బాల్యానికి రక్షణెలా?
పిల్లల రక్షణకు సంబంధించి మనకు అనేక చట్టాలున్నాయి. వారి విషయంలో అతిగా ప్రవర్తిస్తే, నేరానికి పాల్పడితే ఎలాంటి శిక్షలుంటాయో అవన్నీ ఏకరువు పెడతాయి. అయినా ఆ నేరాల్లో తగ్గుదల లేదు. నానాటికీ పెరుగుతున్నాయి. పత్రికల్లో, చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో ఆ ఉదంతాలు నిత్యం తారస పడుతూనే ఉంటాయి. తాజాగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ విడుదల చేసిన నివేదిక దేశంలో పిల్లల స్థితిగతులు ఎలా ఉన్నాయో వెల్లడించింది. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ తరలింపు, బాలలపై లైంగిక నేరాలు, వారిలో పౌష్టి కాహార లోపం వగైరాలతోపాటు సామాజిక అశాంతి పిల్లలపై చూపే ప్రభావం, మధ్యలో బడి మానేస్తున్న, అసలు అక్షరానికే దూరంగా ఉన్న చిన్నారుల పరిస్థితిపై నివేదిక చర్చించింది. దేశంలోని ఏ జిల్లాల్లో పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో చెప్పే డిజిటల్ మ్యాప్‌ను కూడా రూపొందించారు.
దాని ప్రకారం దేశం లోని 678 జిల్లాల్లో 409... అంటే 60 శాతం జిల్లాలు బాలలకు కంటకప్రాయంగా ఉంటున్నాయి. ఒడిశా, బిహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పిల్లల అపహరణ అధికంగా ఉంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల బాలల్లో పౌష్టికాహార లోపం అధికంగా ఉన్నదని తేలింది. ఈ రాష్ట్రాలన్నిటా వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. పిల్లలకు ఓట్లుంటే పాలకులు ఎలా ప్రవర్తించేవారో గానీ... ఇప్పుడైతే వారి విషయంలో క్షమార్హం కాని నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఏటా దాదాపు 50,000మంది మహిళలు, పిల్లలు వివిధ రాష్ట్రాల్లో మాయమవుతుండగా బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వేలాదిమంది ఆడపిల్లలు ఈ నరక కూపాల్లో పడు తున్నారు. దేశంలోని వివిధచోట్ల వ్యభిచార గృహాల్లో ఉన్న నేపాల్ బాలికల సంఖ్య 2 లక్షలుంటుందని చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ చెబుతోంది.
అపహరణకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి వారిని కన్నవారి వద్దకు చేర్చాలని ది హేగ్‌లో జరిగిన సదస్సులో ఆమధ్య ఒక ఒడంబడిక కుదిరింది. అయితే సకారణంగానే మన దేశం ఆ ఒప్పందంపై సంతకం చేయలేదు. భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తి విడిపోయినప్పుడు పరస్పర అంగీకారం లేకుండా భార్య తనతోపాటు పిల్లల్ని తీసుకెళ్లడాన్ని కూడా ఆ ఒప్పందం అపహ రణగా భావిస్తోంది. అందువల్ల సంతకం చేయకపోవడం సబబేనని వేరే చెప్పనవ సరం లేదు. అయితే అంతమాత్రాన మొత్తంగా పిల్లల అపహరణ అంశంపై అసలు శ్రద్ధే పెట్టాలన్న ధ్యాస లేకపోవడం అమానుషం. కానీ జరుగుతున్నది అదే. ఇందు వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతున్నాయో తెలిస్తే గుండె చెరువవుతుంది. అపహరణకు గురవుతున్న ఆడపిల్లల్ని వ్యభిచార గృహాల్లో అత్యంత అమానవీయ మైన పరిస్థితుల మధ్య ఉంచి, మాట వినేవరకూ వారికి సరిగా నీరు, ఆహారం కూడా ఇవ్వరని ఈమధ్యే ఆంగ్ల వారపత్రిక కథనం వెల్లడించింది. వారితో వ్యభి చారం చేయించడం, బూతు చిత్రాలు తీయడం వంటివి చేస్తున్నారని తెలిపింది.
చట్టాల్లో ఉంటున్న లొసుగులు, వాటిని సరిచేయడం తక్షణావసరమని గుర్తిం చని పాలకులు, ఫిర్యాదులందినప్పుడు వాటిని స్వీకరించడానికే సిద్ధపడని, స్వీక రించినా దర్యాప్తు చేయడానికి ఆసక్తి చూపని పోలీసులు ఆ బాలలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకోవడానికి కారకులవుతున్నారు. కిడ్నాప్ ముఠాలకు రాజకీయ నాయకుల అండదండలుండటం కూడా ఈ సమస్యను మరింత జటిలం చేస్తోంది. రేపటి సమాజాన్ని సుసంపన్నం చేసేలా ఎదగవలసిన పిల్లలపట్ల ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామని వీరంతా గుర్తిస్తే తప్ప ఈ స్థితి మారదు. ఇప్పుడు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ బాలలు ఎంత దయనీయంగా బతుకులీడు స్తున్నారో అందరి దృష్టికీ తీసుకురావడం హర్షించదగిన విషయం. అయితే ఇక్క డితో ఆగితే సమస్య తీరదు. ఈ డేటా ఆధారంగా, దీనికి కొనసాగింపుగా తీసుకోవా ల్సిన చర్యలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా శాంతిభద్రతల యంత్రాంగంలో ఈ సమస్యపై అవగాహన పెంపొందించడం అవసరం. బాలల పట్ల అపచారం జరి గిందని తెలిసిన వెంటనే చర్య తీసుకునే సంస్కృతి పెంపొందాలి. నిందితుల అరెస్టు, వేగవంతమైన దర్యాప్తు, సత్వర విచారణ, దోషులకు కఠిన శిక్షలు పడటం చాలా ముఖ్యం. బాలలకు విద్యనందించడంలో, వారికి ఆరోగ్యకర జీవనాన్ని కల్పించడంలో ముందుంటానని మన దేశం ప్రతినబూనింది. అయితే ఆచరణంతా అందుకు విరు ద్ధంగా సాగుతోంది.
పిల్లలకు 14 ఏళ్ల వయసు వచ్చేవరకూ ఉచిత, నిర్బంధ విద్యనందించడం కోసం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం నీరుగారింది. ఆరోగ్యా నికి సంబంధించిన అంశాల్లోనూ అదే స్థితి. యునిసెఫ్ నివేదిక ప్రకారం నివారించ దగ్గ వ్యాధులతో ఏటా దేశంలో 2 లక్షలమంది పిల్లలు కన్నుమూస్తున్నారు. వేయి మందిలో 63మంది పుట్టిన వారం రోజుల్లోనే చనిపోతుంటే అందులో 47 శాతం మరణాలు కేవలం మశూచి, ధనుర్వాతం వంటి వ్యాధుల వల్లనే సంభవిస్తున్నాయి. ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ లభ్యత లేకపోవడమే ఇందుకు కారణం. యూపీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఇలాంటి మరణాలు అధిక సంఖ్యలో ఉంటు న్నాయి. ఇక బాల కార్మిక వ్యవస్థ వరకూ చూస్తే ఆ విషయంలో అత్యధిక చట్టా లున్న దేశం మనదే.
చిత్రంగా బాల కార్మికులు అధికంగా ఉన్నది కూడా మన దేశం లోనే. దీన్ని అరికట్టడానికి బదులు మరింత పెంచేలా నిరుడు జూలైలో 1986నాటి బాలకార్మిక వ్యవస్థ నిరోధక చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. కుటుంబ వ్యాపా రాలు, వృత్తులు, వ్యవసాయం తదితర అంశాల్లో తల్లిదండ్రులు పిల్లల సేవలను వినియోగించుకునే వెసులుబాటును ఆ సవరణ ఇచ్చింది. ఎందరు కాదన్నా దానికి పార్లమెంటు ఆమోదం కూడా లభించింది. బాల్యం పిల్లలపాలిట బందీఖానాగా, చేదు జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. అది వారి సమగ్ర వికాసానికి తోడ్పడాలి. రేపటి తరాలు బహుళ రంగాల్లో మెరికల్లా రూపొందాలంటే... వారు అన్నిటా పదు నెక్కాలంటే పిల్లలను నిరంతరం అపురూపంగా చూసుకునే వ్యవస్థ ఉండాలి. వారి రక్షణకు తోడ్పడే సకల చర్యలనూ తీసుకోవాలి. తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదిక ఆ దిశగా సాగే కృషికి ప్రాతిపదిక కావాలి.