సజావుగా కనబడే సమాజం ఉన్నట్టుండి మతం పేరిటో, కులంపేరిటో కల్లోలభరితం కావడం...పలువురు ప్రాణాలు కోల్పోవడం, వేలాదిమంది చెట్టుకొకరు పుట్టకొకరై ఇబ్బందులు పడటం విషాదకరమైన విషయం. అంతకన్నా విషాదకరం ఏమంటే అలాంటి ఉదంతాలపై నియమించే విచారణ కమిషన్‌లు కారకులను గుర్తించలేకపోవడం, కఠిన చర్యలు తీసుకోవడానికి అవసరమైన సాక్ష్యాలను సేకరించలేకపోవడం. మూడేళ్లక్రితం ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్, దానికి ఆనుకుని ఉన్న మరి నాలుగు జిల్లాల్లో మతఘర్షణలు కార్చిచ్చులా వ్యాపించాయి.
ఆ ఘర్షణల్లో 62మంది ప్రాణాలు కోల్పోగా వందలాదిమంది గాయాలపాలయ్యారు. 55,000మంది కొంపాగోడూ వదిలి తరలిపోవాల్సివచ్చింది. 2013 ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో జరిగిన ఆ ఉన్మత్తకాండపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి విష్ణుసహాయ్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఆ కమిషన్ ఇన్నేళ్లకు ఇచ్చిన నివేదికను గమనిస్తే ఎంతో నిరాశ కలుగుతుంది. ‘గజం మిథ్య...పలాయనం మిథ్య’ అన్న చందంగా ఇచ్చిన ఆ నివేదిక కొండను తవ్వి కూడా ఎలుకను పట్టలేకపోయింది.
కమిషన్ల నియామకంపైనా, వాటి విచారణలపైనా జనంలో ఇంకా విశ్వాసం సడలిపోలేదు. ఎలాంటి ఘటన జరిగినా విచారణ కమిషన్ నియమించాలన్న డిమాండ్ రావడానికి అదే కారణం. అయితే, అలాంటి కమిషన్లు చిత్తశుద్ధితో, నిర్మొహమాటంగా తమ విధులను నిర్వర్తిస్తే వేరే విషయం. కానీ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అలా జరుగుతోంది. పర్యవసానంగా తాత్కాలికంగా ఉద్రిక్తతలను ఉపశమింపజేయడానికి తప్ప కమిషన్‌లు అనేవి పెద్దగా ఉపయోగపడటం లేదు. బాధ్యులైనవారిని దండించడానికి తోడ్పడటంలేదు. ఇప్పుడు విష్ణుసహాయ్ కమిషన్ అసలే ఏం చెప్పలేదనలేం. ఇంటెలిజన్స్ అధికారుల వైఫల్యాన్ని అది ఎత్తిచూపింది. ఉన్నతాధికారుల వ్యవహారశైలి పరిస్థితిని మరింత విషమింపజేసిందని చెప్పింది.
హిందూ, ముస్లిం మతాలకు చెందిన నేతలు ఇచ్చిన రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఘర్షణలు వ్యాపించడానికి కారణమయ్యాయని వివరించింది. ఇన్ని చేసింది తప్ప ఫలానావారు ఈ ఘర్షణలకు మూలం అని నిర్ధారణగా చెప్పలేకపోయింది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, బీఎస్‌పీకి చెందిన మాజీ ఎంపీ, వారి అనుయాయులూ వ్యవహరించిన తీరు ఘర్షణ వాతావరణాన్ని పెంచిందని చెప్పింది. అయితే ఎవరిపైనా ఫలానా చర్య తీసుకోవాలని సిఫార్సు చేయలేకపోయింది. సమాజ్‌వాదీ ప్రభుత్వాన్నిగానీ, ఆ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులనుగానీ వేలెత్తిచూపలేకపోయింది. మరీ బాగుండదనో, మరేమోగానీ ఒకే ఒక్కచోట సమాజ్‌వాదీ నాయకుడు రషీద్ సిద్దికి పేరును ప్రస్తావించి, ఆయన రెచ్చగొట్టే ప్రసంగం చేశాడని పేర్కొంది.
