
అలుపెరుగని సత్యాగ్రహ స్ఫూర్తి
జాతి, మత, పాలక దురహంకారాల పట్ల నిశ్శబ్ద నిరసనను పాలకులు ఎంత కఠినంగా అణచివేయాలని ప్రయత్నించినా, వారి ప్రయాస విజయవంతం కానీయని ఒక ప్రజా చైతన్య తరంగం సత్యాగ్రహం.
సందర్భం
జాతి, మత, పాలక దురహంకారాల పట్ల నిశ్శబ్ద నిరసనను పాలకులు ఎంత కఠినంగా అణచివేయాలని ప్రయత్నిం చినా, వారి ప్రయాస విజయవంతం కానీయని ఒక ప్రజా చైతన్య తరంగం సత్యాగ్రహం. రాజ్యమూ, దాని బల గాలూ సర్వ శక్తివంతమై ఉన్నప్పుడు, ‘‘సత్యంతో నా ప్రయోగాలు’’ అంటూ గాంధీజీ దక్షిణాఫ్రికాలో గడిపిన కాలం నుంచి.. ఇది మానవుల మధ్య గెలుపు ఓటముల ప్రశ్న కాదు, ప్రజలకు కావాల్సింది, సహజీవన సౌహార్ద సంస్కృతి అంటూ, తామే అధినాధులం అను కునే వారికి, వారు చేస్తున్నది తప్పు అని ధైర్యంగా చెప్పగలగడం.. 20వ శతాబ్దంలో మానవాళి చరిత్రలో ఒక గొప్ప మానసిక విజయం. గాంధీజీ దక్షిణాఫ్రికాలో శ్వేత దురహంకార ప్రభుత్వపు అమానవీయ ఆంక్షలపై చేసిన పోరాటం, ఒక ఈగ రొద వంటిది. అది కనిపిస్తుంది, కానీ కరవాలానికి అందదు. రొద ఆపదు. విద్యావంతుడు, లాయర్, రచయిత అయిన గాంధీజీ తన ఆదర్శా లకు ఒక నిర్మాణం, కార్యరూపం ఇవ్వడానికి అక్కడి భారతీయులు, ఇతర శ్వేతేతర జాతుల ప్రజలను కూడగట్టగలిగాడు.
పది వేళ్ల ముద్రలు గల ఒక గుర్తింపు పత్రం, (అంటే ఇప్పటి ఆధార్ కార్డ్ వంటిది) ప్రజలందరి వద్ద కాక, కేవలం భారతీయుల వద్దే ఉండాలన్న దక్షిణాఫ్రికా శాసనాన్ని వ్యతిరేకించాడు. భారతదేశంలో జరిగిన వివాహాలను అక్కడి పాలకులు గుర్తించ నిరాకరిస్తే, అది నిలుపుదల చేయాలని తాము నడుపుతున్న పత్రిక ‘‘ఇండియన్ ఒపీనియన్’’లో ప్రతిఘటించాడు. లండన్ నుంచి ప్రధానమంత్రులు దక్షిణాఫ్రికా వచ్చినప్పుడు, గాంధీతో సంప్రదింపులు జరిపేలా ఒత్తిడి పెంచగలిగాడు. ఈ క్రమంలోనే గాంధీ 1908లో దక్షిణాఫ్రికాలో జైలు జీవితం అనుభవించాడు. భారతీ యులపై వివక్షా శాసనాలు అమలు జరిపే ప్రభుత్వ ప్రతినిధి జనరల్ స్మట్స్. ఆయనే గాంధీ తొలి జైలర్ కూడా. ఆగస్ట్ 16, 1908న భారతీయుల ప్రత్యేక రిజిస్ట్రేషన్ పత్రాలు బహిరంగంగా తగులబెట్టే కార్యక్రమానికి గాంధీ ఏర్పాటు చేసిన సత్యాగ్రహ సంఘం సభ్యులు జోహాన్నెస్బర్గ్‌లోని హమీల్డా మసీదు వద్ద గుమి కూడారు. వేలాది అవమానపూరిత పత్రాలను దహనం చేశారు. ఆసియా ప్రజలపైగల రిజిస్ట్రేషన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, 1908- 09 కాలంలో వేలాదిమంది జైలుకు వెళ్లారు.
సౌత్ ఆఫ్రికాలో పనివారుగా ఉన్న భారతీయ శ్రామికుల పట్ల గల వివక్షను, మూడు పౌండ్ల పన్ను వగైరాలను తొలగించాలని, గాంధీజీ ఇచ్చిన పిలుపుతో అక్కడ ఎప్పుడూ లేనంతగా అలజడి చెలరేగింది. సామూహిక ప్రదర్శనలు, లాంగ్ మార్చ్‌లు జరి గాయి. ఒక దశలో వేలాదిమంది గని కార్మికులు అరెస్ట్ అయ్యారు. ఈ అలజడి దేశవ్యాప్తంగా అలుముకునే ప్రమాదకర పరిస్థితుల్లో గాంధీని అరెస్ట్ చేశారు. కానీ, గని పనివారి సమ్మె కొనసాగు తుంది. ఆ సమయంలో యూరోపియన్ రైల్ రోడ్ కార్మికుల సమ్మె కూడా జరిగింది. ప్రభుత్వం, దేశం, దిగ్బంధంలో ఉండగా, తాము డర్బన్‌కు తలపెట్టిన బహిరంగ యాత్రను గాంధీ నిలుపుదల చేసి, ‘‘మన ప్రత్యర్థి ఇబ్బందుల్లో ఉండగా, మనం వారికి సమస్య కారాదు’’ అని ప్రభుత్వంతో సంఘీభావం ప్రకటిస్తాడు.
అపుడు స్మట్స్ కార్యదర్శి ‘‘మీ ప్రజలు అంటే ఇష్టం లేదు మాకు, వారికి సాయంచేయాలని కూడా మాకు లేదు. కానీ మాకు అవసరాలున్నప్పుడు, మీరు ముందుకొచ్చి మాతో సహకరిస్తారు. అటువంటి మిమ్మల్ని, మీ అనుచరులను ఎలా మేం బందీలను చేయగలం? మా ఇంగ్లిష్ కార్మికుల సమ్మెల్లో లాగా మీరు కూడా హింసకు పాల్పడితే, మిమ్మల్ని ఇట్టే అణచి వేయగలం. కానీ మీరు శత్రువుకు కూడా హాని కలిగించరు. మిమ్మల్ని మీరు బాధలకు, దురవస్థలకు గురి చేసుకుని, ఆ క్రమంలో ఒక విజయం పొందా లని తపిస్తారు. ప్రత్యర్థుల పట్ల మర్యాదతో, సౌజన్యంతో నడు చుకుంటారు. అదే మమ్మల్ని మీ పట్ల పూర్తిగా నిస్సహాయులను చేస్తున్నది’’ అని గాంధీ సత్యాగ్రహం విషయంలో తాము ఎలాంటి సందిగ్ధతలో చిక్కుకున్నది వివరిస్తాడు.
1915లో భారత దేశంలో అడుగు పెట్టేసరికి, ఈ దేశం ఎరుగని ఒక ఆత్మశక్తితో వచ్చాడు. 1917 ఏప్రిల్ 10న బిహార్‌లోని చంపారన్‌లో గాంధీ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి సత్యాగ్రహం మొదలై రెండేళ్లు కొనసాగింది. తాను ఈ దేశ ప్రజలతో కలసి నడిపించిన దేశ విముక్తి పోరాటం, తన జీవిత కాలంలోనే విశాల ప్రపంచం గుర్తించేలా విజయవంతం కావడానికి 1915 నుంచి 1947 దాకా ముప్ఫై రెండేళ్ల కాలం పట్టింది. దేశ దేశాల జైళ్లు, జైలర్లు, యుద్ధాలు, అణచివేతలు, తూటాలు, ఆయన బక్కపలు చని దేహంలోని వజ్ర సంకల్పాన్ని తాకలేకపోయాయి. గాంధీజీ జయంతినాడు, మనం ఎక్కడున్నామో ఒక్కసారి ఈ దేశ ప్రజలు ఆలోచించవలసిన సమయం ఇది. వారికి నా అంజలి.
(నేడు మహాత్మాగాంధీ 147వ జయంతి, చంపారన్ సత్యాగ్రహానికి వందేళ్లు సందర్భంగా)
వ్యాసకర్త కవి, విమర్శకులు 98492 00385
- రామతీర్థ