ఈ ప్రత్యర్థుల్లో పవిత్రులెవరు? | opinion on america elections by activist Devi | Sakshi
Sakshi News home page

ఈ ప్రత్యర్థుల్లో పవిత్రులెవరు?

Published Sat, Oct 29 2016 8:12 AM | Last Updated on Thu, Apr 4 2019 3:41 PM

ఈ ప్రత్యర్థుల్లో పవిత్రులెవరు? - Sakshi

ఈ ప్రత్యర్థుల్లో పవిత్రులెవరు?

అభిప్రాయం
హిల్లరీ గెలుపుతో అమెరికాకు, ప్రపంచానికి జరిగే మేలు పెద్దగా ఉండకపోవచ్చు. కానీ అమెరికన్లు వారి కాలం చెల్లిన భావాలు కాస్తయినా మార్చుకుంటారేమో. ఏదేమైనా రెండు దుష్కృత్యాల్లో తక్కువ దుష్కృత్యాన్ని ఎంచుకునే అవకాశం మాత్రమే ఓటర్లకు ఉండటం దురదృష్టకరం.


అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రహసనం గమనిస్తుంటే ఏమాత్రం వివేకం ఉన్నవారి కయినా అమెరికా పట్ల భ్రమలు తొలగి పోతాయి. అమెరికాలో ఎవరు అధికారం లోకి వచ్చినా నడిచేది కార్పొరేట్‌ కంపెనీల రాజ్యమేననేది బహిరంగ రహస్యమే. డెమో క్రాట్లు వస్తే కాస్తయినా ప్రజల పట్ల ఉదా రంగా ఉంటారనీ, రిపబ్లికన్లయితే పూర్తిగా తిరోగమన భావజాలంతో వ్యవహరిస్తారనీ ఉవాచ. అయితే ఆర్థిక, విదేశాంగ విధానాల్లో చిన్న విభేదాలు తప్ప ఒకేరకం పంథానే వీరు అనుసరిస్తుంటారనేది అనుభవ సత్యం.

జాత్యహంకారమూ, పురుషాహంకారమూ అనేక దొంతరల ముసుగుల్లో దాగిన ఈ అగ్రరాజ్యంలో ఒక మహిళ అధ్యక్ష పదవికి పోటీదారుగా నిలబడగలగడమే ఈ ఎన్నికల ప్రత్యేకత. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ పుట్టుకతోనే శతకోటీశ్వరుడు. పరమ ఆధిపత్యపూరిత భావాలకూ, సంపన్నులకూ అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల పట్ల అతని ద్వేషపూరిత వ్యాఖ్యలు కల్లోలాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయి. వెనుకబడిన దేశాలు తమ ఖర్చుతో చదివించిన నిపుణ శ్రామికులు (ఐటీ రంగం) అమెరికా వృద్ధికి ప్రధాన కారణాల్లో ఒక భాగం. క్యాసినోలు..ఆయుధ పరిశ్రమ తప్ప అన్ని ఉత్పత్తి రంగాల్నీ నిర్లక్ష్యం చేయడంతో నిరుద్యోగం పెరిగింది. ట్రంప్‌ ఓట్ల కోసం ఇప్పుడు ఆ నిరుద్యోగుల్ని వలస ప్రజల పైకి రెచ్చగొడుతున్నాడు. తెల్లజాతి ఆధిపత్యంపై కరుడుగట్టిన క్లుక్లక్స్‌ క్లాన్, ఆయుధ లాబీలు అతడిని సమర్థిస్తున్నాయి.

నిరుద్యోగం పెరిగి సంక్షోభ స్థాయికి చేరినప్పుడు, దాన్ని నివా రించే ఆర్థిక విధానాలు అనుసరించడానికి రాజకీయ నేతలు సిద్ధంగా లేనప్పుడు.. ప్రత్యేకంగా కనిపించే శత్రువుని వారు సృష్టిస్తారు. ట్రంప్‌ సృష్టించిన శత్రువులు లాటినోలు, ఆసియన్లు, ముస్లింలు, స్త్రీలు.. ఈ బయటివారు తమకు అన్యాయం చేస్తున్నారనే భావాన్ని పెంచి పోషించినందునే కొంతయినా అతనికి మద్దతు లభించింది. నిరుద్యో గానికి, సాపేక్ష దరిద్రానికి కారణం ఆర్థిక విధానాలే అని ట్రంప్‌ ఎందుకు వాదించడం లేదు? 1. రిపబ్లికన్లు కూడా అవే ఆర్థిక విధా నాలను ప్రోత్సహించడం. 2. సంపన్నులకు లాభం పెంచే నిర్ణయాల వల్ల అత్యధికంగా లాభపడిన వాళ్లలో ట్రంప్‌ కూడా ఒకడు కావడం.

ట్రంప్‌ గత పదేళ్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని హిల్లరీ ప్రక టించారు. అట్లాగే అతని క్యాసినోల్లో, కంపెనీల్లో కార్మికులకు ఆరోగ్య బీమా వంటి కనీస సదుపాయాలు ఇవ్వడానికీ ట్రంప్‌ నిరాకరిం చడంతో వాటిని మూతబెట్టారు. దీన్నిబట్టే అతడు ఎవరికి అనుకూ లుడో అర్థం అవుతున్నది. ‘సంపన్నులు, తెల్లజాతి ఆధిపత్యంవల్లే అమెరికా బాగుపడుతుంద’ని అతను నిర్లజ్జగా ప్రకటించాడు.

అయితే ట్రంప్‌ ఎన్నికల బరిలో దిగిన క్షణం నుంచే మహిళలను కించపర్చే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. స్త్రీలు అనుభవైక్య వస్తువులని, వారి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా వారిపై లైంగిక చర్యలు చేయవచ్చని, అది మగాడి తనం అనీ తన అభిప్రాయాలు ప్రకటించిన రిపోర్టులు బయటికి వచ్చాయి. అవి చర్చించాల్సినంత ప్రాధాన్యత కల విషయాలు కాదని, తన ఆర్థిక విధానాలపై చర్చ జరగాలనీ ట్రంప్‌ వాదిస్తున్నాడు. మరోవైపు తన శారీరక సామర్థ్యంతో పోలిస్తే హిల్లరీ బలహీనురాలని అతడు చెబుతున్నాడు. అయితే కండలు తిరిగి ఉన్నంత మాత్రాన అతని మెదడు బలంగా పనిచేస్తుంద నేందుకు దాఖలాలు లేవు. కాని అతను పరోక్షంగా స్త్రీలు శారీరకంగా బలం లేనివారు కనుక పరిపాలనకు పనికిరారని చెబుతున్నాడు. అలా అయితే అమెరికన్లు ఆంబోతులనే అధ్యక్షపదవిలో ఉంచితే మంచిది కదా. లైంగిక దాడి సామర్థ్యం కూడా ఒక పాలనా అర్హతగానే భావిస్తున్నాడు ట్రంప్‌. మగ ఆధిపత్యం ఒక సహజ ప్రక్రియ అని నమ్మేవారికి అతను బాగా నచ్చుతున్నాడు.

మరో వైపున హిల్లరీ తన ఈ–మెయిల్స్‌ తొలగించడం అనేక అనుమానాలను రేకెత్తించింది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఆమె పరిధి దాటి ప్రవర్తించి ఉండవచ్చు. అయితే క్లింటన్‌ ప్రేమ వ్యవ హారం జరిగినప్పుడు హిల్లరీ ప్రవర్తన విమర్శలకు గురైంది. అనేక సార్లు వివాహేతర సంబంధాలు ఏర్పర్చుకున్నాడని ఆరోపణలకు గురైన క్లింటన్‌తో ఆమె విడివడక పోవడానికి ప్రధాన కారణం ఆమె అధ్యక్ష పదవిని జీవిత లక్ష్యంగా ఎంచుకున్నందువల్లనే కావచ్చు. అమెరికాలో అధ్యక్ష పదవి కోసం 30, 40 ఏళ్ల పాటు సంసిద్ధం అవు తారు. ‘విడాకులు పొందిన స్త్రీ’ ని ఆమోదించగల విశాల హృదయం అమెరికన్లకు లేదు. అది తనకు ప్రతికూలాంశం అవుతుందని ఆమె భావించింది. అయితే ఒక స్త్రీని పాలనా సామర్థ్యం, విధానాలని బట్టి కాక కుటుంబాన్ని బట్టి గుర్తించడం మగాధిక్యతలోని మరో కోణం.

హిల్లరీ దుస్తుల గురించి ఆమె అలంకరణ గురించి చర్చ జరిపిన స్థాయిలో ఆమె బలాలు, బలహీనతలపై మీడియా చర్చ జరపలేదు.  అయితే ఈ ఇద్దరిలో ఎవరూ నమ్మదగిన వారు కాదని సగటు ఓటరు అభిప్రాయం. అయితే స్త్రీలపై, వలసవచ్చిన వారిపై తన భావాలు చాలా సరైనవని ట్రంప్‌ బలంగా నమ్ముతున్నాడు. నిజానికి ‘నేను చేసిందే ప్రజాస్వామ్యం’ అనే అమెరికాకు ట్రంప్‌ నిజమైన ప్రతినిధి. కనుకనే ‘నేను గెలిస్తే ఎన్నికల్లో మోసం జరగనట్లు అని తను ప్రకటిం చడం అతి అహంకారానికి నిదర్శనమో, అజ్ఞానమో తేలడం లేదు.

ట్రంప్‌ అభిప్రాయాలతో దాదాపు ఏకీభావం ఉంది కనుకనే సంఘ్‌పరివారం ట్రంప్‌కు బాకాలూదే పనిలో ఉన్నారు. ఛాందస వాదులు అంతా ఒక్కటే. స్త్రీల పట్ల, అణగారిన వారిపట్ల, మైనారిటీల పట్ల వారి పొగరుబోతు దుర్మార్గ ప్రవర్తనా ఒక్కటే. అబార్షన్‌ హక్కులు కలిగిస్తే స్త్రీలకు అనుచిత అధికారం ఇచ్చినట్లే అంటున్న ట్రంప్‌కి, కుటుంబ హింస నిరోధక చట్టం ఎత్తివేయాలంటున్న వారికి ఏం తేడా లేదు. వీరు గతకాలపు మనుషులు. గతకాలపు ఆధిపత్య వ్యవస్థలను ఆధునిక కాలంలో నిలబెట్టాలనుకుంటున్నవారు.

హిల్లరీ గెలవడం వలన అమెరికాకు, ప్రపంచానికి ప్రత్యేకించి జరిగే మేలు పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఒక స్త్రీని అధ్యక్షురాలిగా ఎంచుకోవడం వల్ల అమెరికన్లు వారి కాలం చెల్లిన భావాలు కాస్త యినా మార్చుకుంటారేమో. ఏదేమైనా రెండు దుష్కృత్యాల్లో తక్కువ దుష్కృత్యాన్ని ఎంచుకునే అవకాశం మాత్రమే అమెరికన్‌ ఓటర్లకు ఉండటం దురదృష్టకరం.

వ్యాసకర్త  : దేవి, సాంస్కృతిక కార్యకర్త
ఈ మెయిల్ : pa_devi@rediffmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement