రాజకీయం రగిల్చిన రాచపుండు | reservation politics harming country | Sakshi
Sakshi News home page

రాజకీయం రగిల్చిన రాచపుండు

Published Fri, Jun 17 2016 12:27 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

reservation politics harming country

- సమకాలీనం

 

 ఎన్నికలప్పుడు ఓట్ల యావతో రిజర్వేషన్ కల్పిస్తామనడం కుల రాజకీయం కాదంటున్న వారు, ‘హామీ ప్రకారం రిజర్వేషన్ కల్పించండి’ అంటే...  కుల రాజకీయాలని ముద్రవేసి దుష్ర్పచారం చేస్తున్నారు. పదవులు, హోదాలు, భూములు, కాంట్రాక్టులు, అపార సంపదలు, ఉన్నతోద్యోగాలు అన్నీ ఒకే సామాజిక వర్గానికి కల్పిస్తున్న తీరు కాపులతో పాటు ఇతర కులాల్లోనూ తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. రాజకీయ స్వార్థంతో కులాల కుంపట్లు రగిల్చే కుటిల నీతి ఆగకపోతే సామాజిక అశాంతి, అలజడులు తప్పవు.

 

 ఒక చెట్టు నుంచి కొన్ని లక్షల అగ్గిపుల్లల్ని తయారు చేయొచ్చు! ఒక అగ్గిపుల్లతో లక్షల చెట్లను కాల్చి బూడిద చేయొచ్చు! అందుకే... వస్తువు గొప్పదనం కన్నా, దాని వినియోగం ముఖ్యమంటారు. కులం కొందరికి వర్ణాశ్రమ ధర్మం, కొందరికి సామాజిక చిరునామా, మరికొందరికి వృత్తి మూలం, ఇంకొందరికి సాంస్కృతిక వారసత్వం. కొందరికయితే... కులం ఫక్తు రాజకీయాస్త్రం. కులం కార్డును రాజకీయావసరాలకు వాడుకొని, అధి కారం అబ్బి అవసరం తీరాక... కుల వివక్షలేని సామాజిక దృక్పథం ఉన్నట్టు నటించడం రివాజు. ఆచరణలో మాత్రం పక్కా ఫ్యూడల్ విధానాల్ని పాటిస్తూ కులాల మధ్య చిచ్చు రేపుతారు. ఆ మంటల్లో ఆజ్యం పోసి చలి కాచు కుంటారు. ఈ వైఖరి ముదిరి పాకాన పడటం వల్లనేమో నేడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కులం ఓ సంక్లిష్ట అంశంగా తయార యింది, ప్రమాదకర స్థాయికి చేరింది. అధికారం అనుభవించడం నుంచి సంపద పంపిణీ వరకు, నిర్లక్ష్యం చూపి కొన్ని కులాలను అణచివేయడం నుంచి తమ ఆధిపత్యాన్ని దృఢపరచుకోవడం వరకు కులతత్వ ధోరణి  పెచ్చుమీరడంతో కుల వైషమ్యాలు రగులుతున్నాయి. రాజకీయం అంటిం చిన కుంపట్లు రగిలి, అవి కుల కురుక్షేత్రాలవుతాయేమోనన్న ఆందోళన పెరుగుతోంది. అంతటా అశాంతి రేగుతోంది. కాపుల రిజర్వేషన్లు, ముద్రగడ పద్మనాభం దీక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి..... దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితులు ప్రమాద సంకేతాల్ని వెలువరిస్తున్నాయి. ఇది పులిపైన స్వారీ లాంటిదని తెలిసీ అధికార తెలుగుదేశం నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు, పావులు కదుపుతున్న శైలి పచ్చి రాజకీయ విక్రీడగానే ఉంది. కుల వీధులు, కుల వాడలు, కుల గ్రామాల స్థాయి దాటి ఈ వైషమ్యాలు బజారు పోరా టాలు, గల్లీ గలాటాలు, తుపాకీ సంస్కృతి వరకు విస్తరిస్తాయేమోననే  భయాందోళనలున్నాయి.

