సహజీవనంపై స.హ.అస్త్రమా?
విశ్లేషణ
ఇరువురు అర్హుల మధ్య సహజీవనాన్ని వివాహంగా భావించాలని ఎన్నో కోర్టులు తీర్పులు చెప్పాయి. ఇలాంటి అంశాలపై అనవసర వ్యాజ్యాలతో సమాచార హక్కును భ్రష్టు పట్టించకూడదు.
గోప్యతను రక్షించే బాధ్యత ప్రభుత్వ సంస్థలపైన ఉంది. ఆర్టీఐ చట్టం ఇచ్చిన సమాచార హక్కు అస్త్రంతో వ్యక్తిగత జీవితాల గోప్యతపైన దాడులు పెరుగుతున్నాయి. బంధువులు, భార్యాభర్తలు, సోదరులు, భార్యాభర్తలు, సోదరులు, ఒకరిపైన ఒకరు కత్తులు దూస్తూ ఆర్టీఐని అందుకు వాడుకుంటున్నారు. అది కచ్చితంగా దుర్వినియోగం, దుర్మార్గం. సుపరిపాలన కోసం ప్రజా శ్రేయస్సు కోసం, హక్కుల రక్షణ కోసం అన్యాయాలను వెలికి తీయడం కోసం అవినీతిని ప్రశ్నించడం కోసం ఆర్టీఐని వినియోగించాలి. పగలు ప్రతీకారాలతో, వ్యక్తిగత ద్వేషాలతో, బంధుత్వపు ఈర్ష్యలతో, పై అధికారుల మీద కోపంతో, పక్కవాడిని వేధించాలన్న దురు ద్దేశంతో ఆర్టీఐనీ వినియోగించడం ఏమాత్రం న్యాయం కాదు. పదే పదే ఒక సమాచారం గురించి, ఒకరి గురించే అనేక ప్రశ్నలు వేయటం చాలా తప్పు. ఇటువంటి దుర్వినియోగాల వల్ల అసలు అవసరాల కోసం, లక్ష్యాల కోసం ఆర్టీఐని వాడే అవకాశాలు తగ్గుతాయి. అందువల్ల సుపరిపాలనా సాధన ప్రయత్నాలకు హాని కలుగుతుంది.
ఒక ప్రొఫెసర్ వివాహితుడై ఉండి, ఇద్దరు పుత్రులను కలిగి ఉండి కూడా మరొక మహిళా ప్రొఫెసర్‌తో సహజీవనం చేస్తున్నాడని ఆయన భార్య సవతి సోదరుడు విశ్వవిద్యాలయానికి ఫిర్యాదు చేశారు. దానిపైన ఏ చర్య తీసుకున్నారో తెలియచేయాలని ఆర్టీఐ కింద యూనివర్సిటీ పీఐఓకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ ఫిర్యాదుపై ఒక ముగ్గురు సభ్యుల కమిటీ వేశారు. వారు విచారణ జరిపి ఇది ఆ ఇద్దరు ప్రొఫెసర్ల వ్యక్తిగత వ్యవహారమని, దరఖాస్తుదారుడు కావాలంటే కోర్టులో కేసు వేసుకోవచ్చని నివేదిక ఇచ్చారు. సంబంధిత ప్రొఫెసర్ల అభిప్రాయాన్ని అడిగితే.. దీనిపైన తాము వ్యాఖ్యానించేదేమీ లేదని, తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వరాదని విడివిడిగా రాసిన లేఖల్లో ఇద్దరు అధ్యాపకులు కోరారు. విశ్వవిద్యాలయం విచారణా నివేదికను ఆర్టీఐ అభ్యర్థన చేసిన సోద రుడికి ఇచ్చింది.
అధ్యాపకులు రాసిన లేఖల ప్రతులు కూడా ఇవ్వాలని కోరుతూ సమాచార కమిషన్‌లో అప్పీలు చేశారు. తనకు, ప్రొఫెసర్‌కు మధ్య ప్రస్తుతం వివాహ బంధం ఏదీ లేదని, తాను చాలా సంవత్సరాల కిందటే విదేశాలకు వెళ్లిపోయి అక్కడ స్థిరపడ్డానని, తన సోదరుడికి ఈ విషయంతో ఏ సంబంధమూ లేదని తన సవతి సోదరుడు అడిగిన సమాచారాన్ని ఏదీ ఇవ్వరాదని సోదరి విశ్వవిద్యాల యానికి వినతి చేశారు. అయితే అప్పటికే విశ్వవిద్యాలయ అధి కారులు విచారణ నివేదిక ఇచ్చారు. అది ఇవ్వాల్సిన అవ సరం లేదు.
తన సోదరి తరపున ఆమె శ్రేయస్సు కోసం సమాచారం అడుగుతున్నారేమోనని అనుకో వడానికి వీల్లేదు. ఎందుకంటే వారి సోదరి చాలా స్పష్టంగా వీరికి సమాచారం ఇవ్వకూడదని రాశారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నడవడికపై ఇది ఫిర్యాదు అనుకోవచ్చా అనేది మరో ప్రశ్న. సోదరుడు ఆరోపించినట్లు బహుభార్యాత్వ (బైగమీ) నేరానికి లేదా అక్రమ సహజీవనం (లివ్ ఇన్) తప్పిదానికి లేదా అక్రమ సంబంధానికి (అడల్టరీ) పాల్పడి ఉంటే చర్య తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వ సంస్థపైన ఉంటుంది. ఇరువురి మధ్య వివాహ సంబంధం తెగిపోయిన తర్వాత వారు మరొక వివాహం చేసుకున్నా, బహు భార్యాత్వం కాదు. మరొకరితో సహజీవనం చేసినా నేరం లేదు. వారిపైన తీసుకోవలసిన చర్య ఏమీ ఉండదు. ఒకవేళ ఎవరైనా బహు భార్యాత్వ నేరానికి పాల్పడితే ఇద్దరు భార్యల్లో ఒకరు ఫిర్యాదు చేయాలి. వారి సోదరుడికి ఫిర్యాదు చేసే అర్హత లేదు. అక్రమ సంబంధం నేరారోపణలో తన భార్యను మరొకరు లోబరుచు కున్నారని భర్త ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. మరెవరో కాదు.
ఇక అక్రమ సహజీవనాన్ని నేరంగా ఏ చట్టమూ ప్రకటించకపోగా, ఇరువురు అర్హుల మధ్య సహజీవనాన్ని వివాహంగా భావించాలని ఎన్నో కోర్టులు తీర్పులు చెప్పాయి. కనుక ఏ కోణం నుంచి చూసినా విశ్వవిద్యాలయం దర్యాప్తు చేయతగిన నేరంగానీ, దుష్ర్పవర్తన గానీ అందులో లేదు. కనుక సోదరుడికి ఏ చర్యా అవసరం లేదని చెబితే పూర్తి సమాచారం ఇచ్చినట్లే. నిజానికి ఇదంతా కచ్చితంగా వ్యక్తిగత సమాచారమే కనుక సోదరుడికి సెక్షన్ 8(1)(జె) కింద సమాచారం నిరాకరించే అవకాశం ఉంది. కాని సమాచారం ఇచ్చేశారు. అతను అడుగుతున్నది ఏమిటంటే ఆ ఇద్దరూ రాసిన లేఖల ప్రతులు మాత్రమే. వారు చేసిన వ్యాఖ్యలే మిటి అని.
కనుక ఈ ఉత్తరాల ప్రతి ఇవ్వడం వల్ల నష్టమేమీ లేదు. ఇవ్వకపోతే ఏదో దాస్తున్నారనుకుంటారు. అందులో ఏదో ఉందని పుకార్లు చెలరేగుతాయి. పుకార్లకు విరుగుడు నిజాలను బయటపెట్టడమే. తన సోదరి రాసిన లేఖను ఈ సోదరుడు అడగటం లేదు. నిజానికి అడగకపోయినా ఇవ్వవలసినది సోదరి రాసిన లేఖ. అందులో వివాహ బంధం లేదనే నిజంతో పాటు ఈ సోదరుడికి అడిగే అర్హత లేదని. అతనికి ఏ సమాచారం ఇవ్వరాదనే ఆంక్షలున్నాయి. ఇవి ఆ సోదరుడికి తెలియవలసిన అవసరం ఉంది. ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం పేరు ప్రతిష్టలు రక్షించడానికి, ఆ ఇద్దరు అధ్యాపకులూ పుకార్లకు గురికాకుండా ఉండటానికి, సోదరి ప్రతిష్ట హక్కును కాపాడటానికి ఈ ముగ్గురు రాసిన లేఖల ప్రతులు ఇవ్వాలని సమాచార కమిషన్ ఆదేశించింది. అధ్యాపకుల పేర్లను గోప్యంగా ఉంచాలన్న సూచన మేరకు, వారి పేర్లు ఇవ్వడం లేదు. వ్యక్తుల పేర్లతో ప్రమేయం లేదు. అనవసర వ్యాజ్యాలతో సమాచార హక్కును భ్రష్టు పట్టించకూడదు. (CIC/D/A/2013/002353-SA కేసులో మార్చి 2న కమిషన్ ఇచ్చిన తీర్పు ఆధారంగా)
వ్యాసకర్త కేంద్ర సమాచార శాఖ కమిషనర్, మాడభూషి శ్రీధర్
professorsridhar@gmail.com