ప్రభుత్వ ఈ-మెయిల్స్‌నూ కోరవచ్చు
విశ్లేషణ
ప్రభుత్వ అధికారులకు విన్నపాలు ఎక్కడ ఏ విధంగా చేసుకోవాలి? జనం తమ కష్టాలు చెప్పుకోవడానికి సులువైన పద్ధతులు అందు బాటులో ఉండాలి. కష్టాలు చెప్పుకోవడానికి వీలు కల్పించకుండా చేయగలి గిందేమీలేదు. ఈ- పాలన, డిజిటల్ ఇండియా, ఈ-కామర్స్ అని మాట్లాడుకుంటున్నాం. సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని ప్రతివారికి ఈ-మెయిల్స్ పంపే అవకాశం వచ్చింది. కాగితాలు, పోస్టల్ కవర్లు, స్టాంపులు అవసరం ఉండ కూడదు. ఈ-మెయిల్ చేసి జవాబులు పొందడానికి ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వాలు డిజిటల్ ఇండియా డిజిటల్ ప్రపంచం అంటే అర్థం లేదు. ప్రభుత్వాధి కారికి జనం చెప్పుకునేందుకు ఒక ఈ-మెయిల్ అడ్రసు ఉండడం, అది పనిచేస్తూ ఉండడం ప్రాథమిక అవసరం. ఆ ఈ-గోడు తమకు ముట్టిందని తెలియ జెప్పాలి. ఆ తరువాత ఆ గోడును పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలి. లేకపోతే పరిష్కరించలేక పోవడానికి కారణాలు తెలియ జేయాలి. ఇది పరి పాలనలో ముఖ్యమైన అంశం.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అధికారులకు ఈ-మెయిల్ ఐడీలను తయారు చేసిన నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ వారు ఆ మొత్తం ఈ-మెయిల్ ఐడీలను ఇవ్వాలని, అవి చాలా ఎక్కువగా ఉన్నట్టయితే ఒక సీడీ రూపంలో ఇవ్వాలని న్యాయవాది మణిరాం శర్మ ఆర్టీఐ కింద కోరారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) కింద ఆయా ప్రభుత్వ కార్యాలయాలు తాము జనానికి అందించే సేవలేమిటో, ఎంతకాలంలో చేస్తారో వివరిస్తూ కష్టాలు, ఫిర్యాదులు ఎవరికి, ఏ విధంగా చెప్పుకోవాలో కూడా తమంత తామే వివరించాలి. కనుక ఆ ఈ-మెయిల్ ఐడీలు ఇవ్వాల్సిందేనని వాదించారు.
వివిధ విభాగాలు వారు కోరిన విధంగా వెబ్‌సైట్‌లూ, ఈ-మెయిల్ ఐడీలూ తయారుచేసి ఆ ప్రభుత్వశాఖల వారికివ్వడం వరకే తమ బాధ్యత అని, తరువాత తమ దగ్గర అవి ఉండబోవని, కనుక తాము ఇవ్వజాలమని ఎన్‌ఐసి ప్రజా సమాచార అధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. అన్ని ఈ-మెయిల్ ఐడీలను ఒకచోట సీడీలో ఇస్తే హాకర్లకూ, సైబర్ నేరగాళ్లకూ అదొక సులువైన నేర సాధనం అవుతుందని, ప్రభుత్వ వెబ్‌సైట్ల సమా చారం అపహరించడానికి, వాటిని స్తంభింప చేయ డానికి, వారు దాడులు చేస్తారని సైబర్ నిపుణులు సమాచార కమిషన్‌కు వివరించారు.
వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల కోసం తయారు చేసిన ఈ-మెయిల్ చిరునామాల సమాచారం మూడో వ్యక్తి సమాచారం అవుతుంది కనుక వారి అనుమతి తీసుకోకుండా తాము వాటిని ఇవ్వజాలమని, వారి అనుమతి తీసుకోవడం చాలా పెద్ద పని అవుతుందని కూడా ఎన్‌ఐసి వారు వాదించారు. ఈ వాదన సమంజసం కాదు.
ఈ కేసు అనేక దశలు దాటి, ముగ్గురు సభ్యుల సమాచార కమిషన్ పీఠం ముందుకు వచ్చింది. సీనియర్ కమిషనర్లు బసంత్ సేథ్, యశోవర్ధన్ ఆజాద్‌తో నేను కూడా విచారణలో ఉన్నాను. ప్రజల ఫిర్యాదుల విచారణకు, నివారణకు ఈ-మెయిల్ కాంటాక్ట్‌లు ప్రజారంగంలో ఉండడం చాలా అవసరం అన్న వాదం సరైనదే. అది ప్రజాప్రయోజనకరమైన అంశమే. ఈ-మెయిల్స్‌ను తయారు చేసి, పనిచేయించే పరిజ్ఞానం, బాధ్యత ఉన్న ఎన్‌ఐసీ మాత్రమే ఇవ్వగలదు కనుక వారిని వివరాలు అడగడంలో కూడా తప్పులేదు. ఎన్నో ఈ-మెయిల్ ఐడీలు అసలు పనికిరావని, అవి పని చేస్తున్నాయోలేదో తెలియక జనం తమ మహజర్లు పంపుతూ ఉంటారని, కనీసం పనిచేసే ఈ-మెయిల్ ఐడీలు ఏవో చెప్పవలసిన బాధ్యత ఉందని లాయర్ ఆర్‌కె జైన్ గుర్తు చేశారు. ఈ-మెయిల్స్ అన్నీ టోకున ఇస్తే గుండుగుత్తగా అన్ని వెబ్‌సైట్‌ల మీద దాడిచేసే ప్రమాదాలను ఆపడం ముఖ్యమైన అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ-మెయిల్ విషయమై విధాన ప్రకటన చేసింది. ఆ విధానాన్ని అమలు చేసే బాధ్యత ఎన్‌ఐసీకి అప్పగించింది. ఎన్‌ఐసీ తయారు చేసిన ఈ-మెయిల్ ఐడీలనే వాడాలని; గూగుల్, యాహూ వంటి ప్రైవేటు సంస్థల ఈ-మెయిల్ ఐడీలను ప్రభుత్వ అధికారులు, తమ అధికార కార్యక్రమాలకు వినియోగించకూడదని కూడా కేంద్రం నిర్దేశించింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడం, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు, మొత్తం దేశానికి ఒక ఈ-మెయిల్‌డెరైక్టరీని తయారు చేయాలని ప్రభుత్వం ఎన్‌ఐసీని ఆదేశించింది.
ఒకే వేదిక మీద సమాచార సంచార సమ్మేళనం కోసం కేంద్రం కృషి చేస్తున్నది. ఒక సమగ్రమైన ఈ-మెయిల్ అనుసంధానం, అన్ని ప్రభుత్వ రంగాలు, శాఖలను కలిపే ఒక వేదికను, వెబ్ డెరైక్టరీ తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రజల అభిప్రాయాలు కూడా కోరారు. కనుక పారదర్శకత్వం కోసం, పాలనను మెరుగుపరచడం కోసం, అధికారులను ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం సమగ్రమైన ఈ-మెయిల్ డెరైక్టరీని ఎన్‌ఐసీ తయారు చేయాలని, అందుకు ప్రభుత్వ విభాగాలన్నీ సహకరించాలని, సైబర్ దాడులను నివారించే కృషి చేయాలని ఎన్‌ఐసీ ముగ్గురు కమిషనర్లు ఆదేశించారు. (మణిరాం శర్మ వర్సెస్ ఎన్‌ఐసీ NIC, CIC/BS/A/2012/001725, లో ముగ్గురు సభ్యులధర్మాసనం 16 డిసెంబర్ 2015న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్: మాడభూషి శ్రీధర్
professorsridhar@gmail.com