కుల ఘర్షణల మూలాలతో ప్రసిద్ధికెక్కిన ‘బెజవాడ రౌడీ’ సంస్కృతి కొత్త రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించే ప్రమాద ముందని సామాజికవేత్తలంటున్నారు. నక్సల్ ఉద్యమం తెలుగు నేలపై బలోపేతమైన క్రమంలోనూ ఇలా జరుగలేదు, కుల వైషమ్యాలు తలెత్తలేదు. పైగా, నక్సల్ ఉద్యమంలో బడుగులకు, బలహీనవర్గాలకు దన్నుగా సాగిన సైద్దాంతిక, సాయుధ పోరులో శీర్ష భాగాన నిలిచిన వారిలో అత్యధికులు అగ్రవర్ణాల వారే! ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కుటిల ఎత్తుగడలతో రాజకీయ ప్రయోజనాల కోసం తాము నిచ్చెన మెట్లుగా వాడుకున్న కులాలనే అధికారం చేతికొచ్చాక నిష్కర్షగా తొక్కేస్తు న్నారు. ఏకపక్షంగా సంపదను, ముఖ్యంగా భూముల్ని ఒక వర్గం సొంతం చేసుకుంటున్న తీరు వారి దూకుడుని స్పష్టం చేస్తోంది. అవకాశాలు మృగ్యం చేసి ఇతర సామాజిక వర్గాల ఉనికినే ప్రమాదంలోకి నెడుతున్న తీరు అలజడి రేపుతోంది. కాపు రిజర్వేషన్లను కోరుతూ దీక్షచేస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిని ప్రజానీకం ఊపిరి బిగబట్టి చూస్తుంటే... ఇద్దరు మంత్రులు వ్యంగ్యోక్తులు విసరడం తాజా విచిత్రం! తన పార్టీలోని అదే కులం వారితో  ఎదురుదాడులు చేయించడం చంద్రబాబు మార్కు కుటిలనీతి. సున్నితమైన సామాజికాంశాల నిప్పుతో రాజకీయ చెలగాటాలాడే దమన నీతికి పరాకాష్ఠ.
 

కులం-రాజకీయాలు అప్పట్లో పాలు-తేనె
1931 నాటి జనాభా లెక్కలపై ఆధారపడే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ కులాల జనాభా అంచనాలు సాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలు మినహా మిగిలిన హిందూ కులాల నిక్కచ్చి జనాభా లెక్కల్లేవు. బ్రాహ్మణుల జనాభా రెండు శాతం కన్నా తక్కువంటారు. అప్పటి(1931) లెక్కల ప్రకారం రెడ్లు 7 శాతం, కమ్మలు 5 శాతంగా చెబుతుంటారు. కాపుల జనాభా ఆరు శాతం ఉండేదని ఒక అంచనా ఉన్నా, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వివిధ కాపు వర్గాలన్నీ ఒకటేననే వాదనతో కాపు సంఘాలు తమ జనాభా 20 నుంచి 25 శాతం అంటే మీడియా, ప్రధాన రాజకీయపార్టీలు వివాదపడకుండా ఏకీభవిస్తుం టాయి. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) ఏర్పాటు నుంచి... రాజకీయాలతో సహా ప్రధాన రంగాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎంగా ఈ వర్గానికి చెందిన టంగుటూరి ప్రకాశం పంతులు(1953), హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఇదే వర్గపు బూర్గుల రామకృష్ణారావు పనిచేశారు. వారి తర్వాత రెడ్డి కులానికి చెందిన వారే ఎక్కువమంది ముఖ్యమంత్రులై, ఎక్కువ కాలం పాలించారు.

