
జాతీయ సమైక్యతా యుగపురుషుడు
సందర్భం
గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడైన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్వతంత్ర భారత నిర్మాతలలో ఒకరుగా గణుతికెక్కారు. స్వాతంత్య్రానంతరం సంస్థానా లను శర వేగంగా ఏకీకరణం చేసి భారత దేశ ముఖచిత్రాన్ని తిరగరాశారు.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరు కెక్కిన సర్దార్ పటేల్. 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు నాడియాద్‌లో పుట్టారు. ఆయన తండ్రి ఝవేరీ భాయ్ పటేల్ ఒక సామాన్య రైతు. తల్లి లాడ్‌బాయి ఒక సామాన్య మహిళ. బాల్యం నుంచే పటేల్‌ది ఎంతో కష్టపడే తత్వం. పెట్‌లోద్ లోని ఎన్.కె. స్కూల్‌లో చదువుకున్నాడు. 1896లో ఉన్నత విద్య పరీక్ష పాసయ్యాడు. 1897లో వల్లభ్ భాయ్ హైస్కూల్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. 1910లో పటేల్ న్యాయ శాస్త్రాన్ని అభ్యసించడం కోసం ఇంగ్లండుకు వెళ్లాడు. న్యాయ శాస్త్రంలో ప్రవీణుడైన పటేల్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని, బ్రిటిష్ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించేవాడు.
గుజరాత్‌లోని ఖేడా, బోర్ సద్, బార్ డోలీలలో పౌర సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా కర్షకులను సమీకరించి గుజరాత్ లోకెల్లా విశిష్ట నేతగా పేరు తెచ్చుకొన్నారు. 1931లో కరాచీలో జరి గిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో ఆయన నాయకత్వ స్థాయికి ఎదిగారు. 1934, 1937లలో పార్టీ ఎన్నికలను నిర్వ హించారు. పటేల్, గాంధీ ఇరువురూ స్వాతంత్య్ర పోరాటంలో భుజం భుజం కలిపి పనిచేశారు.
భారతదేశ తొలి హోంమంత్రిగా పటేల్ అనేక సంస్థానాలను భారత సమాఖ్యలోకి విలీనపరచడంలో ముఖ్యమైన భూమికను వహించారు. దేశ విభజన నేపథ్యంలో స్వతంత్ర సంస్థానాలను ఏకీకరణం చేయవలసిన అవసరం గుర్తించి తన ఉక్కు పిడికిళ్లతో ఈ విధానాన్ని అమలులో పెట్టారు. భారతదేశంలో ఉన్న ఏ భూభాగానికైనా వేరుగానో, ఒంటరిగానో ఉండిపోవాలనుకునే హక్కును తాను గుర్తించబోనని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రాల సమీకరణ, కేంద్రీకరణ, ఏకీకరణ అనే మూడు విధాల ప్రక్రియను ఆచరణలో పెట్టారు. 1947 ఆగస్టు 15 నాటికి హైదరాబాద్, జునా గఢ్, కశ్మీర్ మాత్రం భారత్‌లో కలవడానికి సమ్మతించలేదు. జునా గఢ్, హైదరాబాద్ సంక్షోభాలను పటేల్ తలపండిన రాజనీతి జ్ఞతతో పరిష్కరించారు. జునాగఢ్ నవాబు తొలుత పాకి స్తాన్‌తో కలవాలని కోరుకున్నాడు. ప్రజలు తిరగబడడంతో పటేల్ జోక్యం చేసుకొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించి ఆ సంస్థా నాన్ని పటేల్ భారతదేశంలో కలిపివేశారు. నిజాం భారత వ్యతిరేక భావనలను వ్యక్తం చేస్తే, రజాకార్లు రక్తపుటేర్లను ప్రవహింపజేశారు. పటేల్ పోలీసు చర్య పట్ల మొగ్గు చూపారు. సైన్యాన్ని జన రల్ చౌదరి నాయకత్వాన హైదరాబాద్‌కు కదలాలని ఆయన ఆదేశించారు. సేనలు 1948 సెప్టెంబర్ 17నాడు హైదరాబాద్‌లో అడుగుపెట్టాయి. నిజాం లొంగిపోవడంతో, హైదరాబాద్ భారత దేశంలో భాగమైంది.
స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం పటేల్‌ను ప్రథమ ఉప ప్రధానిని చేశారు. కేంద్ర తొలి హోం మంత్రిగాను, తొలి సమా చార–ప్రసార శాఖ మంత్రిగాను కూడా పటేల్ సేవలు అందిం చారు. 1947 అక్టోబర్‌లో పాక్ సేనలు కశ్మీర్ పైకి దండెత్తి వచ్చాయి. కశ్మీర్ రాజా హరిసింగ్ తాను ఆపదలో చిక్కుకొన్నా నంటూ సర్దార్ పటేల్‌కు కబురు పంపారు. చేయూతనిమ్మని, విలీన ఒప్పందంపై సంతకం చేస్తూ ఒక పత్రాన్ని పంపారు. భారతీయ సేనలు జమ్మూ కశ్మీర్ రక్షణకు రంగప్రవేశం చేశాయి. అలా జమ్మూ కశ్మీర్‌ను భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. అంతర్యుద్ధానికి తావు లేకుండానే, ఆయన దేశంలో సంఘీ భావాన్ని ఏర్పరచగలిగారు; ఆధునిక భారతదేశ నిర్మాతగా ప్రఖ్యాతి పొందారు. ‘బిస్మార్క్ ఆఫ్ ఇండియా’ అని కూడా గుర్తింపు పొందారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధి కారులకు శిక్షణ నిచ్చే హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సంస్థ అయిన జాతీయ పోలీస్ అకాడమీకి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అని పేరు పెట్టి జాతి పటేల్‌ను గౌరవించు కొంది. భారత్‌లోని అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ ను పటేల్ మరణానంతరం 1991లో ఆయనకు ప్రకటించారు.
రాష్ట్రీయ ఏకతా దివస్: సర్దార్ పటేల్ జన్మదినమైన అక్టోబరు 31ని ఏటా రాష్ట్రీయ ఏకతా దివస్ పేర జాతీయ స్థాయి ఉత్స వంగా పాటించాలని 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ 2014లో రాష్ట్రీయ ఏకతా దివస్‌ను ప్రారం భించారు. అలాగే వల్లభ్ భాయ్ పటేల్‌కు స్మారకంగా గుజరాత్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న విగ్రహానికి ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే పేరును పెట్టారు. 182 మీటర్ల (597 అడుగుల) ఎత్తున నిర్మించనున్న ఈ అతి భారీ విగ్రహం నర్మదా ఆనకట్టకు ఎదు రుగా కొలువుదీరుతోంది. ఇది పూర్తి అయితే, ప్రపంచంలో కెల్లా అత్యంత పొడవైన విగ్రహంగా పేరు తెచ్చుకోగలదు.
దేశభక్తిపరుడు, గొప్ప పరిపాలనాదక్షుడు, వజ్ర సంకల్పుడు, దార్శనికుడైన సర్దార్ పటేల్ భారతగడ్డపై పుట్టిన అరుదైన నాయ కులలో ఒకరు. ఆయన చూపిన ఉన్నత ఆదర్శాలు భావి తరాల యువతకు చిరస్మరణీయాలూ, అనుసరణీయాలూను.
(అక్టోబర్ 31న సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా)
వ్యాసకర్త డా: పీజే సుధాకర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్,
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, హైదరాబాద్
ఈ–మెయిల్ : pibhyderabad@gmail.com