బాధ్యత మరిచిన పార్టీలు
బాధ్యత మరిచిన పార్టీలు
Published Wed, Jan 25 2017 12:07 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాక కేంద్ర ప్రభుత్వం అందుకు ఎన్నెన్నో కారణాలు చెప్పింది. నల్లడబ్బు అంతుచూడటం మొదలుకొని నగదు రహిత ఆర్ధిక వ్యవస్థ వరకూ ఆ జాబితాలో ఎన్నెన్నో ఉన్నాయి. మిగిలినవాటి సంగతలా ఉంచి అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో పార్టీలు మితిమీరి చేసే వ్యయం, అందుకోసం భారీ మొత్తంలో ఆ పార్టీలు సేకరిస్తున్న విరాళాలు నల్లడబ్బు మహమ్మారిని నానాటికీ పెంచుతున్నాయని తెలియనిదేమీ కాదు. పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లడబ్బు గురించి అంతగా హోరెత్తించినందుకైనా ఇతర పార్టీలకు ఆదర్శ ప్రాయంగా ఉండాలని బీజేపీ అనుకోలేదు... తామే ఆ విషయంలో మెరుగ్గా ఉన్నామని చాటుకునేందుకు మరో ప్రధాన పక్షం కాంగ్రెస్ ప్రయత్నించలేదు. ఎన్నికల సంఘానికి అక్టోబర్ 30లోగా తమ తమ జమాఖర్చుల నివేదికలను సమర్పించాల్సి ఉన్నా ఈ రెండు ప్రధానపక్షాలతో పాటు మరికొన్ని పార్టీలు కూడా ఇంతవరకూ ఆ పని చేయలేదంటే నల్లడబ్బు నిర్మూలన విషయంలో వాటి చిత్తశుద్ధి ఏపాటో అర్ధమవుతుంది. దేశంలోని స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు తీసుకుంటూ ఆ లెక్కల్ని సమర్పించడంలేదని కేంద్ర ప్రభుత్వం వాటిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. గ్రీన్‌పీస్‌తో సహా దాదాపు 10,000 సంస్థల లైసెన్స్‌లు రద్దు చేసింది. వాటి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. కానీ తమ పార్టీ జమాఖర్చుల్ని గడువులోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలన్న స్పృహ ఎన్‌డీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న బీజేపీకి కొరవడింది.
నల్లడబ్బు కారణంగా దేశం ఎలా నాశనమైపోతున్నదో చెప్పడానికి మన నేతల్లో చాలామంది ఉబలాటపడతారు. తమకు అధికారం అప్పగిస్తే దాని సంగతి తేలుస్తామని ఎన్నికల ప్రచారంలో చెబుతుంటారు. అయితే నాయకులకు దగ్గర్లో మైకు లేనప్పుడో, అనుకోకుండా వారు నోరు జారినప్పుడో మాత్రమే నికార్సయిన నిజం వెల్లడవుతుంది. నాలుగేళ్ల క్రితం బీజేపీ సీనియర్ నేత స్వర్గీయ గోపీనాథ్ ముండే ఒక సెమినార్‌లో ఎన్నికల ఖర్చు నానాటికీ ఎలా పెరుగుతూ పోతోందో సోదాహరణంగా వివరించారు. 1980 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కేవలం రూ. 29,000 మాత్రమే ఖర్చు చేశానని... 2009 లోక్‌సభ ఎన్నికలకు రూ.8 కోట్లు వ్యయం చేయాల్సివచ్చిందని చెప్పారు. సరిగ్గా ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైతం నోరు జారారు. ఎన్నికల వ్యయం తడిసి మోపెడవుతున్నదని ఒక చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చెబుతూ 2014 ఎన్నికల్లో తనకు రూ.11.5 కోట్లు ఖర్చయిందని చెప్పారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం ఎన్నికల్లో నిజంగా ఖర్చుచేసిన మొత్తాన్నే ఏ అభ్యర్థి అయినా వెల్లడించాల్సి ఉంటుంది. అలా వెల్లడించలేదని రుజువైతే చట్టసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ముండే అయినా, కోడెల అయినా ఎన్నికలైన తర్వాత ఈసీకి సమర్పించిన వ్యయ నివేదికల్లో నిజాలే వెల్లడించి, పర్యవసానాలకు సిద్ధపడి ఉంటే వారి నిజాయితీని అందరూ కొనియాడేవారు. కానీ ఆ వ్యయ నివేదికల్లో మాత్రం నిబంధనల పరిమితుల్లోనే ఖర్చు చేశామని తెలిపి, అనంతర కాలంలో వేరే లెక్కలు చెప్పడంపైనే అందరికీ అభ్యంతరం. ముండే, కోడెల ఇద్దరూ తమ ప్రకటనలు సృష్టించిన వివాదాలకు జడిసి మేం చెప్పింది అది కాదని ఆ తర్వాత సర్దుకున్నారు. అది వేరే విషయం. సాధారణంగా ఎన్నికల సమయంలో పార్టీలు, అభ్యర్థులు చేసే వ్యయమంతా నగదుగానే తప్ప చెక్కుల రూపంలో ఉండదు. చాలా రాష్ట్రాలు నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించడానికి కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ కార్డు చెల్లింపులను, చెక్కు లావా దేవీలను ప్రోత్సహిస్తున్నాయి. ఆ ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తున్న పార్టీలు ఇదే నిబంధనను తమ ఖర్చులకు, తమ అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయానికి వర్తింపజేస్తాయా? అలా చేస్తే నల్లడబ్బు చాలా భాగం తగ్గిపోతుంది.