రెండు ప్రధాన వ్యవసాయాధారిత కులాలైన కమ్మలు, రెడ్లు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ, రాజకీయాధికారంలో తగినంత వాటా సంపాదించడం సహజ సామాజిక పరిణామంగా భావించవచ్చు. ఇంకోలా చెప్పాలంటే రాజ కీయాల్లో  బ్రాహ్మణుల స్థానాన్ని ఆ రెండు కులాలూ ఆక్రమిస్తూ వచ్చాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 50-60 వరకూ ఉన్న బ్రాహ్మణుల సంఖ్య తెలుగుదేశం ఆవిర్భవించాక ఒకానొక దశలో ఒకటి, రెండుకు పడిపోయింది. తెలుగు రాజకీయాల్లో చైతన్యం పెరిగి ప్రజాస్వామీకరణ విస్తరించిన క్రమం లోనే చట్టసభల్లో ప్రాతినిధ్యం జనాభాను బట్టి నిర్ణయమయ్యే పరిస్థితులు కొంత మేరకు పొడచూపాయి. రైతు కుటుంబాల నుంచి వచ్చి విద్యావం తులైన రెడ్డి, కమ్మ యువకులే రాజకీయ చైతన్యంతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ కులాలకు చెందిన చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవ పున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, రావి నారా యణరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి, కొండపల్లి సీతారామయ్య గొప్ప కమ్యూనిస్టు నేతలయ్యారు.

ఈ వాస్తవాన్ని గుర్తించ నిరాకరించిన అప్పటి కాంగ్రెస్ నేతలు... కామ్రేడ్ అంటే, కామ్ (కమ్మ), రేడ్ (రెడ్లు) అంటూ ఎగతాళిగా మాట్లాడేవారు. మొదటి నుంచీ దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పునాదులు తెలుగునాట బలహీనమే. 1956 నుంచి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ, రెడ్డి కులాల మధ్య సమతూకం పాటించడానికే ఎక్కువ శ్రమపడాల్సి వచ్చింది. దీనికి తోడు దాదాపు అంతే జనాభా ఉందని భావించే కాపుల్లో అసంతృప్తి రాకుండా వారు బలంగా ఉన్న జిల్లాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి ప్రయత్నించారు. తెలంగాణ బ్రాహ్మణ వర్గానికి చెందిన పి.వి. నర్సింహారావును ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ నాయకత్వం చేసిన ప్రయోగం బెడిసికొట్టినా... భూసంస్కరణల వల్ల అది వికటించిందని ఆ వర్గం ప్రచారం చేయగలిగింది. ఆ క్రమంలోనే రెడ్డి వర్గానికి చెందిన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి దాదాపు 15 ఏళ్లు పాలన చేశారు. కోస్తా కమ్మ, రెడ్డి వర్గాలతో మంచి సంబంధాలున్న వెలమ నేత జలగం వెంగళ రావును 1973 డిసెంబర్‌లో ఏపీ సీఎంను చేయడం కాంగ్రెస్ జాతీయ నాయ కత్వం చేసిన తెలివైన నిర్ణయం అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఇద్దరు రెడ్డి సీఎంల హయాంలోనే కోర్టు తీర్పుల ఫలితంగా కాపులను బీసీల జాబితా నుంచి తొలగించాల్సి వచ్చినా... సదరు సామాజిక వర్గంలో అసంతృప్తి, అలజడి తలెత్తకుండా వ్యవహార దక్షతతో నీలం, కాసు చూసుకోగలిగారు. ఆ తెలివిడి తదనంతరం వచ్చిన తెలుగుదేశం నాయకత్వంలో లోపించింది.

ఎనబై దశకం నుంచే విపరిణామాలు మొదలు
1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించాక కాపులను కాంగ్రెస్‌వైపే ఉంచే వ్యూహంలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అప్పటి కాంగ్రెస్ మంత్రి సంగీత వెంకటరెడ్డి (కాపు)తో బీసీ రిజర్వేషన్ కోరుతూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి మహాసభ జరిపించింది. అయినా కాంగ్రెస్ ఎత్తుగడ ఫలించలేదు. మిగిలిన వ్యవసాయ కులాల్లో మాదిరిగానే అత్యధిక కాపు ప్రజానీకం 1983 జనవరి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తపార్టీకే ఓటేశారని అంచనా. 2014 ఎన్నిక ల్లోనూ కాపులు సానుకూలంగా మొగ్గడం వల్లే ఊహించని విజయం టీడీపీకి దక్కిందన్నది రాజకీయ విశ్లేషణ. తెలుగు దేశం పోకడలోని కుల ప్రాబల్య పద్ధతి, కమ్మ రాజకీయ ఆధిపత్యం, కులాల సమీకరణల కారణంగా కాపు రిజర్వేషన్ వ్యవహారం మళ్లీ మళ్లీ తెర మీదకు వస్తూనే ఉంది. తెలుగుదేశం తొలిసారి అధికారంలోకి వచ్చిన్నుంచీ కోస్తాలోని కమ్మల ప్రాబల్య ప్రాంతా లలో గణనీయ సంఖ్యలో ఉన్న కాపులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రయ త్నిస్తూనే ఉంది. తెలంగాణకు చెందిన మున్నూరు కాపు(బీసీ) కేంద్రమంత్రి పి. శివశంకర్... కోస్తా కాపులను కాంగ్రెస్ వైపు సమీకరించడానికి అప్పట్లో ఉపయోగపడ్డారు.

కాంగ్రెస్‌కు దూరమైన బీసీలను ఆకట్టుకోవడంలో విజయం సాధించిన ఎన్టీఆర్.. కాపులతో మాట్లాడి వారి అసంతృప్తిని తొల గించడంలో విఫలమయ్యారు. నినాదం-ఆచరణ మధ్య అంతరంవల్ల విశ్వాసం కలిగించలేక పోయారు. తదనంతర కాంగ్రెస్ (1989-94) పాలనలో అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి ఓ ప్రత్యేక జీవో ద్వారా కాపు రిజర్వేషన్ వ్యవహారాన్ని  కొంతవరకు పరిష్కరించే యత్నం చేశారు రాజకీయ ప్రయోజనం పొందలేకపోయినా, సామాజిక అశాంతి ప్రబల కుండా చూడగలిగారు. అందుకే, ముద్రగడ పద్మనాభం నాయకత్వాన కాపులు విజయభాస్కరరెడ్డిని ‘కాపుల అంబేడ్కర్’ అన్నా.. కాపు రిజర్వేషన్ వివాదానికి అది ముగింపు పలకలేకపోయింది. ఆ సమస్య నిరంతరం రగల డానికి తెలుగుదేశం అనుసరించిన కుల ప్రాపకం కూడా కొంత కారణమనే వాదన ఉంది. టీడీపీ హయాంలో కులాధిపత్య రాజకీయాల నీడన 1984లో జరిగిన కారంచేడు దళితుల ఊచకోత, తదనంతర సామాజిక పరిణామాల క్రమాన్నే మార్చింది. కులాధిపత్య రాజకీయాల వల్ల దళితోద్యమాలు, విభ జించి పాలించే టీడీపీ నీతివల్ల ఎస్సీల్లో మాల-మాదిగ ఎబీసీడీ వర్గీకరణ వివాదం రగులుతూనే ఉన్నాయి. టీడీపీ రాజకీయ ప్రాపకం వల్లే రాయల సీమ ముఠా తగాదాల్లోనూ ‘కుల’ ప్రమేయం పెరిగింది. 1984 టీడీపీలో తిరుగుబాటు, ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమం, 1988 రంగా హత్య, 1995 టీడీపీలోనే అధికార మార్పిడి వంటి పరిణామాల తర్వాత తమ రాజకీయ సుస్థిరత కోసం పార్టీలో, పార్టీ నేతృత్వపు పాలనలో కులతత్వం మరింత తీవ్రస్థాయికి చేరింది.


అవసరానికో మాట, అధికారంలో మరో మాట
మాదిగలకు తానే పెద్దన్నగా, ప్రతినిధిగా ఉంటానన్న చంద్రబాబు ఎన్నికల తర్వాత ఆ మాట మరిచారు. మాదిగలు ఆక్రోశిస్తూనే ఉన్నారు. ఓట్లేయలే దన్న కోపంతో రెండేళ్లుగా ఎస్టీలకు కూడా టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయక పోవడం ఆయా వర్గాల్లోనూ అసంతృప్తికి కారణమౌతోంది. ఇతర బీసీ కులా లలాగే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల హామీ ఇచ్చి, ఆధికారం చేజిక్కాక భిన్నంగా వ్యవహరించడం కాపుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. పార్టీలకతీతంగా కాపు నాయకులంతా ఒక్కటై ముద్రగడ ఒంటరి కాదని చేసిన హెచ్చరిక తీవ్రమైంది. ఎన్నికలప్పుడు ఓట్ల యావతో రిజర్వేషన్ కల్పి స్తామని హామీ ఇవ్వడం కుల రాజకీయం కాదంటున్న వారు, ‘హామీ ప్రకారం రిజర్వేషన్ కల్పించండి’ అని కాపులు అడిగితే... అవి కుల రాజకీయాలని దుష్ర్పచారం చేస్తున్నారు. పదవులు, హోదాలు, భూములు, కాంట్రాక్టులు, అపార సంపదలు, ఉన్నతోద్యోగాలు, ఇతరేతర అవకాశాలన్నీ ఒకే సామాజిక వర్గానికి కల్పిస్తున్న తీరు కాపులతో పాటు ఇతర కులాల్లోనూ తీవ్ర అసంతృ ప్తిని రేపుతోంది. పాలకులు తమ సామాజిక వర్గానికి చెందిన ఓ ప్రిన్సిపల్‌ను వెనుకేసుకొస్తే, అమాయక విద్యార్థిని రిషితేశ్వరి దుర్మరణం దర్యాప్తునకు మోక్షముండదు.

ఓ వీసీని వెనుకేసు కొస్తే.. రోహిత్ అకాల మరణానికి అసలు కారణాలు బయటకు రావు. ఇదీ పరిస్థితి! ఈ వాతావరణం వైషమ్యాలకు దారి తీస్తోంది. ఈ దేశంలో... పెరియార్ (తమిళనాడు), నారాయణగురు (కేరళ), సాహూ మహరాజ్ (మహారాష్ట్ర) వంటి మహనీయులు సామాజిక అంతరాలు తగ్గించడానికి కృషి చేసి, వెనుకబడిన, బలహీన వర్గాలకు దన్నుగా నిలిచారు. వారు అగ్ర-సంపన్న వర్గాలతో పోరాడి ఉద్యమించినా అది కులతత్వంతో కాదు. కుల వివక్ష లేకుండా సాగించిన ఆ పోరు... ఫ్యూడల్ పాలనా వ్యవస్థల్ని ఛేదించి, అట్టడుగువర్గాల ప్రగతికి బాటలు పరిచింది. అవి సామాజిక సంస్కరణ ఉద్యమాలుగా చరిత్రలో నిలిచాయి. కానీ, ఇప్పుడు సాగుతున్నవి సం‘కుల’సమరాలు. రాజకీయ స్వార్థం కోసం కులాల కుంపట్లు రగిలించే కుటిల నీతి ఆగనంత వరకు, సామాజిక అశాంతి, అలజడుల కత్తి మెడపై వేలాడుతూనే ఉంటుంది, కాళ్ల కింద నేలలో మందు పాతర కాచుకొనే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త!

 - దిలీప్ రెడ్డి

 ఈమెయిల్: dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement