
అబద్ధం ఆయన ఆయుధం
రెండో మాట
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత సామాన్యుల అసంతృప్తికీ, అశాంతికీ గురవుతున్న మోదీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటే తప్ప, ఆంధ్రప్రదేశ్‌లో నూకలు చెల్లవని గ్రహించిన చంద్రబాబు నోట్ల రద్దును సమర్ధించక తప్పలేదు. కానీ ‘సెగ’ తనకూ తప్పదని గ్రహించినప్పుడు మాత్రమే మళ్లీ అవకాశవాద పం«థాను అనుసరించారు. గతంలో కూడానూ ఆయన ఇలాగే వ్యవహరించారు. సంస్కరణలకు బేషరతుగా చంద్రబాబు సంతకం చేశారని ప్రపంచ బ్యాంక్ ప్రకటించగా, అలా చేయలేదని, బాబు చెప్పుకోవలసి వచ్చింది!
అబద్ధాల నోటిని మూయించాలంటే అరవీసెడు సున్నం కావాలని నానుడి. అద్వితీయ పాలనా వ్యవస్థకు పునాదిగా ఉండవలసిన రాజకీయార్థిక శాస్త్రాన్ని వక్రీకరించి ప్రజా వ్యతిరేక పాలనా శాస్త్రంగా తారుమారు చేసిన ఆధునిక రాజకీయవేత్తలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒకరు. పదవి కోసం అవకాశవాద రాజకీయ సర్దుబాట్లు చేసుకోవడంలోనూ, వచ్చిన పదవిని నిలబెట్టుకోవడానికే అన్నట్టు మాట్లాడడంలోనూ ఆయన ఎంతో పెద్ద. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అధినేత ఎన్.టి. రామా రావును గద్దె దించి, తాను అధికారంలోకి రావడానికి తలపెట్టిన వైస్రాయ్ కుట్రతోనే చంద్రబాబు అబద్ధాలకు అంకురార్పణ చేశారు. అలాగే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల ప్రజా వ్యతిరేక సంస్కరణలను మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లోనే అమలు చేయడానికి అత్యుత్సాహం చూపిం చిన ఘనత కూడా చంద్రబాబుదే. ఈ సంస్కరణలను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కూడా జంకుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే ఆయన ఇక్కడ అమలు చేసి, తల ఒక్కింటికి రూ. 20,000 వంతున అప్పు మిగిల్చారు. బ్యాంక్ షరతుల మేరకు ప్రభుత్వోద్యోగులను దశలవారీగా తొలగించడం, లాభాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను దివాళా ఎత్తిం చడం, ఉద్యోగ భద్రతకు హాని తలపెట్టడం నాటి చంద్రబాబు పాలనలోని దారుణ అనుభవాలే.
మోదీ హయాంలో గుజరాత్‌లో జరిగిన మారణ కాండను ఆనాడు చంద్రబాబు ఖండించారు. కానీ రాజ్యాంగ బద్ధంగా అమ లులో ఉన్న సెక్యులర్ వ్యవస్థకు విరుద్ధమైన బీజేపీ పరివార్ ప్రభుత్వానికి 2014 ఎన్నికల తరువాత మద్దతు పలికారు. క్రమంగా టీడీపీని మోదీ సర్కారులో భాగ స్వామిని చేశారు. పార్టీ స్వతంత్ర ప్రతిపత్తికి గండికొట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలను గుప్పెట్లో పెట్టుకో వడానికి మోదీ ప్రభుత్వం పన్నిన వ్యూహంలో చిక్కుకున్న టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో స్థానాల కోసం పావులు కదుపుతూనే ఉన్నాయి.
ప్రశ్నించినందుకే వైఎస్‌ఆర్‌సీపీ మీద పగ
2014 ఎన్నికలలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నదని తెలిసి, రాష్ట్రంలో ఆ పార్టీతో పొత్తు కలిపిన వారు చంద్రబాబు. ఏమాత్రం గణనలోకి రాని నాలుగు సీట్లు గెలుచుకున్న పార్టీకి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇచ్చారు. ఈ కలయికను ప్రజాబాహుళ్యం నిరసించింది. కొంతకాలం ఆ రెండు పార్టీల మధ్య దూరం కనిపించినా, మోదీ, చంద్రబాబుల ఆర్థిక విధా నాలు పెట్టుబడిదారీ వ్యవస్థకు సానుకూలమే కాబట్టి తాజాగా ఈ అవ కాశవాద పొత్తు ఏర్పడింది. ఈ విన్యాసంలోనే శక్తిమంతమైన ఏకైక ప్రతి పక్షంగా జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో దూసుకొచ్చినదే వైఎస్‌ఆర్ సీపీ. చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఒక్కదానిని కూడా నెరవేర్చలేదు. దీనితో ప్రజానీకంలో రోజురోజుకీ పెరుగుతున్న అసహనాన్ని ప్రతిబింబించే బలమైన వాణిగా జగన్ పార్టీ నిలబడింది. పాలకపక్షం ప్రజా వ్యతిరేక విధానాలను బలంగా నిరసిస్తూ మంచి ప్రతిపక్షంగా ఉనికిని నిలబెట్టు కోవడం వల్ల శాసన సభలోనూ, బయట ఆ పార్టీ సహించలేనిదిగా మారింది. కనుకనే జగన్ పార్టీకి చెందిన కొందరు శాసనసభ్యులను ఫిరా యించేటట్టు టీడీపీ ప్రోత్స హించింది.