పార్టీలు, నాయకులు చెప్పే లెక్కలకూ, చేసే ఖర్చులకూ పొంతన ఉండదన్నది ఇవాళ బహిరంగ రహస్యం. నిబంధనలను పాటించి ఆడిట్ చేయించిన జమా ఖర్చుల నివేదికల్ని గడువులోగా సమర్పించాలన్న కనీస స్పృహ వాటికి లేకపోవడమే విషాదం. ఇలా నిబంధనల పాటింపుతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలకు అనేక రాయితీలు, మినహాయింపులు లభిస్తున్నాయి. రూ.20,000కు మించిన విరాళాలకు మాత్రమే పార్టీలు లెక్కలు చెప్పాల్సి ఉంటుందన్నది అలాంటిదే. ఈ నిబంధన సాకుతో చాలా రాజకీయ పార్టీలు తమకొచ్చే నిధులకు లెక్క చెప్పడంలేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఒకపక్క సాధారణ పౌరుల ఖాతాల్లో అధిక మొత్తంలో డబ్బు జమ అయితే దర్యాప్తు చేస్తామన్న కేంద్రం... ఐటీ చట్టం నిబంధన ప్రకారం రాజకీయ పార్టీలకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఉంటుం దని చెప్పడం అందరికీ గుర్తుంది. ఈ ప్రకటన కల్లోలం రేపాక కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ సర్దుకున్నారు. ఐటీ చట్టానికి తాజా సవరణ తర్వాత ఆ మినహాయింపు పోయిందన్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తున్న పార్టీలకు మినహాయింపు ఎందుకివ్వాలన్నదే సామాన్యుల ప్రశ్న. దానికి జవాబిచ్చేవారు లేరు. విరాళాలకు సంబంధించి ఉన్న పరిమితిని అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు అనేక రకాల విన్యాసాలు చేస్తున్నాయి. ఉదాహరణకు 2015-16లో బీఎస్‌పీకొచ్చిన మొత్తం ఆదాయమంతా రూ. 20,000 చొప్పున విడివిడిగా విరాళాల రూపంలో వచ్చిందే. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్‌తోసహా ప్రధాన పార్టీలన్నీ నిబంధనలను అడ్డం పెట్టుకుని తమకొచ్చే నిధుల్లో 70 శాతం మొత్తానికి లెక్కలు చెప్పడంలేదు. ఆ విరాళాలు ఎవరిచ్చారో వెల్లడించడంలేదు. అసెంబ్లీ ఎన్నికలకు రూ. 28లక్షలు, లోక్‌సభ ఎన్నికలకు రూ. 70 లక్షలు మించి వ్యయం చేయడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నా... పార్టీల ఆదాయానికీ, వ్యయానికీ మాత్రం ఎలాంటి పరిమితులూ విధించడం లేవు. ఇలాంటి లొసుగుల వల్లే నల్లడబ్బువేళ్లూనుకుంటోంది. విస్తరిస్తోంది. ప్రధాన పార్టీలైనా పారదర్శకతతో, జవాబు
దారీ తనంతో నిబంధనలు పాటించడం నేర్చుకుంటే అందరికీ ఆదర్శప్రాయమవుతాయి.
Advertisement