
కన్నీటి గానం.. తీస్తా!
ఆలోచనం
మమతను లేదా బెంగాల్‌ని ఉద్దేశించి షేక్ హసీనా ’’మనం లాలన్‌ని, రవీంద్రుని, సుందర వనాలనీ అన్నిటినీ ప్రేమగా పంచుకున్నాం, ఇపుడు తీస్తా నదీజలాల వద్ద మాత్రం ఎందుకు ఘర్షణ పడాలి’’ అని అన్నారు.
రైవల్ ప్రత్యర్థి అనే పదం ‘రైవస్’ ప్రవాహం అనే గ్రీకు పదం నుంచి పుట్టిందని చది వినపుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నీరు కేంద్ర బిందువుగా మనుష్యుల మధ్య జరిగే తగవులు నిజంగా అత్యంత పురాతనమైనవి, అత్యంత ఆధునికమైనవీ కూడా. మొన్నటికి మొన్న ‘గోదావరి అలల మీద కోటి కలల గానమా పోరు తెలంగాణమా, మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా’ అని గద్దర్ గర్జించింది, తెలుగు రాష్ట్రం రెండు ముక్కలైందీ నదీ జలాల కోసం కూడా.
సిద్ధార్థ గౌతముని శాక్య రాజ్యానికి, పక్కనే వున్న కొలియల రాజ్యానికి మధ్య రోహిణీ నది ప్రవహించేది. సిద్ధార్థుని 28వ ఏట శాక్య సేనాధిపతి రోహిణీ నదీ జలాల వివాదానికి యుద్ధం తప్ప మరో మార్గం లేదని ‘సంఘం’ ముందు ప్రతిపాదించినపుడు సిద్ధార్థుడు ‘యుద్ధం వలన సమస్య పరిష్కారం కాదు, అది మరో యుద్ధానికి కారణం అవుతుందని’ ఆ ఆలోచనను తీవ్రంగా ఖండిస్తాడు. సేనాధిపతి యుద్ధానికి అనుకూలంగా సంఘసభ్యులను కూడగట్టి తదనంతర పరిణామంగా సిద్ధార్థుడిని పరివ్రాజకత్వం స్వీకరించేట్లు చేస్తాడు. అలా సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారడం వెనుక రోహిణీ నదీజలాల వివాదం ఉందని చరిత్ర చెప్తుంది. ఈ సందర్భంలోనే సంఘం ఎదుట సిద్ధార్థుడు ‘శత్రుత్వంతో శత్రుత్వం సమసి పోదు, దానిని ప్రేమతో మాత్రమే జయించగలం’ అని అన్నాడు. ఇప్పుడు ఈ 2017వ సంవత్సరంలో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా, తీస్తా ఒప్పందం సందర్భంలో మెక్సికన్ కవి ‘ఆక్టేవియో పాస్’ వాక్యం ‘friendship is a river’ని ఉటంకిస్తూ ఇదే భావాన్ని వ్యక్తపరిచారు.
బంగ్లాదేశ్ తన దేశంలో ప్రవహించే 57 నదులలో 54 నదులను ఇతర దేశాలతో పంచుకుంటూ వుంది. అందులో తీస్తా కూడా ఒకటి. తీస్తా జలాలపై 5,427గ్రామాలు, 7.3%ప్రజలు, 14% బంగ్లాదేశ్ భూభాగం ఆధారపడి వుంది. వేసవి సమయాలలో తీస్తా నది జలాలు సరిపడినంత అందక దాదాపు 5 జిల్లాల ప్రజలు తాగు, సాగు నీరు లేక కటకటలాడుతారు. తన దేశపు పేదరికాన్ని పారదోలేందుకు తీస్తా నీటిలో సగం పాలును కోరుకుంటున్నారు షేక్ హసీనా. విదేశీ దౌత్య రాజకీయాలలో భాగంగా బీజేపీ ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో అనేకరకాలుగా బాంధవ్యాన్ని పెంచుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే తీస్తా ట్రీటీకి కూడా సుముఖంగా ఉంది. అయితే తీస్తా ఎగువ ప్రాంతమైన బెంగాల్ సీఎం, ఈ ఒడంబడికకు మన్మోహన్ సింగ్ హయాంలోలాగానే నేడు కూడా సుముఖంగా లేరు.
తీస్తానదీ జలాలను బంగ్లాదేశ్ ఆకాంక్షల మేరకు పంచుకోవాల్సి వస్తే ఉత్తర వంగదేశ రైతులు అన్యాయానికి గురవుతారని మమతా బెనర్జీ వాదిస్తూ ఉండగా, మమత మొండి పట్టుదల వెనుక jmbని బలపరిచే సలాఫీ ముస్లిములు ఉన్నారని, ముస్లిములు తన ప్రధాన ఓటు బ్యాంకు కనుక మమత వారి మాట జవదాటదని ఒక వర్గం, ఒడంబడికపై సంతకం చేసేలోపు ఆర్థికంగానూ, రాజకీయంగానూ కేంద్రంనుంచి వీలయినంత లాభాన్ని రాబట్టాలని మమత ప్రయత్నిస్తుందని మరొక వర్గం అభిప్రాయపడుతూంది.
బంగ్లాదేశ్, బెంగాల్‌ది ఉమ్మడి చరిత్ర, ఉమ్మడి సంస్కృతి. ఇద్దరి భాషలు ఒక్కటే. భాషా ప్రాతిపదికన బంగ్లాదేశీయులు పాకిస్తాన్‌తో కొట్లాడినపుడు వారికి నైతిక మద్దతు కూడగట్టింది వంగదేశీయులే. ఇప్పటికీ ఇరువురు, తమది ఒకే జాతి అని బలంగా నమ్ముతారు. 2016లో గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా శంఖాచిల్ (bound-less) ఒకే నది పేరు, నది నీవు ఎవరివి? హిందువుల దానివా, ముస్లిమువా అంటూ ఇరు ప్రజల ఆకాంక్షలను దృశ్యీకరించింది. అదే విషయాన్ని ఎంతో సౌహార్ద్రతతోనే అయినా సూటిగా తన ఉపన్యాసంలో మమతను లేదా బెంగాల్‌ని ఉద్దేశించి షేక్ హసీనా ‘‘మనం లాలన్‌ని, రవీంద్రుని, సుందర వనాలనీ అన్నిటినీ ప్రేమగా పంచుకున్నాం, ఇపుడు తీస్తా నదీజలాల వద్ద మాత్రం ఎందుకు ఘర్షణ పడాలి’’ అని అన్నారు. రానున్న రోజులు, మమత నిర్ణయాన్ని, అనేకమంది బంగ్లాదేశీయుల దాహార్తి భవి తను తేటతెల్లం చేయబోతున్నాయ్.
ముగించేముందు ఒక చిన్న ముచ్చట, షేక్ హసీనా ఫోన్ రింగ్టోన్ ‘హ్రిద్ మాఝారే రాఖీబో చేరేదీబోనా’ నిను నా హృదయాంతరంలో దాచేసుకుం టాను, విడిచిపెట్టను అనే ‘బౌల్ జానపదపు’ పాటట. అత్యంత మధురమయిన ఈ పాటలోని ఒక వాక్యం ‘కొతొ లక్కో జనమ్ గురె గురే ఆర్ పేయెచ్చి ఏ మానవ జనమ్, ఏ జనమ్ చొలేగెలే ఆర్ పాబోన ఆర్ మిల్బేనా’ ‘ఎన్నో లక్షల జన్మలు చుట్టి వచ్చాక మహత్తరమైన ఈ మానవ జన్మ ఎత్తగలిగాను ఈ జన్మ ముగిసిపోతే మళ్లీ పొందలేను, మళ్ళీ దొరకదు’ అని. పురాణాలు కూడా అదే చెప్తాయి కదా. మరి, ఎన్నో లక్షల జన్మల తరువాత అపురూపమయిన ఈ మానవ జన్మ ఎత్తిన మనుషులందరం కులాలకు, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అద్భుతమైనవారమే కదా. ఒకసారి ఆ విశ్వమానవ భావనలోకి వస్తే, అప్పుడు ఆ దేశం, ఈ దేశం అని కాదు, మనుషులుగా మనందరం ఒక్కటి, అన్నింటినీ కలిసి పంచుకుందాం అనే అంతిమ మతంలోకి బహుశా చేరుకుంటాం. అప్పుడిక నదీ జలాల గురించే కాదు దేని గురించీ వివాదాలు వుండవు. మానవీయత, సహృదయత అన్నింటికంటే గొప్ప మతాలు! కదా!
సామాన్య కిరణ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
91635 69966