ఈలోగానే అవినీతినీ, నల్లధనాన్నీ అరికట్టే పేరుతో పేద మధ్య తరగతి వారి లావాదేవీలకు విరివిగా ఉపయోగపడే రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలో కూడా చంద్రబాబు తన క్రెడిట్ కోసం రద్దు ఆలోచన నాదే అన్నట్టు ప్రకటించు కున్నారు. ఈ లోగా ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలకు తన హెరిటేజ్ వాటాలను వందల కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నారు. లేదా బదలీ చేశారు. ఈ కాల మంతా ప్రధాని ఆకుకు అందని, పోకకు పొందని ప్రకటనల మధ్యనే కాల క్షేపం చేశారు.
ఎల్లెడలా వ్యతిరేకత
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిని అవినీతిపరులకు మద్దతు ఇస్తున్న వారిగా ముద్ర వేస్తున్నారు. ఇదంతా డిజిటల్ లావాదేవీలను అమలులోకి తేవడానికి చేస్తున్న పనే. ఇందుకు ఒక కాలక్షేపపు సంఘం చాటున మోదీ ప్రభుత్వం దాగవలసి వచ్చింది. దానికొక నాయకుడు కావాలి. ఆ సంఘం పేరే నగదు రహిత లావాదేవీల ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే, ‘స్థిరపరిచే సంఘం’. దీని సారథ్యాన్నే చంద్రబాబుకు అప్పగించారు. కొందరు ముఖ్య మంత్రులు సహా ఇందులో పదముగ్గురు వరకు సభ్యులు ఉన్నారు. పురిటి లోనే పుండు పుట్టిందన్నట్టు ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్ (బిహార్), మణిక్ సర్కార్ (త్రిపుర) నారాయణ స్వామి (పుదుచ్చేరి) డిజిటల్ కరెన్సీ లావాదేవీల, నగదు రహిత లావాదేవీలను వ్యతిరేకిస్తూ మోదీ ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించి, మంత్రివర్గ ఉప సంఘం నుంచి తప్పుకున్నారు. ఎందుకని? 2017 నుంచి ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలలో (ఇండియా సహా) డిజిటల్ లావాదేవాలు సాగించే ఏటీఎంలపైన సైబర్ దాడులు ఉధృ తమవుతాయని అమెరికా సైబర్ భద్రతా సంస్థ ‘ఫైబర్ ఐ’ తాజా నివేదికలో హెచ్చరించిందని మరవరాదు!
ఈ సంస్థే కాదు, సామాన్య ప్రజలు నిత్యం వాడుకునే కరెన్సీ నోట్లను రద్దు చేయడం పరమ నిరంకుశ చర్య అని ప్రపంచ ప్రసిద్ధ ఆర్థికవేత్త అమర్త్యసేన్, నోబెల్ పురస్కార గ్రహీతలు పాల్ క్రుగ్మన్, కెన్నెత్ రొగోఫ్‌లు వాఖ్యానించారు. వాడుకలో ఉన్న పెద్ద నోట్ల రద్దు ‘వర్ధమాన దేశాలకు వర్తింపజేయరాదని’ కూడా సలహాయిచ్చారు! కానీ అలాంటి పరిజ్ఞానాన్ని చంద్రబాబు లాంటి అవకాశవాద నాయకుల నుంచి ఆశించలేం! పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారనీ, పరిస్థితి ఇలాగే కొన సాగితే దేశంలో అల్లర్లకు దారితీయవచ్చనీ సుప్రీంకోర్టు హెచ్చరించినా పాల కులు పెడచెవిన పెడుతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి కుడితిలో పడి బయ టకురాలేక పెనుగులాడుతున్న ఎలుక మాదిరిగా తయారయింది.
బాబుగారి బండారం
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత సామాన్యుల అసంతృప్తికీ, అశాంతికీ గురవు తున్న మోదీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటే తప్ప, ఆంధ్రప్రదేశ్‌లో నూకలు చెల్లవని గ్రహించిన చంద్రబాబు నోట్ల రద్దును సమర్ధించక తప్పలేదు. కానీ ‘సెగ’ తనకూ తప్పదని గ్రహించినప్పుడు మాత్రమే మళ్లీ అవకాశవాద పం«థాను అనుసరించారు. గతంలో కూడానూ ఆయన ఇలాగే వ్యవహరిం చారు. సంస్కరణలకు బేషరతుగా చంద్రబాబు సంతకం చేశారని ప్రపంచ బ్యాంక్ ప్రకటించగా, అలా చేయలేదని, బాబు చెప్పుకోవలసి వచ్చింది! ఆ అబద్ధం మాసిపోకుండానే మరో ఘటన జరిగింది. ప్రపంచ బ్యాంక్ అను బంధ సంస్థ ‘డిపార్టుమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్’. ఇది మనకు వడ్డీలేని నిధులు సమకూర్చి పెడుతున్నది. అయితే ఆ నిధులను చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెడుతున్న పద్ధతిపైన అనుమానం వచ్చి నిఘా వేసి వాస్త వాన్ని కనుగొనేందుకు ప్రొఫెసర్ జేమ్స్ మేనర్ (ససెక్స్ యూనివర్సిటీ, బ్రిటన్) చేత సర్వే జరిపించింది. అది విడుదల చేసిన నివేదికలో (2001– 2002) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుమానం తెచ్చిపెట్టే వ్యాఖ్యలున్నాయి. ఆ నివేదిక
సాక్షిగా అవి:
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది కేవలం ఓ కేంద్రీకృత ప్రభుత్వ పాలనే కాదు, అత్యంత వ్యక్తిగత స్థాయిలో సాగుతున్న పెత్తనం కూడా! భారతదేశంలో మేము నిధులు సమకూరుస్తున్న కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా సంబంధిత సంస్థలతో అభిప్రాయాలు పంచు కోవడం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒకే ఒక వ్యక్తితో, అంటే ముఖ్యమంత్రితో తప్ప మరే అధికారితోనూ నిధుల గురించి చర్చించరాదు. అధికారం అంతా ఒకే ఒక్క వ్యక్తి చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. అధికార వికేంద్రీకరణకు చోటు లేదు... ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వటంతో భారీ ఎత్తున ముడుపులు ఇచ్చారు. ఇవి 10 లక్షల డాలర్ల విలువకు మించిన వందలాది ప్రాజెక్టుల విషయంలో జరిగాయి. అలాగే కొన్ని ప్రభుత్వ కార్య క్రమాల నిర్వహణకు కేటాయించిన నిధులలో మూడింట ఒక వంతు నిధు లను పక్కకు మళ్లించేందుకు పార్టీ శాసనసభ్యులను అనుమతించారు! వీరిలో నేరస్థ ముఠాలతో సహకరించినందుకు చాలామంది లంచాలు తీసుకున్నారు. సాధ్యమైనంత వరకూ ఇండియాలోని న్యాయవ్యవస్థ ప్రభుత్వానికి దూరంగా స్వతంత్ర ప్రతిపత్తితోనే వ్యవహరిస్తుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నం. నేర్పుగల ముఖ్యమంత్రి తెలివిగా న్యాయమూర్తులకు అధికార హోదాలో దగ్గరవడానికి ప్రయత్నించవచ్చు! అలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా తెలివిగా సాకుతున్నందున న్యాయమూర్తులతో తగిన పలుకుబడిని సంబంధాల్ని పెంచుకున్నారని నేను ఇంటర్వూ్య చేసిన అనేక మంది ప్రముఖ లాయర్లు, రిటైర్డ్ జడ్జీలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఖరి ఫలితంగా ప్రభుత్వంపైన కోర్టులో ఏదైనా కేసు వేస్తే, దాని వల్ల తన ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతిసే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయనకు కోర్టు నుంచి సహకారం లభించడం సర్వసాధారణం అయింది. క్రమంగా పలుకుబడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సాన్నిహిత్యం ఏర్పడే వరకు పాకిపోయింది. దానిని ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి తనను నమ్ముకున్న ఇద్దరు లాయర్ మిత్రులకు హైకోర్టులో న్యాయమూర్తులుగా నియామకం జరిగేలా చూశారు.’’
అయితే, ఇప్పటికీ అలాంటి ప్రయత్నాలు కొనసాగించే తపన చంద్ర బాబులో చావలేదు! కేంద్రం నుంచి, రెండు తెలుగు రాష్ట్రాల వరకూ మూడు పాలనా వ్యవస్థలోనూ ఇసక తక్కెడ పేడ తక్కెడ’’ విధానాలే కొనసాగుతూ, చివరికి ఎవరు ఎవరిని మోసగించుకుంటారో చూడాల్సిందే!
(వ్యాసకర్త : ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు)