పురస్కారాల తీరు మారాలి
అభిప్రాయం
తన గ్రామస్తులు ఆసుపత్రికి సత్వరమే చేరడానికి వీలుగా ఒంటరిగా పర్వతాన్ని బద్దలు కొట్టిన వ్యక్తి మాంఝీ. ఒక వ్యక్తిగా సమాజంలో మార్పును తెచ్చిన అలాంటి స్త్రీ, పురుషులు ఎందరో ఉన్నారు. వారిని గుర్తించి కనీసం పద్మశ్రీ అయినా ఇవ్వనవసరం లేదా?
ఒకప్పటి ప్రముఖ హిందీ నటి ఆశాపరేఖ్‌కు మునుపే పద్మశ్రీ పురస్కారం లభించింది. కాబట్టి ఆమె తనకు పద్మ భూషణ్ కావాలని లాబీయింగ్ చేసి ఉండవచ్చు లేదా చేసి ఉం డకపోవచ్చు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం ఆమె లాబీయింగ్ చేశారనే అంటున్నారు. లిఫ్ట్ పనిచేయక పోతే, 12 అంతస్తులు మెట్లెక్కి వచ్చి మరీ ఆమె తనతో ఆ పురస్కారానికి తాను ఎలా ‘అర్హురాలో’ తెలిపారని ఆయన అంటున్నారు. ఆశా పరేఖ్ దానిని ఖండించారు. మరో కారణంగా కూడా ఈ పద్మ అవార్డుల సీజన్‌పై నీలి నీడలు ముసురుకున్నాయి. అవార్డుల కోసం ఈ నెలలో తనకు వచ్చిన సిఫారసులను ‘వేలల్లో’ కేంద్రానికి పంపాననీ, ఈ వ్యవహారం తనకు ‘తలనొప్పి’గా మారిందనీ గడ్కరీ అంతకు ముందే తెలిపారు. ఇంత వరకు ఏ రాజకీయవేత్తా అలాంటి మాట అనలేదు. కానీ రాజకీయం, నచ్చజెప్పడం, పెద్దవారితో సంబంధాలు ఉండటం వంటి అంశాలు ఆ గౌరవం ఎవరెవరికి దక్కాలనే నిర్ణయాలను కొంత వరకు ప్రభావితం చేస్తుండవచ్చు. దేశం, గొప్పదనాన్ని గుర్తించి గౌరవిస్తూ జరుపుకునే వేడుకే ఈ పురస్కార ప్రదానం.
ఇది మీరు చదివేటప్పటికే ఈ ఏడాది పద్మ అవార్డులను ప్రకటించి ఉంటారు. జాబితాలో ఉన్న వారు పతాక శీర్షికలకెక్కుతారు. వారిలో క్రీడా కారులు, గాయకులు లేదా సంగీత విద్వాంసులు, నటులు, విద్యా వేత్తలు ఉంటారు. అంతే కాదు కొందరు వ్యాపారవేత్తలు ... అవును, వ్యాపారవేత్తలే, ఈ వర్గం ఎలా వ్యాపారం చేస్తుందనేదానితో పనిలేదు... ఉంటారు. మరికొందరు రాజకీయవేత్తలు కూడా... మన దేశ నైతిక జీవితానికి ఈ వర్గం ఏం చేసిందనే పట్టింపే ఉండదు... దర్శన మిస్తారు. ప్రభుత్వం ఉన్నాగానీ, వినమ్రులైన ఇతర గొప్ప వ్యక్తులు పలువురు సమాజంలో మార్పును తీసు కొస్తున్నారు. వారెవరూ జాబితాకు ఎక్కని విధంగా ఈ పురస్కారాల ఎంపిక పద్ధతిని రూపొందించారు.
మహాత్మా గాంధీకి మరణానంతర పురస్కారంగా భారతరత్న ఎందుకు ఇవ్వలేదనో లేదా మిగతా వారికంటే ఆయన సమున్నతుడు కావడం వల్లనే ఇవ్వలేదనో నా వాదన కాదు. మరణానంతర పురస్కార ప్రదానాలు చేసిన వారు కనీసం డజను మందైనా ఉన్నారు. మరొకరు, వీర సావార్కర్ ప్రస్తుత ప్రభుత్వం మదిలో ఉండి ఉంటారు. మునుపటి ప్రభుత్వాల దృష్టిలో ఆ పేరు తప్పక ఉండి ఉండదు కూడా. ఈ రెండూ రాజకీయాల వైపే వేలెత్తి చూపేవే. వివిధ పద్మ అవార్డులను అందుకునే ఇతరులకు కూడా ఈ అవార్డుల సీజన్ గాలి తగిలి ఉండొచ్చు.
వద్మ పురస్కారాలు కూడా చాలా వరకు, టీవీ చానళ్లు సహా వివిధ సంస్థలు ఇచ్చే జీవితకాల సాఫల్యతా పురస్కారాలవంటివే. సినీ పరిశ్రమలోని ప్రతి ప్రముఖ సీనియరుకూ అలాంటి అవార్డు ఏదో ఒకటి లభిస్తుందనే నా అంచనా. కాకపోతే అంత సుదీర్ఘ మైన ఓర్పు వారికి ఉండాలంతే. వాటిని ఇచ్చేవాళ్లు కూడా... జాబితాలోని పేర్లన్నీ పూర్తయ్యే వరకు చూసిన తర్వాతే కొత్త వారిని చేరుస్తారు. అప్పటికి వారు ఎలాగూ ముసలివారై అర్హులవుతారు. ఆశాపరేఖ్ అన్నారని ఆరోపిస్తున్న ‘అర్హత ఉండటం’ అనే వాదన కూడా ఆ ఆలోచనా రీతి నుంచి పుట్టుకొచ్చిందేనా?
దేశం, ఈ పురస్కారాలను వినూత్న దృష్టితో పరికించి, గ్రహీతలకు ఉండాల్సిన అర్హతలను కొత్తగా పునర్నిర్వచించాల్సిన సమయం ఇది. గడ్కరీ కేంద్రానికి పంపానంటున్న ‘వేలకొలది’ సిఫారసులలో కొందరు గొప్ప వ్యక్తుల పేర్లు ఉండి ఉండవని నా అంచనా. ఉదాహరణకు, దశరథ్ మాంఝీ పేరు ఉండి ఉండదు. కొద్ది కాలం బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న జీతన్ రాం మాంఝీ అని పొరబడకండి. దశరథ్ మాంఝీ, రోడ్డు వేయడం కోసం ఒంటరిగా ఒక పర్వతాన్ని బద్దలు కొట్టిన వ్యక్తి.
ప్రభుత్వానికి ఆ ఆలోచన తట్టనైనా లేదు. గొప్ప వారి సరసన నిలవాల్సిన అలాంటి వ్యక్తుల జాబితా పెద్దదే ఉంటుంది. గ్రామస్తులు ఆసుపత్రికి సత్వరమే చేరాలంటే అడ్డంగా ఉన్న పర్వతాన్ని మాంఝీ సుత్తి, ఉలితోనే తొలిచేసి దారి చేశాడు. ఆ గ్రామ ప్రజలకు 70 కిలోమీటర్ల చుట్టు తిరుగుడు తప్పించాడు. నరేంద్ర మోదీ, వ్యాపార వ్యవస్థాపకులలో సహజోత్సాహోద్వేగాలను రేకెత్తింపజేయడం గురించి మాట్లాడుతున్న నేటి ప్రపంచంలో ఈ మనిషి వయసుకు కుంగి, శ్రమకు వడలినా సగర్వంగా సమోన్నతంగా నిలిచాడు. తన పేరున్నందుకే అయినా, బిహార్ ముఖ్యమంత్రిగా ఉండగా జీతన్‌రాం, దశరథ్ మాంఝీ భారత్ రత్నకు అర్హుడన్నారు.
ఒక వ్యక్తిగా సమాజంలో మార్పును తెచ్చిన అలాంటి స్త్రీ, పురుషులు ఎందరో ఉన్నారు. తన గ్రామాన్ని బ్రహ్మపుత్ర కోతకు గురికాకుండా కాపాడటం కోసం జాదవ్ పయెంగ్ 1979 నుంచి అడవిని పెం చుతున్నాడు. అదేమీ చిన్నది కాదు, 1,400 ఎకరాలు! ఆయన ఆలోచన వేళ్లూనుకోవడానికి ముందుగానీ, తర్వాత గానీ ప్రభుత్వం ఏమైనా చేసిందా?
అలాంటి వారి జాబితా లేకపోవడం కూడా వారు ఏ గుర్తింపూ లేకుండా ఉండిపోవడానికి ఒక కారణం. నేనొక్కడినే ఆ జాబితాను తయారు చేయలేనని మనవి చేస్తున్నాను. కానీ వారిని గుర్తించగలం. రామన్ మాగసెసే అవార్డుకు గాలించి, పట్టుకునే పద్ధతి ఒకటుంది. ఆ అవార్డు లభించే వరకు, గ్రహీతల కృషి కాదుగదా, వారున్నట్టు కూడా మనకు తెలియదు. అలాంటి పద్ధతిలో వీరిని కూడా గుర్తించి కనీసం పద్మశ్రీ అయినా ఇవ్వనవసరం లేదా?
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపుర్కార్ mvijapurkar@gmail.com