసారిపోయారు. కాంగ్రెస్ పార్టీగా మే ఇంకా అనుకున్నంత గట్టిగా పోరాడలేదని జనం అనుకుంటున్నారు. ప్రజల నుంచి ఆ మాట రావడం కోసమే గత మూడేళ్లుగా మేం ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం కూడా మూడేళ్లపాటు హనీమూన్‌లో గడిపేసింది. మీరు ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పారు, ఏం చేశారో చెప్పండి. డబుల్ బెడ్ రూంలు ఎన్ని కడతామన్నారు, ఎన్ని కట్టారో చెప్పండి. ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారో చెప్పండి అని అడుగుతున్నాం. లక్షరూపా యల వరకు రుణమాఫీ ఇస్తామన్నారు 6 సార్లుగా ఇస్తూనే ఉన్నామని చెప్పండి సిగ్గు లేకుంటే. తెలంగాణ ప్రజలకు ఇళ్లు వచ్చాయో లేదో కానీ సీఎంకి మాత్రం ప్రగతి భవన్ వచ్చింది. పది కార్ల కాన్వాయ్ వచ్చింది.
నేరెళ్ల దళితులపై దాడి పెద్ద సమస్య అయి కూర్చుంది కదా?
ఇసుక లారీల వెనుక దోపిడీ గురించి ప్రశ్నిస్తే నేరెళ్ల బాధితుల కులం పేరు చెప్పి మరీ కొట్టారు. లారీలు కాలిస్తే పోలీసులు కొట్టకుండా ఊరికే ఉంటారా అని కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్సులో ప్రకటించారు. మేం దళితులం అని వాళ్లేమన్నా బిళ్ల గట్టుకున్నారా అని ఎద్దేవా చేశారు. ఇకపై రాష్ట్రంలో వీళ్లు గౌళ్లు, సాలెవాళ్లు, కోమటోళ్లు, కాపోళ్లు, కమ్మోళ్లు అని జనం ముఖంపై బిళ్లలు కూడా కొట్టిస్తారేమో అనుకున్నాం మేం. నీ బంధువులకు చెందిన లారీలు కాలిపోతే అంత పెద్ద ఇష్యూ అవుతుంది. ఇసుక లారీల వల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయి ఇంతవరకు. ఇవ్వాళ్టికి కూడా ఇసుక దోపిడీ ఆగటం లేదు.
ఎంపీ జితేందర్‌రెడ్డితో రాజీనామా సాహస కృత్యమేనా?
నిజంగా కేసీఆర్‌కు అంత దమ్ము ఉంటే ఫిరాయింపులకు దిగి మా పార్టీనుంచి, ఇతర పార్టీల నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయించి మరీ ఉపఎన్నికలకు సిద్ధం కావాలి. ఫిరాయించిన ముగ్గురు ఎంపీలచేత, 15 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టించు. అప్పుడు తెలుస్తుంది ఎవరి సత్తా ఏమిటో?
చంద్రబాబు, కేసీఆర్ పాలనపై మీ అభిప్రాయం?
ఇద్దరి మధ్యలో అనుసంధానంలా మన పెద్దమనిషి గౌరవనీయులైన గవర్నర్ నరసింహన్ ఉన్నారు కదా. రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి ఆయనకు ఒక భజన శాఖ క్రియేట్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఎవరో ఒక సంస్థ పెట్టుకుని అగ్రికల్చర్ అవార్డు కేసీఆర్‌కి ఇస్తే గవర్నర్ ప్రశంసలు గుప్పించేస్తారు. కనీస నైతిక ప్రమాణాలు ఉండాలి కదా. అంతకుముందు మా ఎన్డీ తివారి రాసలీలలు చేసి రాజభవన్ విలువను నాశనం చేస్తే.. వేరే పార్టీమీద గెలిచిన ఎమ్మెల్యేతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి రాజ్‌భవన్ ఎథిక్స్ పోగొట్టాడాయన. ఈ ముగ్గురి గురించి ఏం మాట్లాడతాం మనం.
ఓటుకు కోట్లు కేసు ఏమౌతుందని అనుకుంటున్నారు?
ఏమవుతుంది? మధ్యలో భజనశాఖ మంత్రి ఉన్నారు కదా సర్దుబాటు చేయడానికి. ఇక్కడేమో గవర్నరు, అక్కడేమో వెంకయ్య వంటి పెద్దలు ఉన్నారు కదా. ఇంకేమవుతుంది? ఏదో ప్రళయం వస్తుంది అన్నంతగా మీడియా ఈ కేసుపై కవర్ చేసింది. అంత ఆర్భాటం చేసిన కేసీఆర్ ప్రభుత్వం చివరకు చార్జిషీట్ కూడా పెట్టలేకపోయింది.
ఓటుకు కోట్లు కేసులో ఎవరిది పై చేయి అయింది?
దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు.. కేసీఆర్, బాబు ఇద్దరూ సర్దుబాటు చేసేసుకున్నారు. నాగురించి నువ్వు మాట్లాడొదు, నీగురించి నేను మాట్లాడను. ఒకరి ఇంట్లో మరొకరు జోక్యం చేసుకోవద్దు. అనుకున్నారు. అంతే.. కేసు ముగిసిపోయింది. ఎంతగా రాజీపడ్డారంటే తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తే బాబు నుంచి కనీసం ఖండన లేదు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడొద్దని అగ్రిమెంటు మరి.
(పొన్నం ప్రభాకర్‌తో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/VqrL3V
https://goo.gl/ps6JPF