ముజఫర్‌నగర్ ఘర్షణల నేపథ్యాన్ని ఒక్కసారి మననం చేసుకోవాలి. ఒక మతానికి చెందిన యువకుడు హత్యకు గురికావడం, ఆ వెనువెంటనే వేరే మతానికి చెందిన ఇద్దరు యువకుల మృతదేహాలు కనబడటం ఉద్రిక్తతలకు దారితీసిందని పోలీసుల కథనం. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు యూ ట్యూబ్‌లో ఇద్దరు యువకులను బహిరంగంగా హింసిస్తున్న ఉదంతానికి సంబంధించిన వీడియోను ఉంచడంతో ఘర్షణలు రాజుకున్నాయని వారి ఆరోపణ. ఆ వీడియోతోపాటు ‘ముజఫర్‌నగర్‌లో ఏం జరిగిందో చూడండి’అంటూ ఒక వ్యాఖ్యానాన్ని కూడా ఆయన జత చేశారని చెబుతున్నారు. నిజానికి అది 2010లో పాకిస్తాన్‌లోని సియోల్‌కోట్‌లో తాలిబన్‌లు అమలు చేసిన ఉన్మాద శిక్షలకు సంబంధించింది. ఈ వీడియోను సకాలంలో గుర్తించి తొలగించి ఉంటే, అది మన దేశానికి సంబంధించినదే కాదని అధికారులు మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే ఘర్షణలు వ్యాపించేవి కాదని కమిషన్ అంటున్నది. అది నిజమే కావొచ్చు. కానీ ఆ వీడియో ప్రచారమయ్యాక జనంలో ఏర్పడ్డ ఆగ్రహావేశాలకు కార్యాచరణ రూపం ఇచ్చిందెవరు? ఎవరి ప్రాపకంతో వందలమంది జనం ట్రాక్టర్లలో, ఇతర వాహనాల్లో కత్తులు, కట్టెలు పట్టుకుని ఊళ్లపై విరుచుకుపడ్డారు? మన మతంవారిని ఫలానాచోట చావబాదారని, చంపేశారని తప్పుడు వదంతులు వ్యాప్తి చేసిందెవరు? ఏ ప్రయోజనం ఆశించి వారలా చేశారు? దుండగులు మారణాయుధాలతో వాహనాల్లో వెళ్తూ, ఆ దారిపొడవునా ఊళ్లల్లో మార ణకాండ కొనసాగిస్తుంటే యావత్తు పోలీసు యంత్రాంగమూ, రెవెన్యూ యంత్రాంగమూ ఏమైపోయాయి? ఇలాంటి ప్రశ్నలకు నివేదికలో జవాబులేదు.
ఆ ఘర్షణలు చోటుచేసుకున్న రోజుల్లో అనేకమంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. పసిపిల్లలను సైతం ముష్కరులు పొట్టనబెట్టుకున్నారు. మతం పేరిటో, కులంపేరిటో అధికారులు కుమ్మక్కు కాకపోతే ఇంత హింసాకాండ, అరాచకం, అకృత్యాలు సాధ్యమయ్యేవా? అప్పుడు ఊళ్లొదిలి పోయి, సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నవారు అంతా చక్కబడి ఉంటుందులేనని భావించి ఈమధ్యకాలంలో స్వగ్రామాలకు వెళ్తే వారిపై దాడులు జరిగాయి. రావడానికి ప్రయత్నిస్తే ప్రాణాలు తీస్తామన్న బెదిరింపులొచ్చాయి. అత్యాచారం కేసులన్నీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో వీగిపోతున్నాయి. అదేమంటే ఆ కేసుల్లోనివారు వచ్చి బెదిరించడంవల్ల సరిగా సాక్ష్యాలివ్వలేకపోయామని బాధితులు చెబుతున్నారు. కనుక ఇప్పటికీ అక్కడ మామూలు పరిస్థితులు ఏర్పడలేదని అర్ధమవుతుంది. ఘర్షణలపై నిజనిర్ధారణ జరిపిన మానవహక్కుల సంఘాలు ఈ మొత్తం ఘర్షణల్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నదని ఆరోపించాయి. మరికొన్ని నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పథకం ప్రకారం వీటిని ప్రేరేపించారని తెలిపాయి. జస్టిస్ విష్ణుసహాయ్ కమిషన్ ఈ కోణంనుంచి దర్యాప్తు జరిపి ఉంటే ఘర్షణలకూ లేదా ఉద్రిక్తతలకూ...రాజకీయ ప్రయోజనాలకూ మధ్య ఉండే చుట్టరికం తేటతెల్లమయ్యేది. అధికార యంత్రాంగం నిర్లిప్తతకు గల కారణాలు కూడా వెల్లడయ్యేవి. ఆ పని చేయకుండా వందలపేజీలతో బరువైన నివేదిక సమర్పించడంవల్ల ప్రయోజనమేమిటి?
నిరర్ధక నివేదిక!
Published Mon, Mar 7 2016 11:42 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement